కాంగ్రెస్ లో మూడేళ్లు సమయాన్ని వృథా చేసుకున్నాను

కాంగ్రెస్ లో మూడేళ్లు సమయాన్ని వృథా చేసుకున్నాను

అహ్మదాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తాను ఏ రాజకీయ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గుజరాత్ లోని పాటీదార్ నాయకుడు హార్దిక్ పటేల్ చెప్పారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తర్వాత హార్దిక్ బీజేపీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హార్దిక్ స్పందించారు. ఇప్పటివరకైతే బీజేపీ, ఆప్.. లేదా ఏ పార్టీలో చేరాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తనలా కాంగ్రెస్ లో చాలామంది అసంతృప్తితో ఉన్నారంటూ హార్దిక్ పటేల్ బాంబు పేల్చారు. 

కాంగ్రెస్ లో మూడేళ్లు వృథా చేసుకున్నాను..

మరోవైపు కాంగ్రెస్ పార్టీపై హార్దిక్ పటేల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుజరాత్ లో కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీలో ఉండి తాను మూడేళ్లు వృథా చేసుకున్నానని అన్నారు. కాంగ్రెస్ కు ఒక విజన్ లేదని, గుజరాత్ ప్రజల పట్ల కాంగ్రెస్ నాయకులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. 33 ఏళ్లుగా కాంగ్రెస్ ను ఏడెనిమిది మంది నడుపుతున్నారని, తనలాంటి కార్యకర్తలు 500 నుంచి 600 కిలోమీటర్లు రోజూ ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఒకవేళ తాను ప్రజల మధ్యకు వెళ్లి వారి పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే గుజరాత్ లోని కొందరు సీనియర్ నాయకులు మాత్రం ఏసీ గదుల్లో కూర్చొని తమ ప్రయత్నాలను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాటీదార్ (పటేల్ వర్గం) నాయకుడు హార్దిక్ పటేల్ బుధవారం (ఈనెల 18వ తేదీన) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ‘కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రం, దేశంలోని సమస్యల కంటే మొబైల్ ఫోన్లపైనే ఎక్కువ ధ్యాస. వారికి చికెన్ శాండ్ విచ్ లు సమకూర్చడంపైనే గుజరాత్ కాంగ్రెస్ నేతలకు ఆసక్తి’ అంటూ తన రాజీనామా లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరలో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే యువనేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

సోషల్ మీడియాలో ట్రోలింగ్‌‌పై తెలుగు ఫిలిం ఛాంబర్ గరంగరం

సినిమాలపై ట్రోలింగ్ ఎక్కువైంది