ఎముకలు కొరికే చలిలో ఐస్​ పండుగ

ఎముకలు కొరికే చలిలో ఐస్​ పండుగ

చైనాలో స్టార్టయిన హార్బిన్​ ఐస్​ ఫెస్టివల్​..
కోటలు, బండ్లు, రైళ్లన్నీ మంచువే

ఎముకలు కొరికే చలి. ఎటు చూసినా మంచు కొండలే. అడుగు తీసి అడుగేసుడూ కష్టమే. కానీ ఇంతటి చలినీ జనం విపరీతంగా ఎంజాయ్‌‌ చేస్తున్నారు. ఆ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. అక్కడి అద్భుతాలు చూసి నోరెళ్లబెడుతున్నారు. అంత జబర్దస్త్‌‌గ ఉంటది మరి చైనాలోని హార్బిన్‌‌ ఐస్​ ఉత్సవం. డ్రాగన్‌‌ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌‌లో ఏటా జరుగుతుందీ పండుగ. ప్రపంచంలోని అతిపెద్ద ఐస్​ఫెస్టివల్స్​లో ఇదీ ఒకటి. జనవరి 5న అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 25 వరకు జరుగుతుంది. ఎంట్రెన్స్‌‌ ఫీజు రూ.3,500. సుమారు 2,20,000 చదరపు మీటర్ల ఐస్​తో ఈ మంచు ప్రపంచాన్ని కట్టారంట. మంచు ఇటుకలతో కట్టిన పెద్ద నిర్మాణాలు, టవర్లు, రైళ్లు చూసి ఆశ్చర్యపోవాల్సిందే.

స్లెడ్జింగ్, ఐస్ హాకీ, ఐస్ ఫుట్‌‌బాల్, స్పీడ్ స్కేటింగ్ లాంటి పోటీలూ ఈ ఫెస్టివల్‌‌లో జరుగుతాయి. గడ్డకట్టే చలిలోనూ చల్లని నీటిలో ఈతల పోటీలు ఇక్కడి సాంఘువా నదిలో నిర్వహిస్తారు. ఐస్​ థీమ్‌‌తో సామూహిక ఉత్సవాలూ జరుగుతాయిక్కడ. హార్బిన్‌‌ ఐస్​ ఫెస్టివల్​ 1963లో మొదలైంది. చైనా సాంస్కృతిక విప్లవంతో మధ్యలో కొన్నేళ్లు ఆగినా 1985లో మళ్లీ స్టార్టయింది. 2022లో చైనాలోనే వింటర్‌‌ ఒలింపిక్స్‌‌ ఉన్నందున టూరిజంను పెంచేందుకు చైనా ఎక్కువ ఖర్చు చేస్తోందని అక్కడి మీడియా వెల్లడించింది. 2018–19 వింటర్‌‌లో 22 కోట్ల మంది టూరిస్టులు వచ్చారని, అది అంతకుముందు ఏడాది కన్నా 14% ఎక్కువని చెప్పింది.