హసన్ పర్తిలో 30 కేజీల గంజాయి పట్టివేత .. ఒడిశాకు చెందిన నిందితుడు అరెస్టు

హసన్ పర్తిలో 30 కేజీల గంజాయి పట్టివేత .. ఒడిశాకు చెందిన నిందితుడు అరెస్టు
  • కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి వెల్లడి 

హసన్ పర్తి, వెలుగు : బ్యాగుల్లో గంజాయి తరలిస్తుండగా ఒకరిని హనుమకొండ జిల్లా హసన్ పర్తి పోలీసులు పట్టుకున్నారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు. సోమవారం హసన్ పర్తి ఎస్ఐ దేవేందర్ సిబ్బందితో ఎల్లాపూర్, హసన్ పర్తి ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తుండగా.. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బ్యాగులతో వెళ్తూ కనిపించాడు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా పట్టుకుని తనిఖీ చేశారు. అతని వద్ద బ్యాగుల్లో 30 కిలోల 290 గ్రాముల ఎండు గంజాయిని దొరికింది. అతడిని ఒడిశాలోని గజపతి జిల్లా మోహన తాలూకా పరిధి తలరాయ్ సింగ్ గ్రామానికి చెందిన ఆశీశ్ కుమార్ నాయక్ అలియాస్ లిప్ నాయక్ (27 )గా గుర్తించారు. తండ్రితో మేస్త్రీ పనికి వెళ్తుండగా వచ్చే డబ్బులు సరిపోకపోతుండగా ఆశిశ్​కుమార్ గంజాయి అమ్మకం చేస్తున్నాడు. 

ఈనెల 25న గంజాయిని రూ. 45 వేలకు కొనుగోలు చేసి బ్యాగుల్లో నింపుకొని ఇచ్చాపురంలో కోణార్క్ రైలు ఎక్కి వరంగల్ రైల్వే స్టేషన్ కు చేరగా.. పోలీసుల తనిఖీలను చూసి వెనుక బోగి నుంచి దిగిపోయాడు. వరంగల్ లో రెండు రోజులు పాటు ఉన్నాడు. మహారాష్ట్ర వెళ్లేందుకు ఆటోలో వెళ్తూ ఎల్లాపూర్ రైల్వే బ్రిడ్జి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా హసన్ పర్తి   పోలీసులు పట్టుకున్నట్టు ఏసీపీ తెలిపారు. సీఐ వట్టే చేరాలు, ఎస్ఐలు దేవేందర్, రవికుమార్ ఉన్నారు.