అమ్మాయిల పాత్రలతో అలరించి.. హావభావాలతో మెప్పించి..

అమ్మాయిల పాత్రలతో అలరించి..  హావభావాలతో మెప్పించి..

కొంతకాలం క్రితం పంకజ్ త్రిపాఠి పేరు చెబితే.. ఆయనెవరు అని అడిగేవారేమో తెలుగు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు అడగరు. ఎందుకంటే ఆయన వారికి బాగా సుపరిచితం. వెబ్ సిరీసులు సినిమాలతో పోటీపడటం మొదలయ్యాక అడపా దడపా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నారు పంకజ్. మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్ లాంటి సిరీసుల్లో నటనతో ఆయన అందరినీ ఇంప్రెస్ చేశారు. గుంజన్ సక్సేనా, మిమి, 83 లాంటి చిత్రాలతో తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకున్నారు. అలా అని తెలుగు ప్రేక్షకులకు కేవలం డబ్బింగ్ వెర్షన్ల ద్వారానే పంజక్ పరిచయమనుకుంటే పొరపాటు. మంచు విష్ణు హీరోగా నటించిన ‘దూసుకెళ్తా’ మూవీలో విలన్‌గా కనిపించి మెప్పించారు. రజినీకాంత్ ‘కాలా’లోనూ ఓ కీలక పాత్రలో నటించి సౌత్ ఆడియెన్స్ కు దగ్గరయ్యారు. ఇక ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా అందరికీ అభిమాన నటుడయ్యారు పంకజ్. తన వెర్సటాలిటీతో వారేవా అనిపించుకుంటున్నారు. ఇవాళ ఈ విలక్షణ నటుడి పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..

వీధి నాటకాలతో మొదలై..
1976లో బీహార్‌‌లోని బెల్సంద్ గ్రామంలో పంకజ్ త్రిపాఠి ఇదే రోజున పుట్టారు. నలుగురు పిల్లలో ఆయనే చిన్నవాడు. తండ్రి రైతు ఆయనకి వ్యవసాయంలో సాయపడేవారు పంకజ్. స్కూల్ చదువు పూర్తయ్యేవరకు అటు చదువుకుంటూనే ఇటు వ్యవసాయం చేసేవారు. అయితే చిన్నప్పటి నుంచి ఎందుకో నటనపై ఆసక్తి. పండగల సమయంలో ఊళ్లో నాటకాలు వేసినప్పుడు వాటిలో పార్టిసిపేట్ చేస్తుండేవారు. అయితే ఎక్కువగా అమ్మాయి పాత్రల్లో కనిపించేవారు. ఆయన నటనకు అందరూ క్లాప్స్ కొట్టేవారు. తన హావభావాలు చూసి అందరూ ముచ్చటపడేవారు. నీలో మంచి నటుడున్నాడు అని వారంతా పొగడుతూ ఉండటంతో యాక్టర్ అవ్వాలని డిసైడయ్యారు పంకజ్. 

పాట్నా టు ఢిల్లీ..
పంకజ్‌ని డాక్టర్‌‌గా చూడాలని వాళ్ల నాన్న అనుకున్నారు. కానీ ఈయనకి వంట చేయడం ఇష్టం. అందుకే చెఫ్ అవ్వాలనుకున్నారు. హైస్కూల్ పూర్తయ్యాక హోటల్ మేనేజ్‌మెంట్ చేయడానికి ఊరిని వదిలి పాట్నా వెళ్లారు. చదువుకుంటూనే నాటకాల్లో పాల్గొనేవారు. మరోవైపు కాలేజ్ పాలిటిక్స్ నూ యాక్టివ్‌గా ఉండేవారు.  ఓసారి స్టేట్ గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆయన్ని అరెస్ట్ కూడా చేశారు. వారం రోజులు జైల్లో ఉన్నాక విడుదలయ్యారు. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మనసు మాత్రం నటనపైనే ఉండేది. అయితే పూర్తిగా యాక్టింగ్ వైపు వెళ్లడానికి ధైర్యం సరిపోయేది కాదు. దాంతో హోటల్‌ మేనేజ్‌మెంట్ చేస్తూ పాట్నాలోని మౌర్య హోటల్లో కొంతకాలం  పని చేశారు. తర్వాత ఢిల్లీ వెళ్లి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో యాక్టింగ్ కోర్సు పూర్తి చేశారు. ఓ కన్నడ మూవీలో చిన్న పాత్ర దొరికితే చేశారు. కానీ తృప్తి లేక ముంబై వెళ్లి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అభిషేక్ బచ్చన్ హీరోగా నటించిన ‘రన్‌’లో చాన్స్ దొరికింది. క్యారెక్టర్ చిన్నదే అయినా పంకజ్ నటనకి ఫుల్‌ మార్కులు పడటంతో వరుస అవకాశాలు వచ్చాయి. అపహరణ్, బంటీ ఔర్ బబ్లీ, ఓంకారా, రావణ్, ఆక్రోష్, అగ్నిపథ్, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, న్యూటన్, దబాంగ్ 2, ఏబీసీడీ, ఫక్రీ, మసాన్, బరేలీకీ బర్ఫీ, స్త్రీ.. ఇలా చాలా మంచి మంచి సినిమాలు చేశారు. 

ఎక్స్ప్రెషన్ కింగ్..
పంకజ్‌కి సినిమా, టెలివిజన్‌ రంగాల్లో ఒకేసారి అవకాశాలు వచ్చాయి. ద బాంబ్ 9/11, జిందగీ కా హర్‌‌ రంగ్ గులాల్, పౌడర్, సరోజిని లాంటి సీరియల్స్ లో నటించారాయన. ఇక వెబ్ సిరీసులైతే ఆయనలోని వెర్సటాలిటీని బైటికి తీశాయి. సాక్రెడ్ గేమ్స్, మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్, యువర్స్ ట్రూలీ, గుల్ఖండా టేల్స్ లాంటి సిరీసుల్లో ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. పంకజ్‌ గొప్పదనం ఏమిటంటే.. తక్కువ మాట్లాడతారు. ఎక్కువ నటిస్తారు. అందుకే దర్శకులు ఆయనకి లిమిటెడ్ డైలాగ్స్ పెడతారు. అవి కూడా ఎంతో సింపుల్‌గా ఉంటాయి. చాలావరకు తన హావభావాలతోనే పాత్రని అద్భుతంగా పండించి సత్తా చాటుతుంటారు పంకజ్. ఇన్నోసెంట్‌ ఫేస్‌తో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కు ఫిదా అవ్వని వారుండరు. అందుకే అతి తక్కువ కాలంలోనే నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు ఎన్నో అందుకున్నారాయన. 

ఆయనంటే పిచ్చి..
గొప్ప యాక్టర్‌‌గా పేరు తెచ్చుకున్నాక కూడా ఎంతో వినయంగా ఉంటారు పంకజ్. దాంతో అందరూ ఆయన్ని అభిమానిస్తారు. పంకజ్ కూడా అందరితోనూ ఎంతో అభిమానంగా ఉంటారు. కానీ ఒక వ్యక్తి అంటే మాత్రం ఆయనకి విపరీతమైన ఇష్టం. ఒకరకంగా చెప్పాలంటే పిచ్చి కూడా. ఆయనెవరో కాదు.. మనోజ్ బాజ్‌పేయ్. పంకజ్ వాళ్ల పక్క ఊరే మనోజ్‌ది. ఆయన నటన చూసి పంకజ్‌ ఆశ్చర్యపోయేవారు. ఇక్కడ పుట్టిన ఈయన ఇంత గొప్ప నటుడైనప్పుడు, నేను అందులో కొంతయినా అవ్వలేనా అనుకునేవారు. మనోజ్ స్ఫూర్తితోనే తాను యాక్టర్ అవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నానని ఇప్పటికీ చెబుతారాయన. మనోజ్‌పై ఆయన ఇష్టం ఏ రేంజ్‌లో ఉండేదంటే.. ఓసారి షూటింగ్‌ కోసం పాట్నా వచ్చి, పంకజ్ పని చేస్తున్న హోటల్లో బస చేశారు మనోజ్. తిరిగి వెళ్లేటప్పుడు ఒక చెప్పు మర్చిపోయారు. వెంటనే  దాన్ని తీసి అట్టిపెట్టుకున్నారు పంకజ్. భద్రంగా ఉంచుకోవడమే కాక దాన్నొక ట్రోఫీలా ఫీలయ్యేవాడినని పలు సందర్భాల్లో పంకజ్ చెప్పారు.

మృదుల ప్రేమలో పంకజ్..
ఇంటర్ చదువుతున్నప్పుడు పంకజ్‌ వాళ్ల అక్కకి పెళ్లి కుదిరింది. ఆ పెళ్లిలో ఆయన మృదులను చూశారు. ఆమె పెళ్లి కొడుక్కి చెల్లెలు. తొమ్మిదో తరగతి చదువుతోంది. తనని చూడగానే పంకజ్ ఫిక్సైపోయారు.. కలిసి బతకడమంటూ జరిగితే ఆమెతోనే అని. ఇక తరచూ ఏదో ఒక వంకతో కోల్‌కతాలోని అక్కయ్య ఇంటికి వెళ్లేవారు. తన మనసులోని మాటను మాత్రం మృదులకి చెప్పలేకపోయారు. ఓసారి ఆమెకి పెళ్లి సంబంధం వస్తే.. మృదుల అన్నయ్యతో కలిసి అబ్బాయిని చూడటానికి కూడా వెళ్లారు పంకజ్. తిరిగొచ్చాక అబ్బాయి బాగున్నాడు చేసుకోమని మృదులకి చెప్పి ఢిల్లీ వెళ్లిపోయారు. మృదుల సంతోషించకపోగా ఆలోచనలో పడ్డారు. పంకజ్ అలా చెప్పడం ఆమెకి నచ్చలేదు. ఎందుకా అని ఆలోచించినప్పుడు గానీ తాను పంకజ్‌ని ప్రేమిస్తున్నట్టు అర్థం కాలేదామెకి. ఎలాగో ఆ సంబంధం చెడగొట్టుకుని, తన ప్రేమ సంగతి పంకజ్ చెవిన వేశారు మృదుల. కొన్నాళ్ల పాటు ఫోన్లు, ఉత్తరాలతో కాలం గడిపాక తమ ప్రేమ సంగతి ఇంట్లో వాళ్లకి చెప్పారిద్దరూ. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. తమ కుటుంబ సంప్రదాయం ప్రకారం కుండమార్పిడి పెళ్లి కుదరదన్నారు. అయినా ఎలాగో వాళ్లందరినీ ఒప్పించి మృదులను పెళ్లి చేసుకున్నారు పంకజ్. వీరికి ఒక కూతురు.. పేరు ఆషీ.

పంకజ్ చాలా మంచి భర్త అని మృదుల అంటారు. ఆయనో గ్రేట్ ఫాదర్ అంటుంది ఆషీ. గొప్ప వ్యక్తి అంటారు ఇండస్ట్రీ వారు. అద్భుతమైన నటుడు అంటారు ప్రేక్షకులు. ఇంతమంది అభిమానాన్ని సంపాదించిన పంకజ్ మాత్రం.. అందరూ అనుకునేంత గొప్పవాణ్ని కాదు అంటారు వినయంగా.. గొప్పవాళ్లెప్పుడూ గొప్పవాళ్లమని చెప్పుకోరు కదా. ఆ గొప్పతనం వారి చేతల్లో కనిపిస్తుందంతే. ఆయన మరెన్నో ఏళ్లు ఇలాగే కొనసాగాలని, ఇంతకంటే గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటూ.. పంకజ్ త్రిపాఠికి పుట్టినరోజు శుభాకాంక్షలు.