మామూలు కండక్టర్ నుంచి దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగిన సూపర్‌స్టార్ రజినీకాంత్ స్థాయి అందని ఆకాశం. తన నడవడిక, అసాధారణమైన జీవన శైలి ఇతర హీరోలకు సాధ్యమవ్వని పని. నటనకు అందం అవసరం లేదని, టాలెంట్ ఉంటే ఎక్కడైనా నెగ్గుకురాగలమని నిరూపించిన స్ఫూర్తి ప్రధాత రజనీకాంత్ (Rajinikanth). తన వ్యక్తిత్వం మరియు ఐకానిక్ స్టైల్‌తో అభిమానులను ఎప్పుడు ఆకర్షిస్తూనే ఉన్నారు రజినీ. వయసు పెరిగే కొద్దీ తనదైన స్టయిల్.. మేనరిజంతో అభిమానుల ఆకలి తీరుస్తున్నాడు. మరపురాని డైలాగ్‌లు మరియు అసాధారణమైన నటనతో సినీ కళామతల్లికి చెరగని సంతకం చేశారు ‘తలైవర్’. 1950 డిసెంబర్ 12న పుట్టిన రజినీకాంత్.. ఇవాళ శుక్రవారం (2025 డిసెంబర్ 12న) 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
‘తన జీవితం గురించి..తను జీవితం ఎలా మొదలైందనేది’ చెప్పుకోవటానికి ఎప్పుడూ సిగ్గుపడని హీరో ఎవరైన ఉన్నారంటే.. అది ఒక్క రజినీకాంత్ మాత్రమే. ఎంతో సాధారణ జీవితాన్ని గడిపే రజినీ లాంటి వ్యక్తులు వేలలో ఒకరుంటారేమో అనిపిస్తోంది. కొన్నిసార్లు ఆలోచిస్తే అసలు ఎవ్వరూ ఉండరేమో అనిపిస్తోంది. ఎందుకంటే, చిన్న సక్సెస్ వస్తేనే నేల మీద కూడా నడవని వారుంటారు. ఇంకాస్తా పెద్ద సక్సెస్ వస్తే.. అసలు చేసిన ప్రయాణం కూడా గుర్తుకు రాని వాళ్ళు ఉంటారు. అందులో అందరికీ పూర్తి భిన్నమైన వ్యక్తి రజినీకాంత్ ఒకరని చెప్పడంలో సందేహం లేదు.
తన మ్యానరిజంతో, ప్రత్యేకమైన స్టైల్తో అశేష అభిమానులను రజనీ సొంతం చేసుకున్నారు. తమిళంలోనే కాకుండా తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోనూ మొదటి నుంచీ తన సత్తా కొనసాగిస్తూ ఈ రోజుకీ అంతే క్రేజ్తో, ఫ్యాన్స్ను సంపాదించుకుని పాపులారిటీతో రజనీ దూసుకుపోతున్నారు.
నేడు తలైవర్ బర్త్డే స్పెషల్గా చెన్నైలోని ఆయన నివాసం ముందు బ్యానర్లు, రజినీ ఫోటోలు పట్టుకొని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రజినీకాంత విగ్రహాలకు పాలాభిషేకం చేస్తున్నారు. రజినీ పుట్టిన రోజు వేడుక అంటే తమిళనాడులో పండుగ కంటే తక్కువ కాదు. ఈ సందర్భంగా చాలామంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రజనీకాంత్ నేపథ్యం:
1950 డిసెంబర్ 12న అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో రజనీకాంత్ జన్మించారు. తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా నచికుప్పమ్ గ్రామంలో రజనీకాంత్ పెరిగారు. జిజాబాయి, రామోజీరావుకి రజనీ నాలుగో సంతానం. తండ్రి గైక్వాడ్ కానిస్టేబుల్. రజనీకాంత్ తన తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే తల్లిని కోల్పోయారు. రజనీకి ఇద్దరు అన్నలు. సత్యనారాయణరావు, నాగేశ్వరరావు, అక్క అశ్వత్ బాలూభాయి. ఇక రజినీకాంత్ పాఠశాల చదువంతా బెంగళూరులోని పూర్తిచేడులో ఉన్న ఆచార్య భన్నారగట్టా పాఠశాలలో సాగింది.
పాఠశాల విద్య పూర్తికాగానే, రజనీకాంత్ కూలీ పనులతో పాటు చాలా ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత బెంగుళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (BTS)లో బస్ కండక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. దాంతో పాటు స్టేజ్ నాటకాల్లోనూ నటించారు. ఒక ప్రకటనను చూసి మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకోవాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నారు.
అయితే..కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఇవ్వనప్పటికీ, స్నేహితుడు సహోద్యోగి రాజ్ బహదూర్ అతన్ని సంస్థలో చేరేలా ప్రోత్సహించారు. శిక్షణా సంస్థలో ఉన్న సమయంలోనే తమిళ చిత్ర దర్శకుడు కె. బాలచందర్ రజనీని గుర్తించారు. అప్పటికే తమిళనాట ప్రజాదరణ పొందిన శివాజీ గణేషన్ ఉండడంతో శివాజీ పేరును మారుస్తూ రజనీ కాంత్ పేరును ఖరారు చేశారు.
అవార్డులు:
భారత సినిమా రంగానికి రజినీకాంత్ చేసిన సేవలకు గాను అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్నీ, 2016 లో పద్మవిభూషణ్ పురస్కారాన్నీ బహుకరించింది. ఆయనకు ఒక జాతీయ పురస్కారం, ఏడు సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, ఒక నంది పురస్కారం, ఒక ఫిల్మ్‌ఫేర్ పురస్కారంతో పాటు ఇంకా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు తలైవా.
రజినీకాంత్ ప్రస్తుత సినిమాలు:
అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దర్శకుడు నెల్సన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ చేత విజిల్స్ వేయించింది. ఇక తలైవర్ స్క్రీన్ ప్రెజెన్స్ కు ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోయారు. థియేటర్స్ లో మాత్రమే కాకుండా, ఓటీటీలో కూడా ఈ సినిమాకు ఓ రేంజ్లో రెస్పాన్స్ రావడం ఒక రికార్డ్ గానే చెప్పుకున్నారు. ఈ సినిమాతో రజినీకాంత్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసారు. దేశానికే కాదు.. ప్రపంచానికి కూడా ఒకే ఒక సూపర్ స్టార్ అది మన రజినీకాంత్ అంటూ ఊగిపోయారు.
ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన 'కూలీ' సైతం రూ.500 కోట్లు కలెక్ట్ చేసి తలైవా సత్తా చాటింది. ఇక ఇప్పుడు రాబోతున్న జైలర్ 2 కూడా అంచనాలను ఏ మాత్రం మించకుండా దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ ఓ అప్డేట్ వస్తుందని టాక్. అలాగే, నరసింహ 2 నుంచి కూడా అప్డేట్ రానుందని సమాచారం. కమల్ హాసన్ నిర్మాణంలో చేస్తున్న రజిని 173వ సినిమా నుంచి కూడా స్పెషల్ అప్డేట్ రానుంది. మరికొన్ని కొత్త సినిమాలు లైన్లో ఉన్నాయి.

