ఆరు నెలల్లో రెండింతలైన పట్టు చీరల తయారీ

ఆరు నెలల్లో రెండింతలైన పట్టు చీరల తయారీ
  • 6 నెలల్లో రెండింతలైన పట్టు చీరల తయారీ ఖర్చు
  • గిట్టుబాటు కాక, గిరాకీ లేక పని ఇవ్వని షావుకార్లు  
  • ఆదుకోని సర్కార్ నూలు సబ్సిడీ స్కీమ్

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని నేతన్నలు పని దొరకక ఇబ్బందులు పడుతున్నారు. పట్టు చీరల తయారీ ఖర్చు పెరగడంతో షావుకార్లు ఎక్కువగా పని ఇస్తలేరు. దీంతో వాటిని నేస్తూ ఉపాధి పొందుతున్నోళ్లు తిప్పలు పడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు లక్ష నేతన్నల కుటుంబాలు పట్టు చీరల తయారీపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌‌నగర్‌‌, వరంగల్‌‌, ఆదిలాబాద్‌‌ జిల్లాల్లో పట్టు చీరలు ఎక్కువగా నేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో పట్టు చీరలు నేసేందుకు అవసరమైన ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయి. 

పట్టు నూలు, రంగుల రేట్లు రెండింతలయ్యాయి. ఆరు నెలల క్రితం కిలో నూలు రూ.3 వేలు ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.6,200 పలుకుతోంది. రాష్ట్రంలో పట్టుగూళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో పాటు చైనా నుంచి దిగుమతి ఆగిపోయింది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకల్లోనూ ఉత్పత్తి తగ్గింది. దీంతో నూలు ధర భారీగా పెరిగింది. నూలుతో పాటు రంగులు, వార్పు, జరి, సోడా, సబ్బులు, గ్యాస్‌‌ ధరలూ పెరిగాయి. గతంలో కిలో రంగుల ధర రూ.600 ఉండగా, ఇప్పుడు రూ.వెయ్యి దాటింది. ముడి సరుకుల ధరలు భారీగా పెరగడంతో చీరలు నేసినా గిట్టుబాటు కాక, గిరాకీ లేక నేతన్నలు ఇబ్బందులు పడ్తున్నారు. గతంలో ఒక పొరకు (ఏడు చీరలు) రూ.20 వేల దాకా ఖర్చు కాగా, ఇప్పుడు రూ.40 వేలవుతోందంటున్నారు. 

కూలి పైసలూ లేటే..

చీరల తయారీకి పెట్టుబడి పెరగడంతో అటు షావుకార్లకు, ఇటు నేతన్నలకు గిట్టుబాటు కావట్లేదు. ఒక చీర తయారీకి రూ.7 వేలు ఖర్చవుతుండగా, దాన్ని అమ్మినా అంతే వస్తోంది. దీంతో షావుకార్లకు, నేతన్నలకు ఫాయిదా ఉండట్లేదు. మరోవైపు చీరల అమ్మకాలు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. నేసిన చీరల స్టాక్ పెరిగిపోతోంది. అమ్మకాలు తగ్గడంతో నేతన్నలకు షావుకార్లు ఎక్కువ పని ఇవ్వడం లేదు. సగానికి పైగా పని తగ్గిస్తున్నారు. ఇక చేసిన పనికి కూలి కూడా సకాలంలో ఇవ్వడం లేదు. చీరలు అమ్ముడుపోతలేవని నెలల తరబడి పైసలు ఆపుతున్నారు. 

సబ్సిడీ స్కీమ్​కు కొర్రీలు..

నేత కార్మికులకు 40 శాతం నూలు సబ్సిడీ అంటూ రాష్ట్ర సర్కార్ తెచ్చిన చేనేత మిత్ర స్కీమ్ సక్కగా అమలు కావట్లేదు. నేతన్నలకు సబ్సిడీ ఇస్తున్నామని సర్కారు గొప్పగా చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో నేతన్నలకు సబ్సిడీ అందడం లేదు. సబ్సిడీ పొందడానికి ప్రభుత్వం అనేక కొర్రీలు, నిబంధనలు పెడుతోందని చేనేత సంఘాలు మండిపడుతున్నాయి. నిబంధనలు సడలించాలని సర్కార్ కు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో నేతన్నలకు ఏటా రూ.24 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నారని, తమకు అలాగే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. 

ఏపీలో లెక్క ఏటా 24 వేలు ఇయ్యాలే... 

నూలు సబ్సిడీ స్కీమ్ కింద వందల తిరకాసులు పెడుతున్నారు. దీంతో ఎవరు సబ్సిడీకి అప్లై చేసుకోవడం లేదు. ఏపీలో పెట్టుబడి సాయం కింద ఏటా రూ.24 వేలు ఇస్తున్నారు. ఇక్కడ కూడా అట్లనే ఇవ్వాలి. 
- దాసు సురేశ్‌‌, 
  నేతన్నల ఐక్యకార్యాచరణ కమిటీ చైర్మన్

పని ఇస్తలేరు... 

ముడి సరుకుల ధరలు పెరిగి, పెట్టుబడి డబుల్ అయింది. మార్కెట్‌‌లో చీరలు అమ్ముడు పోతలేవు. గిట్టుబాటు కాక షావుకార్లు పని కల్పిస్తలేరు. చేసిన పనికి కూడా పైసలు వెంటనే ఇస్తలేరు. ఇబ్బందులు తప్పడం లేదు. 
- జెల్ల నాగరాజు, నేత కార్మికుడు, చండూరు, నల్గొండ జిల్లా