రాజకీయాలకు సోనియా గాంధీ గుడ్ బై

రాజకీయాలకు  సోనియా గాంధీ గుడ్ బై

కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. చత్తీస్ ఘడ్ రాయ్‭పూర్ వేదికగా జరుగుతున్న ప్లీనరీలో.. పొలిటికల్ రిటైర్మెంట్ గురించి ప్రస్తావించారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి కీలక మలుపు అన్న ఆమె.. ఈ యాత్ర అనంతరం తన  పొలిటికల్ ఇన్నింగ్స్ ముగిసిందని చెప్పారు. యాత్ర కోసం రాహుల్ గాంధీ పట్టుదలతో పనిచేశారన్న సోనియా.. ప్రజలు, కాంగ్రెస్ పార్టీ మధ్య సంబంధాలను పునరుద్దరించేందుకు రాహుల్ చేపట్టిన ఈ యాత్ర ఎంతో దోహదపడిందని అన్నారు. రాహుల్ గాంధీకు అండగా నిలిచి జోడో యాత్రను సక్సెస్ చేసిన కార్యకర్తలందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. కార్యకర్తలు ఖర్గే నేతృత్వంలో ఎన్నికలకు సిద్ధం కావాలని సోనియా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు దేశానికి ఇది ఎంతో కీలక సమయమన్న అభిప్రాయపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాలన ప్రతి సంస్థను కనికరం లేకుండా అణచివేసి, స్వాధీనం చేసుకుంటున్నాయని ఆమె ఆరోపించారు.  మోడీ నిర్ణయాలన్నీ కొద్ది మంది వ్యాపారులకు మాత్రమే అనుకూలంగా ఉంటున్నాయని సోనియా మండిపడ్డారు. 

మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు, మహిళలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తోందని, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తోందని సోనియా గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం కోసం పోరాడతామని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో.. బీజేపీని ఓడించాలని కార్యకర్తలకు సోనియా పిలుపునిచ్చారు.