
హనుమకొండ, వెలుగు: బాల సదనంలో ఆశ్రయం పొందుతున్న ఓ బాలికను అమెరికా దంపతులు దత్తత తీసుకున్నారు. కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో ఆ బాలికను అమెరికా దంపతులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. హనుమకొండలోని బాల సదనంలో ఓ పదేళ్ల బాలిక ఆశ్రయం పొందుతోంది. ఆ బాలిక వివరాలను కేంద్ర దత్తత వనరుల విభాగంలో ఆన్లైన్ చేయగా.. అమెరికాకు చెందిన దంపతులు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీలో దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర దత్తత వనరుల విభాగం సీనియారిటీ ప్రకారం ఇంటర్ కంట్రీ అడాప్షన్‌కు అంగీకరించింది. దీంతో శుక్రవారం హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో బాలికను ఆమెరికాకు చెందిన దంపతులకు అప్పగించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు చట్టబద్ధంగానే దత్తత తీసుకోవాలని సూచించారు. డీడబ్ల్యూవో జె.జయంతి మాట్లాడుతూ ఇప్పటి వరకు 10 మంది పిల్లలను ఇంటర్ కంట్రీ అడాప్షన్ లో భాగంగా ఇటలీ, మాల్టా, లండన్, అమెరికా దేశాలకు దత్తత ఇచ్చామని వివరించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు సందసాని రాజేంద్ర ప్రసాద్, బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సీహెచ్ అవంతి, బాలసదనం సూపరింటెండెంట్ ఎం.కల్యాణి పాల్గొన్నారు.