నెట్వర్క్, వెలుగు : బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను శుక్రవారం ఉమ్మడి జిల్లాలో అధికారులు, లీడర్లు, ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. నస్పూర్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి, నివాళులర్పించారు. 30 సంవత్సరాలపాటు ఆయన దేశానికి అందించిన సేవలు మరువలేనివన్నారు.
ఆసిఫాబాద్‌లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు బాబు జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ సురేశ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ దాసరి వేణు, ఆర్డీఓ లోకేశ్వర్ రావు బాబు జగ్జీవన్ రామ్ ఫొటోకు పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఆయన ప్రజల సంక్షేమం కోసం విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. మందమర్రి మున్సిపల్ ఆఫీస్‌లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ఆఫీస్‌లో ఎంపీడీవో రాజేశ్వర్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ జగ్జీవన్‌రాం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఉట్నూర్ మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఉన్నారు.