స్వరకల్పనలో 'చిత్ర' గానామృతం

స్వరకల్పనలో 'చిత్ర' గానామృతం

పాడలేను పల్లవైనా అంటూనే వందలు, వేల గీతాల్ని ఆలపించింది.
వేణువై వచ్చాను భువనానికి అంటూ తన గాన మాధుర్యంలో ముంచేసింది.
జల్లంత కవ్వింత కావాలంది. ఒళ్లంత తుళ్లింత రావాలంది.
పాటల పల్లకిలో చిరుగాలిని ఊరేగించింది.  జామురాతిరి జాబిలమ్మకి జోల పాడింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టును పూయించింది. మౌనంగానే ఎదగాలంటూ మంచిని బోధించింది.
గొంతులో తేట తేనెల తీయదనం.. గానంలో కోటి కోయిలల కమ్మదనం..  
కేఎస్ చిత్ర పాడితే... పులకించని హృదయం ఉండదు . దశాబ్దాలుగా తన గాత్రంతో ప్రతి మదినీ మీటుతున్న ఈ సౌతిండియన్ నైటింగేల్ ఇవాళే (జులై 27) పుట్టారు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు..

చిత్ర పూర్తి పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. 1963లో కేరళలోని తిరువనంతపురంలో పుట్టారు. తండ్రి దగ్గరే సంగీతంలో ఓనమాలు దిద్దుకున్నారు. చిన్నప్పుడే ఆలిండియా రేడియోలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో కృష్ణుడి పాత్రకి పాట పాడారు చిత్ర. అదే ఆమె తొలి రికార్డింగ్. మ్యూజిక్‌లో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీస్ చేశారు చిత్ర. అక్క బీనా, తమ్ముడు మహేష్, చిత్ర.. ఈ ముగ్గురిలో ఒకరిని కచ్చితంగా సింగర్‌‌ని చేయాలనుకున్నారు వారి తల్లిదండ్రులు. దాంతో చిన్నప్పటి నుంచే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ మొదలయ్యింది. అయితే మిగతా ఇద్దరి కంటే చిత్ర బాగా రాణించారు. నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్‌‌షిప్‌కి అప్లై చేసుకున్నారు. సెలెక్షన్స్ టైమ్‌లో ఆమె చేసిన ఓ ప్రయోగానికి ముగ్ధులైన జడ్జెస్ ఫిదా అయిపోయారు. స్కాలర్ షిప్‌కి సెలెక్ట్ చేశారు.  

పాడలేను పల్లవైనా అంటూనే...

చిత్ర గురువు ఓమనకుట్టి అన్నయ్య ఎంజీ రాధాకృష్ణన్ సంగీత దర్శకుడు. ఆయనే మొదటిసారిగా చిత్రతో ఓ మలయాళ మూవీకి పాడించారు. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత మూడేళ్లకు ఓ సినిమా కోసం ఎంజీ శ్రీకుమార్‌‌తో కలిసి ట్రాక్ పాడారు. కానీ ఏదో తేడా రావడంతో అదే పాటని జేసుదాస్‌తో మళ్లీ పాడించారు. దాంతో ఆయన పాడిన పాటే విడుదలైంది. అదే చిత్ర మొదటి సినిమా పాటయ్యింది. అయితే జేసుదాస్ పక్కన చిత్ర గొంతు మరీ లేతగా ఉండటంతో చాలామంది విమర్శించారు. కానీ ఇళయరాజాకి చిత్ర వాయిస్‌లోని ఫ్రెష్‌నెస్ బాగా నచ్చింది. దాంతో తన సినిమాకి పాడే చాన్స్ ఇచ్చారు. ‘సింధుభైరవి’లో పాడలేను పల్లవైనా పాట పాడించారు. ఈ పాటతోనే తెలుగువారికి పరిచయమయ్యారు చిత్ర.

నాలుగు దశాబ్దాలుగా చిత్ర వాయిస్ దేశమంతటా మార్మోగుతూనే ఉంది. ఇప్పటి వరకు పాతిక వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు ల్యాటిన్, అరబిక్, సింహళీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లోనూ పాడారామె. ఎంత బిజీగా ఉండేవారంటే.. ఒకసారి ఒక్కరోజులో పదహారు పాటలు పాడాల్సి వచ్చింది.

450కి పైగానే పురస్కారాలు..

చిత్ర  ఆరుసార్లు నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఎనిమిది ఫిల్మ్ ఫేర్ అవార్డులు తీసుకున్నారు. పదహారు కేరళ స్టేట్ అవార్డ్స్, పదకొండు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవార్డ్స్, నాలుగు తమిళనాడు స్టేట్ అవార్డ్స్, మూడు కర్ణాటక స్టేట్ అవార్డ్స్ అందుకున్నారు. ఒరిస్సా స్టేట్ అవార్డ్ ఒకసారి, వెస్ట్ బెంగాల్ స్టేట్ అవార్డ్ ఒకసారి వరించాయి. 2005లో పద్మశ్రీ, 2021లో పద్మభూషన్ అవార్డులతో ప్రభుత్వం చిత్రను సత్కరించింది. బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆమెను సన్మానించింది. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ మహిళ చిత్రనే కావడం విశేషం. చైనా గవర్నమెంట్ నుంచి కూడా అవార్డు తీసుకన్న మొదటి ఇండియన్ సింగర్ చిత్రనే. 2018లో రాష్ట్రపతి అవార్డును సైతం అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేశారు చిత్ర.  ఇప్పటికి నాలుగొందల యాభైకి పైనే పురస్కారాలు గెల్చుకున్నారంటే ఆమెకి ప్రపంచమంతటా ఎంతమంది అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

తీరని వేదన

చిత్ర భర్త పేరు విజయశంకర్. ఆయనో ఇంజినీర్. బిజినెస్‌మేన్ కూడా. వారికి నందన అనే కూతురు పుట్టింది. అయితే డౌన్‌ సిండ్రోమ్ కారణంగా తనని నిరంతరం కళ్లలో పెట్టుకుని చూసుకోవాల్సి వచ్చేది. అందుకే ఎక్కడికి వెళ్లినా కూతురిని తనతో తీసుకెళ్లేవారు చిత్ర. 2011లో రెహమాన్ కాన్సర్ట్ల లో పాల్గొనడానికి దుబాయ్ వెళ్లినప్పుడు హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో పడి నందన చనిపోయింది. ఆ బాధ నుంచి తేరుకోడానికి చిత్రకి చాలా సమయమే పట్టింది.

 

ఫ్రీగా పాడి విరాళాల సేకరణ..

సింగర్‌‌గా ఎంత బిజీగా ఉన్నా సమాజసేవకి కూడా చిత్ర సమయం కేటాయిస్తారు. ఏషియానెట్ కేబుల్ విజన్‌తో కలిసి తన కూతురి పేరు మీద స్నేహనందన అనే ఫండ్ రైజింగ్ ఆర్గనైజేషన్‌ని లాంచ్ చేశారామె. హెల్త్ ప్రాబ్లెమ్స్‌తో బాధపడే మ్యుజీషియన్స్‌కి ఈ సంస్థ ద్వారా పాయపడుతున్నారు. ఎవరూ లేని వృద్ధులకి పెన్షన్లు అందిస్తున్నారు. ఎక్కడ ఏ సేవా కార్యక్రమానికి ఆహ్వానించినా నో అనరామె. చాలా సందర్భాల్లో ఫ్రీగా పాడి విరాళాల సేకరణకు సహకరించారు కూడా.

చిత్రమ్మకు ప్రేమతో..

సినిమాలు మాత్రమే కాదు.. ప్రైవేట్ ఆల్బమ్స్, కాన్సర్ట్స్‌ అంటూ నిరంతరం బిజీగానే ఉంటారు చిత్ర. కొన్ని మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కి జడ్జిగానూ వ్యవహరిస్తున్నారు. ముఖంలో చెరగని చిరునవ్వుతో, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వంతో  ఉండే చిత్రని అందరూ ప్రేమగా చిత్రమ్మా అంటారు. మరిన్ని సంవత్సరాలు ఇలాగే అందరి ప్రేమనూ పొందాలని, తన తీయని స్వరంతో సంగీత ప్రియుల్ని అలరించాలని కోరుకుంటూ.. చిత్రకి పుట్టినరోజు శుభాకాంక్షలు.