సీఎం కామెంట్లకు హరీశ్ సమర్థన​

 సీఎం కామెంట్లకు హరీశ్ సమర్థన​
  • రాజ్యాంగం మార్చాలన్న సీఎం కామెంట్లకు హరీశ్ సమర్థన​
  • బడ్జెట్​లో కేంద్రం రైతులకు మొండి చెయ్యిచూపిందని మండిపాటు

యాదగిరిగుట్ట/సిద్దిపేట రూరల్, వెలుగు: రాజ్యాంగం గురించి సీఎం కేసీఆర్​ తప్పుగా ఏం మాట్లాడారని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. కేసీఆర్​ మాటలపై సంజయ్​, బీజేపీ, ప్రతిపక్షాల నాయకులు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. తాను రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారంటూ అంబేద్కరే చెప్పారని, అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాలంటూ ఆనాడే పార్లమెంట్​లో స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. తాను రాసిన రాజ్యాంగం అమలు కానప్పుడు దానిని తగులబెట్టాలంటూ అంబేద్కరే చెప్పారన్నారు. దేశంలో రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటోందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో గురువారం జరిగిన టీఆర్​ఎస్​ యువజన, విద్యార్థి, సోషల్​ మీడియా నియోజకవర్గ స్థాయి సమావేశం, సిద్దిపేట జిల్లా చింతమడకలో డబుల్​ బెడ్రూం గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జనాభా లెక్కన రిజర్వేషన్లు ఇవ్వాలని మొత్తుకుంటున్నా కేంద్రం పట్టిచుకోవడం లేదన్నారు. ఎస్సీల రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి, గిరిజనులకు 10 శాతానికి పెంచాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా పట్టింపు లేదని, అలాంటప్పుడు రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటోళ్లకు ఇచ్చేస్తున్న కేంద్రం.. ఆ సంస్థల్లో రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తుందని నిలదీశారు.  
అబద్ధాలతో పబ్బం గడుపుతున్నరు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద పబ్బం గడుపుకుంటోందని హరీశ్​ విమర్శించారు. బడ్జెట్​లో తెలంగాణకు మొండి చేయి చూపించినా బీజేపీ నాయకులు నైతికత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ లీడర్లు తమ మనుషులతో తామే దాడి చేయించుకుని టీఆర్​ఎస్సే దాడి చేశారంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు భర్తీ కోసం మిలియన్​ మార్చ్​ చేస్తానంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్​.. దమ్ముంటే కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయించాలని సవాల్​ విసిరారు. రాష్ట్రంలో ఇప్పటికే 1.32 లక్షల ఖాళీలను భర్తీ చేశామని, త్వరలోనే మిగతా ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ఈసారి బడ్జెట్​లో కేంద్ర ప్రభుత్వం రైతులకు మొండి చెయ్యి చూపించిందని హరీశ్​ మండిపడ్డారు. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెడితే రూ.5 వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పడం దారుణమన్నారు. దేశంలో కొత్తగా 157 మెడికల్​ కాలేజీలను మంజూరు చేసినా.. ఒక్కటీ తెలంగాణకు ఇవ్వలేదని విమర్శించారు. కాగా, సిద్దిపేట రూరల్​ మండలంలోని పుల్లూరు బండ జాతరకు హరీశ్​ వెళ్లారు. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతర చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

స్వర్ణతాపడానికి కిలో గోల్డ్​ ఇచ్చిన హరీశ్​రావు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఆర్థిక మంత్రి హరీశ్​రావు గురువారం ఫ్యామిలీతో కలిసి దర్శించుకున్నారు. తర్వాత స్వామివారి గర్భగుడి దివ్యవిమాన‌ గోపుర స్వర్ణ తాపడం కోసం సిద్దిపేట నియోజకవర్గం తరఫున కిలో బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. మెయిన్ టెంపుల్​ను విజిట్ ​చేసి పనులను పరిశీలించారు. తన నియోజకవర్గం తరఫున మరో కిలో బంగారాన్ని త్వరలో విరాళంగా ఇవ్వనున్నట్లు హరీశ్​ ప్రకటించారు.  మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణ ద్వారా ప్రధానాలయంలో స్వయంభూ నారసింహుడి దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయని తెలిపారు.