
కరీంనగర్‌లోని సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ నుంచి 400 ఏండ్ల నాటి చేర్యాల పెయింటింగ్స్, పోచంపల్లి ఇక్కత్, గద్వాల్, నారాయణపేట నేత వరకు అన్నీ తెలంగాణకు పేరు తెచ్చినవే. అరచేతిలో పట్టే చీర నేసిన ఘనత తెలంగాణది. అంతెందుకు శాతవాహనుల కాలంలోనే ఇక్కడి నుంచి రోమ్కు బట్టలు ఎగుమతి చేసేవాళ్లు. రుద్రమదేవి కాలంలో వచ్చిన వెనీస్ యాత్రికుడు మార్కోపోలో కూడా మన తెలంగాణ ప్రజల కళా నైపుణ్యాన్ని మెచ్చుకున్నాడు. మన దగ్గర మొఘల్, కుతుబ్ షాహీ, నిజాంల పాలనలో కూడా ఎన్నో హస్తకళలు డెవలప్ అయ్యాయి. అవి తెలంగాణ ప్రజల జీవన విధానంలో భాగమయ్యాయి.
బిద్రీ క్రాఫ్ట్: బిద్రీ అనేది ఒక లోహ కళ. నల్లని వస్తువులను బంగారు, వెండి తీగల అల్లికతో అందంగా మార్చే ఆర్ట్. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బీదర్ నుండి ఈ పేరు వచ్చింది. ఇది బహమనీ సుల్తానుల పాలనలో 14వ శతాబ్దంలో పుట్టిందని నమ్ముతారు. బహమనీ సుల్తానులు 14–15 శతాబ్దాలలో బీదర్‌ను పాలించారు. మొదట్లో ఈ కళ పర్షియాలో కనిపించేది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అనుచరులు ఇండియాకి తీసుకువచ్చారు. ఇక్కడికొచ్చాక మన పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేకమైన శైలిని తీసుకొచ్చారు. ఇది ఎనిమిది దశల ప్రక్రియ. ఉలి, సుత్తితో చెక్కుతూ చేస్తారు. వస్తువులపై స్వచ్ఛమైన వెండిని పొదుగుతారు. కాపర్, జింక్ మిశ్రమంతో చేసిన లోహం మీద వెండి, బంగారు తీగలను చొప్పిస్తూ చేయడంతో అద్భుతంగా కనిపిస్తాయి. వాటికి నలుపు రంగు రావడానికి కాపర్ సల్ఫేట్ పూత పూస్తారు.
సిల్వర్ ఫిలిగ్రీ: సున్నితమైన, అందమైన లోహ కళ సిల్వర్ ఫిలిగ్రీ. దీన్ని 19వ శతాబ్దంలో కరీంనగర్‌లోని సిల్వర్ స్మిత్‌లు క్రియేట్ చేశారు. వెండిని వలలాంటి రూపానికి తీసుకొచ్చి వస్తువులు తయారుచేస్తారు. వెండి తీగలను సరిగ్గా మెలితిప్పుతూ చేసే ఆర్ట్ ఇది. దీనికోసం నాణ్యత గల వెండి మాత్రమే వాడతారు.ముఖ్యంగా పువ్వులు, పక్షులు, ఆకులు, ప్రకృతితో -సంబంధం ఉన్నవాటిని తయారు చేస్తుంటారు.
బంజారా నీడిల్ క్రాఫ్ట్స్: బంజారా ఎంబ్రాయిడరీ, నీడిల్ వర్క్‌లను తెలంగాణ సంచార జాతులు విస్తృతంగా తయారు చేస్తారు. సంచార తెగ బంజారా వేల ఏండ్ల క్రితం ఐరోపాలోని జిప్సీల వారసులని నమ్ముతారు. ఆ తర్వాత వాళ్లు రాజస్తాన్‌లోని ఎడారి ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారి రంగురంగుల బట్టలు, నగల వల్ల స్పెషల్‌గా కనిపిస్తారు. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హయాంలో దక్షిణ భారతదేశంలోని దక్కన్ పీఠభూమి వైపు బంజారాలు వచ్చారు. స్థానికంగా ‘తాండాలు’ అని పిలువబడే చిన్న గ్రామాల్లో ఉంటున్నారు. బంజారా మహిళలు రంగురంగుల గాగ్రాలు, చోళీలు, అద్దాలు ఆప్లిక్ వర్క్‌లతో డిజైన్ చేసిన బట్టలు వేసుకుంటారు. బంజారా ఎంబ్రాయిడరీ, నీడిల్ వర్క్‌లు తెలంగాణలో ఎక్కువగా చేస్తారు. ఎంబ్రాయిడరీలో పూసలు, గుండ్లు, అద్దాలు ఎక్కువగా వాడతారు. హెరింగ్‌బోన్, చైన్ స్టిచ్ లాంటి కుట్ల సాయంతో డిజైన్ చేస్తారు. ఎంబ్రాయిడరీలో నాణేలు, ఉన్ని కుచ్చులు, కౌరీ షెల్స్, కాటన్ కూడా వాడతారు. ఇప్పుడు బంజారా ఎంబ్రాయిడరీ ద్వారా బ్యాగులు, పర్సులు, బెల్ట్‌లు, పిల్లో కవర్లు, క్విల్ట్‌లు, బెడ్ స్ప్రెడ్‌లు, స్కర్ట్, సల్వార్ సూట్, బ్లౌజ్‌లు కూడా కుడుతున్నారు.
పెంబర్తి బ్రాస్
పెంబర్తి హస్తకళాకారులు ఇత్తడి, కంచుతో వీటిని చేస్తారు. పెంబర్తి గ్రామంలో కాకతీయుల కాలం నుంచి ఈ పనిచేస్తున్నారు. వీళ్లు దేవతల విగ్రహాలు, అలంకరణ వస్తువులను చేస్తుంటారు. 800 సంవత్సరాల కంటే ముందు నుంచే ఈ కళ ఉన్నట్టు గుర్తించారు. హిందూ దేవాలయాల విగ్రహాలు, రథాలకు వీళ్లు చేసిన షీట్ మెటల్‌నే అతికించేవాళ్లు. దీన్ని పెంబర్తి బ్రాస్‌వేర్ అని కూడా పిలుస్తారు. తెలంగాణలో ముస్లిం పాలన మొదలైన తర్వాత పెంబర్తి హస్తకళాకారులు కళా శైలిని డెవలప్ చేసుకున్నారు. పాండాన్‌లు, ఇత్తర్ కుండలు, వేలాడే మెటల్ షాండ్లియర్లు, జుమ్మర్లు, కుండీలు లాంటి వస్తువులను కూడా ఈ కళతో అలంకరించారు. ఫలకాలు, మెమెంటోలు కూడా తయారుచేస్తున్నారు.
పోచంపల్లి చీరలు
పోచంపల్లి చీరల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవి వరల్డ్ ఫేమస్. వీటిని యాదాద్రి-భువనగిరి జిల్లాలో తయారు చేస్తారు. ఈ చీరకు ఆ పేరు భూదాన్ పోచంపల్లి ఊరి పేరుతో వచ్చింది. సుమారు 80 గ్రామాలు ఈ చీరలు నేస్తున్నాయి. ఒక శతాబ్దానికి పైగా ఇక్కడివాళ్లకు ఇదే సంప్రదాయ జీవనోపాధి. పోచంపల్లి చీర ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి నేత కార్మికులు ఉపయోగించే ఇక్కత్ టెక్నిక్. ఈ డిజైన్‌లో చీర నేయడం చాలా కష్టం. పోచంపల్లి ఇక్కత్‌ను స్థానికంగా చిట్కి, పొగుడుబంధు అని పిలుస్తారు. ఇక్కడి ఇక్కత్‌కు ఇండియాలోని ఇతర ఇక్కత్ డిజైన్లకు చాలా తేడా ఉంటుంది. పోచంపల్లి ఇక్కత్ నేతలో టైయింగ్, డైయింగ్ ప్రక్రియల్లో 18 అంకాలుంటాయి. నేసే ముందు బండిళ్లకొద్దీ దారానికి రంగులద్దుతారు. తర్వాత వార్ప్, వెఫ్ట్ మీదకు పోచంపల్లి డిజైన్ దింపుతారు.
నిర్మల్ కళ
ఈ కళ 400 ఏండ్ల నాటిది. ఇక్కడి కళాకారులు మృదువైన చెక్క బొమ్మలు, ఆకర్షణీయమైన పెయింటింగ్స్‌తో పాటు ఫర్నిచర్‌ని తయారు చేస్తుంటారు. నిర్మల్‌లో తయారయ్యే బొమ్మలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. కర్రలను సేకరించి, వాటిని ఆరబెట్టి వివిధ రూపాల్లో చెక్కి బొమ్మలుగా తీర్చిదిద్దుతారు. తర్వాత వాటికి పెయింటింగ్స్ వేస్తారు. పక్షులు, జంతువుల కొయ్యబొమ్మలకే కాకుండా వర్ణచిత్రాలకు కూడా నిర్మల్ పేరుగాంచింది.
నిర్మల్ సంస్థానాన్ని పరిపాలించిన నిమ్మ నాయుడు దేశం నలుమూలల నుంచి కళాకారులను రప్పించి చేతి కళలను అభివృద్ధి చేశాడు. అదేటైంలో 17వ శతాబ్దంలో నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ మొదలైంది. నకాషీ కళాకారులు ఈ బొమ్మలు తయారు చేస్తున్నారు.