'హరి హర వీరమల్లు' లేటెస్ట్ అప్డేట్

'హరి హర వీరమల్లు' లేటెస్ట్ అప్డేట్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ షూట్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా 900 మంది నటీనటులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ కు సంబంధించిన విశేషాలను మేకర్స్ వెల్లడించారు.

  

"చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. సూక్ష్మమైన వివరాల పరిశోధన, వందలాది తారాగణం , సిబ్బంది  అపారమైన కృషి అవసరమవుతుంది. పవన్ కళ్యాణ్ తో పాటు 900 మంది నటీనటులు, సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు. 'హరి హర వీరమల్లు' ఒక మైలురాయి చిత్రం అవుతుందని.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం "  అని చిత్ర బృందం వెల్లడించింది.

ఈ చిత్రంలో పవన్ బందిపోటు దొంగగా నటిస్తున్నాడు. పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటులు బాబీ డియోల్, నర్గిస్ ఫక్రి, పూజిత పొన్నాడ నటిస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో 2023లో విడుదల చేయనున్నారు.