స్ట్రీట్​డాగ్స్ ఆకలి తీరుస్తున్న హర్బిసన్

  స్ట్రీట్​డాగ్స్ ఆకలి తీరుస్తున్న హర్బిసన్

సెలవు రోజు అంటే చాలు... ఫ్రెండ్స్​తో ఏ సినిమాకు వెళ్లాలి? ఏ ప్లేస్​కి టూర్​ వేయాలి?... ఇలా రకరకాల ప్లాన్స్​తో ఉంటారు చాలామంది. కానీ, ఇతను మాత్రం ఆదివారం వచ్చిందంటే...  స్ట్రీట్​ డాగ్స్​కి ఫుడ్​ తీసుకెళ్తాడు. దాదాపు రెండేండ్లుగా స్ట్రీట్ డాగ్స్​కి ఫుడ్ పెడుతున్న ఇతను ఒక సెలబ్రిటీ చెఫ్​. ఐర్లాండ్​కి చెందిన ఇతని పేరు నియల్ హర్బిసన్.

తన చేతి వంటతో కడుపునిండా తినేలా చేసే హర్బిసన్​కి ఎవరైనా పస్తులుంటే నచ్చదు.  జంతువులైనా  సరే ఆకలితో అల్లాడుతుంటే  తట్టుకోలేడు. వాటికి ఫుడ్ పెట్టి, ఆకలి తీర్చాకగానీ అతని మనసు నిమ్మలం కాదు. హర్బిసన్ 2018లో థాయిలాండ్​లోని కోహ్​ సమూయ్​ దీవిలో సెటిల్ అయ్యాడు. కరోనా టైంలో అక్కడి స్ట్రీట్​ డాగ్స్​ ఆకలితో అల్లాడిపోవడం గమనించాడు హర్బ్​సన్​.  టూరిస్ట్​లు లేకపోవడం వల్ల కూడా వాటికి తిండి దొరకడం మరింత కష్టమైంది.  దాంతో స్ట్రీట్​డాగ్స్​ ఆకలి తీర్చాలని డిసైడ్ అయ్యాడు హర్బ్​సన్. 

ప్రతి ఆదివారం ఉదయాన్నే లేచి.. స్ట్రీట్​డాగ్స్​కోసం మాంసంతో పాటు క్యారెట్, బ్రకోలి వంటి కూరగాయల వంటకాలు చేస్తాడు హర్బ్​సన్.  ఫుడ్​ని చిన్న పేపర్ కప్స్​లో వేసి, జీపు వెనకాల పెట్టుకుని వీధుల్లోకి వెళ్తాడు. స్ట్రీట్ డాగ్స్ కనిపించిన చోటల్లా జీపు ఆపి, వాటికి ఫుడ్ పెడతాడు.  మరింత మందిని మోటివేట్ చేయడం కోసం సోషల్​ మీడియాలో తన సర్వీస్​ గురించి పోస్ట్​లు పెడుతుంటాడు కూడా.  ‘‘మొదట్లో ఒక కుక్కకి ఫుడ్ పెట్టాను. ఇప్పుడు 80కి పైగా కుక్కల ఆకలి తీరుస్తున్నా” అంటున్నాడు హర్బిసన్.  వాటికి ఏదైనా జబ్బు చేసినా లేదా వ్యాక్సిన్ కోసం  వెటర్నరీ డాక్టర్  దగ్గరికి తీసుకెళ్తాడు. ​అతడి సేవని ఆన్​లైన్​లో చాలామంది మెచ్చుకుంటున్నారు.