నా టార్గెట్ వరల్డ్ కప్

నా టార్గెట్ వరల్డ్ కప్

గాయంతో టీమిండియాకు దూరం.. ఫిట్‌‌నెస్ లేకపోవడంతో జట్టులో చోటు మిస్.. మళ్లీ చోటు దక్కడం కష్టమే అన్న సమయంలో హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ 15వ సీజన్‌‌లో గుజరాత్ టైటాన్స్‌‌ను నడిపించే అవకాశం వచ్చింది. అంతే,  టైటాన్స్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌పై విమర్శల వర్షం మొదలైంది. అసలు  సీజన్‌‌లో అన్ని మ్యాచ్‌‌లు ఆడే ఫిట్‌‌నెస్ ఉందో లేదో చూడకుండానే పాండ్యాకు కెప్టెన్‌‌గా అవకాశం ఇవ్వడం మూర్ఖత్వమని సోషల్ మీడియాలో కామెంట్లూ వచ్చాయి. కానీ వీటిని పాండ్యా ఏమాత్రం పట్టించుకోలేదు. తనని తాను మార్చుకున్నాడు. తన సత్తా ఏంటో  నిరూపించుకున్నాడు. అదే సమయంలో  జట్టు కొత్తదే అయినా, చాలామంది ప్లేయర్ల అనుభవం తక్కువే  అయినా.. కెప్టెన్సీ మొదటిసారే అయినా.. ఇవేమీ విజయానికి అడ్డుకాదని నిరూపించాడు. ఆడిన మొదటి మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు మిగతా జట్లపై పూర్తి ఆధిపత్యం చూపిస్తూ గుజరాత్‌‌కు తొలి సీజన్‌‌లోనే పాండ్యా టైటిల్ అందించాడు. ఇది జట్టేనా అని ఎద్దేవా చేసిన వాళ్లతోనే ఇదీ జట్టంటే అనిపించాడు.  తన ఆట, ఫిట్‌‌నెస్‌‌ను విమర్శించిన వాళ్ల నుంచే టీమిండియా భవిష్యత్ కెప్టెన్ అంటూ పొగడ్తలు అందుకున్నాడు. గడిచిన మూడేళ్లలో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్న పాండ్యాకు ఈ ఐపీఎల్‌‌ సక్సెస్‌‌ ఒకరకంగా పునర్జన్మ లాంటిదే. అత్యుత్తమ ఫామ్‌‌ అందుకున్న హార్దిక్‌‌ టీ20 వరల్డ్ కప్‌‌లో టీమిండియాకు అది పెద్ద ఆయుధంగా మారబోతున్నాడు.

కెప్టెన్‌‌గా ధోనీ బాటలో..

ఆటగాడిగా పాండ్యా వేరు. కెప్టెన్‌‌గా పాండ్యా వేరు. ఐపీఎల్లో హార్దిక్ కెప్టెన్సీ చూశాక ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చిన మాట ఇది. ఇంతకుముందు టీమిండియా, ముంబైకి ఆడినప్పుడు హార్దిక్‌‌లో దూకుడు మాత్రమే కనిపించేది. కానీ కెప్టెన్‌‌ అయ్యాక అతడు పూర్తిగా మారిపోయాడు. తన కెరీర్‌‌లో ధోనీ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే పాండ్యా.. కెప్టెన్‌‌గా మహీ బాటలోనే న-డిచాడు. గ్రౌండ్‌‌లో ప్రశాంతంగా, పక్కా ప్లానింగ్‌‌తో ముందుకు సాగాడు. నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాడు.  టీ20 ఫార్మాట్ బ్యాటర్లది మాత్రమే కాదు బౌలర్లదని నమ్మిన పాండ్యా.. జట్టులో బలమైన బౌలింగ్ యూనిట్‌‌ను తయారు చేశాడు. యశ్ దయాల్, సాయి కిశోర్ లాంటి యువ బౌలర్లపై నమ్మకముంచి వారి నుంచి సూపర్ పెర్ఫామెన్స్ రాబట్టడంలో సక్సెస్‌‌ అయ్యాడు. గుజరాత్ విక్టరీలో ఇదే కీలక పాత్ర పోషించింది. 

ఆల్‌‌ రౌండర్‌‌గా పైపైకి

వెన్నునొప్పికి  సర్జరీ తర్వాత హార్దిక్ బౌలింగ్ వేయడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సర్జరీ తర్వాత టీమిండియాకు ఆడినా కేవలం బ్యాటర్‌‌గానే సేవలందించాడు. దీంతో అతడి స్థానంలో మరో ఆల్‌‌రౌండర్‌‌ను తీసుకోవాలంటూ మాజీలు సూచించారు. అయితే ఐపీఎల్‌‌లో వారికి తన ఆటతోనే సమాధానం చెప్పాడు హార్దిక్‌‌. బ్యాట్‌‌తో పాటు బాల్‌‌తోనూ సత్తాచాటాడు. బ్యాటింగ్‌‌లో ఎప్పుడూ బాదడంపైనే ఫోకస్ చేసే అతడు.. ఈ సీజన్‌‌లో సమయోచితంగా ఆడాడు. జట్టుకు ఏం కావాలో అది మాత్రమే చేసి తోటి ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేశాడు. ఆడిన 15 మ్యాచ్‌‌ల్లో 30.3 ఓవర్లు వేసి 7.27 ఎకానమీతో 8 వికెట్లు తీశాడు. అలాగే 487 రన్స్‌‌తో లీగ్‌‌లో టాప్‌‌ స్కోరర్ల లిస్ట్‌‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. ఫైనల్లో 34 రన్స్ చేసిన అతను తొలుత బౌలింగ్​లోనూ (3/17) రాణించి  ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కించుకున్నాడు.

టీమిండియా భవిష్యత్ కెప్టెన్!

విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌‌గా తప్పుకొన్నాక రోహిత్ శర్మ  టీమిండియా కెప్టెన్సీ  స్వీకరించాడు. అయితే 35 ఏళ్ల రోహిత్ ఎక్కువ కాలం సారథిగా ఉండబోడు.  మరో రెండు, మూడేళ్లలో జట్టుకు కొత్త కెప్టెన్ అవసరం. రోహిత్‌‌ వారసులుగా ప్రస్తుతానికి కేఎల్ రాహుల్, పంత్, బుమ్రా పేర్లు వినిపిస్తుండగా ఇప్పుడు పాండ్యా పేరు ఈ జాబితాలో చేరింది. ఎంతో ఒత్తిడి ఉండే ఐపీఎల్‌‌ ఫస్ట్​ సీజన్‌‌లోనే గుజరాత్‌‌కు టైటిల్ అందించిన హార్దిక్.. టీమిండియాను కూడా భవిష్యత్‌‌లో సక్సెస్‌‌ఫుల్‌‌గా నడిపించగలడని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.  ఇదే జోరు కొనసాగిస్తే హార్దిక్​ను ఇండియా కెప్టెన్​గా చూడొచ్చు.

టార్గెట్.. వరల్డ్ కప్ 

టీమిండియా వరల్డ్ కప్ గెలవడం నా ముందున్న లక్ష్యం. మెగాటోర్నీలో జట్టును గెలిపించేందుకు కృషిచేస్తా. కెప్టెన్‌‌‌‌గా గుజరాత్‌‌కు తొలి సీజన్‌‌లోనే టైటిల్ అందించడం నా కెరీర్‍‌‌లో ఎంతో ప్రత్యేకమైంది. లీగ్‌‌లో మొత్తంగా ఐదు టైటిళ్లు గెలవడం అదృష్టంగా భావిస్తున్నా. అలాగే నా పెర్ఫామెన్స్ పట్ల నా భార్య నటాషా చాలా హ్యాపీగా ఉంది. నేను ఫిట్‌‌నెస్ కోసం ఎంత శ్రమించానో తనకు మాత్రమే తెలుసు. ఫ్యామిలీనే నా బలం. కష్ట సమయంలో నాకు అండగా నిలిచింది.
          ‌‌‑ హార్దిక్ పాండ్యా