అజొల్లా మొక్కలతో అధిక పాల ఉత్పత్తి : కలెక్టర్​ ప్రావీణ్య

అజొల్లా మొక్కలతో అధిక పాల ఉత్పత్తి : కలెక్టర్​ ప్రావీణ్య

శాయంపేట(ఆత్మకూరు), వెలుగు: తక్కువ ఖర్చుతో  అజొల్లా మొక్కల పెంపకం చేపట్టి, దాణాలో కలిపితే అధిక పాల ఉత్పత్తిని పెంచవచ్చని హనుమకొండ కలెక్టర్​ ప్రావీణ్య అన్నారు. డీఆర్డీవో మేన శ్రీను, ఇతర ఆఫీసర్లతో కలిసి బుధవారం ఆమె ఆత్మకూరు మండలంలో పర్యటించారు. ముందుగా గుడెప్పాడులో రత్నాకర్​రెడ్డి అనే రైతు డీఆర్డీవో ఆధ్వర్యంలో చేపట్టిన అజొల్లా ఫామ్ ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ అజొల్లా మొక్కలను పశువుల దాణాతో కలిపి అందిస్తే  పాల ఉత్పత్తిలో 15 నుంచి 20 శాతం వృద్ధి కనిపిస్తుందన్నారు. అజొల్లా మొక్కల పెంపకంపై  రైతులకు అవగాహన  కల్పించేలా ఆఫీసర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. 

అనంతరం తిరుమలగిరిలో నిర్మించిన డంప్​ యార్డును పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్​యార్డుకు తరలించేలా చూడాలని ఆఫీసర్లకు సూచించారు. ఉపాధి హామీ పనులను తనిఖీ చేసి, అక్కడ సౌకర్యాలపై ఆరా తీశారు. ఆత్మకూరు పీహెచ్​సీని సందర్శించి వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించాలని ఆదేశించారు. స్థానిక స్వర్ణభారతి మండల సమైక్య ద్వారా ఏర్పాటు చేసిన స్కూల్​ పిల్లల యూనిఫామ్ కుట్టు పరిశ్రమను పరిశీలించారు. 

పాఠశాలలు తెరిచే నాటికి యూనిఫామ్‌లు సిద్ధం చేయాలని ఆదేశించారు.  డీఆర్డీవో, ఇన్​చార్జి అడిషనల్ కలెక్టర్ మేన శ్రీను మాట్లాడుతూ మహిళలకు మెగా టెక్స్​టైల్ పార్కులో శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో డీఎంహెచ్​వో అప్పయ్య, ఏపీవో రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర మూర్తి, ఎంపీవో విమల, ఏపీఎం లలిత, మెడికల్‌ ఆఫీసర్‌ స్వాతి తదితరులు పాల్గొన్నారు.  

లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి 

హనుమకొండ సిటీ: రాజీవ్ యువవికాస పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మండల అభివృద్ధి అధికారులతో రాజీవ్ యువ వికాసం, ఉపాధి హామీ పథకంపై సమీక్ష నిర్వహించారు. క్యాటగిరి వైజ్ గా, రిజర్వేషన్ నిష్పత్తిని అనుసరించి మే 24 వరకు మండల స్థాయి కమిటీలతో ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి జిల్లా స్థాయికి లబ్ధిదారులు జాబితాను అందించాలని ఆమె తెలిపారు. 

జిల్లాలో 10565 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా లక్ష్యంగా ఎంచుకున్న 7675 పని దినాలకు గాను ఇప్పటివరకు 3645 పని దినాలు పూర్తి చేశామని, జూన్ 15 నాటికి లక్ష్యాన్ని అధిగమించి పనులు చేపట్టాలని ఆదేశించారు.