హనుమాన్..​ ఓ మంచి రాయబారి

హనుమాన్..​  ఓ మంచి రాయబారి

హనుమంతుడు మహా బలశాలే కాదు.. మహా మేధావి కూడా. సీతాదేవిని వెదుకుతున్న రామలక్ష్మణుల్ని చూసి వాళ్లు స్నేహితులా లేక శత్రువులా అని తేల్చుకోవడానికి.. ‘అయ్యా! నేను సుగ్రీవుని బంటు హనుమని, తమరు ఏ పనిమీద వచ్చారో, మీమీ నామధేయాలు ఏమిటో?’ అని  మర్యాదగా ప్రశ్నించినప్పుడు అతడొక కార్యశూరుడని తెలుస్తుంది. హనుమంతుడు మనకు తోడుగా ఉంటే సాధించలేనిదంటూ లేదు’, అని సాక్షాత్తూ శ్రీరామచంద్రుడు అన్నాడంటే అతని  గొప్పతనం అర్థమవుతుంది. శాస్త్రాలు చదివినవాడు.. ఓ మంచి మిత్రుడు, ఆంతరంగిక మంత్రి, రాయబారి, సమాచార వేత్త అని రుజువు చేసిన సంఘటనలివి.
రావణుడి చెరలో ఉన్న సీతను వెతకడానికి సుగ్రీవుడు దక్షిణ దిక్కుకి  హనుమని పంపించాలనుకున్నాడు. ఎందుకంటే ఆ దారిలో ఉన్న  మహాసముద్రాన్ని  దాటడం ఒక్క హనుమంతునికే సాధ్యం. మొదట తనవల్ల కాదని  చేతులెత్తేశాడు హనుమ. కానీ, తర్వాత మనోబలాన్ని పుంజుకుని సముద్రాన్ని దాటడం మొదలుపెట్టాడు. ప్రారంభంలోనే మైనాకుడనే పర్వతుడు అడ్డుకున్నాడు. ఆతిథ్యం స్వీకరించమన్నాడు. వద్దని చెప్పి ముందుకి వెళ్లాడు. ఇంకా ముందుకి వెళ్లేసరికి సురస అనే పెద్ద చేప వచ్చి మింగబోతే దాని పొగరు అణిచాడు. ఇంకా ముందుకి వెళ్లేసరికి సింహిక అనే పెద్ద రాక్షసి అడ్డుకుంటే దాని పీచమణిచాడు. లంకలో అడుగు పెట్టాడు. లంఖిణి అడ్డుకుంది. ఒక్క దెబ్బతో యమసదనానికి పంపాడు. సీతాదేవి కోసం అణువణువూ గాలించడం మొదలుపెట్టాడు. 
వెతికాడు వెతికాడు... తన ప్రయత్నం ఫలించకపోవడంతో నిరాశ చెందాడు. తిరిగి వెళ్లి సీతమ్మ తల్లి కనిపించలేదనే వార్త చెప్పాలి. ఆ పని చేస్తే సముద్ర తీరంలో శుభవార్త కోసం ఎదురు చూస్తున్న జాంబవంతుడు, ఇతర వానరులు ఆత్మహత్య చేసుకుంటారు. అది విని సుగ్రీవుడు, రామలక్ష్మణులు, వారిని అనుసరించి భరతుడు, చిట్టచివరగా అయోధ్యావాసులు కూడా అలానే చేస్తారు. ఇదంతా జరగకుండా ఉండాలంటే తను వెనక్కి వెళ్లకపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాడు. ఎంత తెలివిగా ఆలోచించాడో హనుమ. 

సమయస్ఫూర్తి..

ఇంతలోనే లంకలో తను చూడకుండా వదిలేసిన అశోకవనం గుర్తొచ్చి వెళ్లాడు. అక్కడ చనిపోదామని  కేశాలతో గొంతు బిగించు కుంటూ కనిపించింది సీతమ్మ. క్షణం ఆలస్యం చేసినా పరిస్థితి చెయ్యి దాటిపోయేది. ఏ మాటల వల్ల ఆవిడ ఆ ప్రయత్నం ఆపగలదో ఆలోచించి, దశరథుని కథని ప్రారంభించాడు. అంటే ఎవరి పేరు చెబితే ఆవిడ ఆత్మహత్యా ప్రయత్నం మానుతుందో  ఆ పదాన్ని ఉపయోగించాడు. జానకమ్మ తనని నమ్మదేమోనని శ్రీరాముని ఆనవాలు చూపించాడు. రాముడు కూడా నమ్మడేమోనని, సీతాదేవి దగ్గర చూడామణి తీసుకున్నాడు. నిజానికి రాముడు లంకకు వెళ్లి సీతను చూసి రమ్మని మాత్రమే చెప్పాడు, కాని హనుమ తన బాధ్యతగా చెప్పిన పనితో పాటు, తన వంతుకు చెయ్యవలసినంతా చేశాడు. రాజ దర్శనం కోసం లంకలో సగభాగాన్ని నాశనం చేశాడు.

గొప్పరాయబారి

అనుకున్నట్టే రాజ దర్శనం పొందాడు. వెంటనే తన కర్తవ్యం గుర్తొచ్చింది.  కాబట్టి ముందుగా రాక్షసరాజు రావణునికి అభివందనం చేశాడు.  ఓ రావణా! నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.  నీ సామ్రాజ్యంలో సర్వ సమానత్వం బాగా కనిపిస్తోంది. రాజ్యంలోని వారందరికీ  అన్ని సౌకర్యాలు కల్పించావంటూ మెచ్చుకున్నాడు. ఒక్కసారిగా రావణుడు అంత ఎత్తుకు ఎగిరాడు. అంతే  ఆ వెంటనే వాలి ప్రస్తావన తీసుకొచ్చాడు. ‘నువ్వు చంకలో పెట్టుకుని తిప్పిన వాలిని రాముడు ఒక్క బాణంతో కూల్చాడ’ని చెప్పగానే  రావణుడి ఆనందం ఒక్కసారిగా కిందకు వచ్చేసింది. అంటే ముందు తాను చెప్పబోయేది వినాలంటే అవతలి వాళ్లని సంసిద్ధం చెయ్యాలి. అందుకే మొదట రావణుడ్ని పొగిడి.. ఆ తర్వాత తన పని పూర్తి చేసి వెనక్కి బయలుదేరాడు. ఆకాశం నుంచి భూమ్మీదకు వస్తూ పెద్ద ఈల వేసి, ‘చూశాను సీతను’ అని అన్నాడే కానీ ‘సీతను చూశాను’ అనలేదు. తన నోటిలోంచి వచ్చే మాట మీద ఇన్ని వందల ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. ఆ తరువాత రావణుని సంహరించి, రాముడు సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యకు చేరాడు. పట్టాభిషేకం తర్వాత రాముడు ఒక ముత్యాల హారం సీతకు ఇచ్చి, ‘సీతా! నీకు ఎవరంటే ఇష్టమో వారికి ఈ హారం కానుకగా ఇవ్వు’ అని కోరగా, తనకు విముక్తి కలిగించిన హనుమకి ఆ హారం ఇచ్చిందంటే హనుమ ఎంతటివాడో అర్థం అవుతుంది.