సీఎంవా.. చెడ్డీ గ్యాంగ్ మెంబర్​వా?.. బోనస్ అడిగితే డ్రాయర్ ఊడగొడ్తా అంటవ : హరీశ్ రావు

సీఎంవా.. చెడ్డీ గ్యాంగ్ మెంబర్​వా?..  బోనస్ అడిగితే డ్రాయర్ ఊడగొడ్తా అంటవ :  హరీశ్ రావు

 

  •  పదేండ్లు సీఎంగా చేసిన కేసీఆర్​తో ఇలాగే మాట్లాడుతవా?
  • నాలుగు నెలలైన గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆగ్రహం

వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని కేసీఆర్ కోరితే.. ‘నీ డ్రాయర్ ఊడగొడ్తా’అని రేవంత్ రెడ్డి అంటున్నారని, తెలంగాణ తీసుకొచ్చి పదేండ్లు సీఎంగా చేసిన వ్యక్తితో ఇలాగే మాట్లాడుతారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్​తో మాట్లాడే భాష ఇదేనా? అంటూ మండిపడ్డారు. నువ్వు సీఎంవా.. చెడ్డీ గ్యాంగ్ మెంబర్​వా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలు, అభయహస్తం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నాలుగు నెలల్లో రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారంలోని శ్రీ గణేష్ ఆలయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథాలకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లీడర్లు ఆచరణలో సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలకు దోఖా చేసిన్రు. మార్పు.. మార్పు.. అంటూ ఉన్న సంక్షేమ పథకాలకు కోత పెట్టిన్రు. పాల పొంగులా కాంగ్రెస్ పాలన నిజ స్వరూపం బయటపడింది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నరు. 120 రోజులైనా హామీలు అమలు చేయలేదు. మహాలక్ష్మి పథకం కింద 18 ఏండ్లు నిండిన మహిళలకు రూ.2,500 ఇస్తామన్నరు. ఇప్పటి దాకా రూపాయి ఇవ్వలేదు.’’అని హరీశ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.42 కోట్ల మంది మహిళలకు కాంగ్రెస్ బాకీ పడిందన్నారు.

2లక్షల రుణమాఫీ హామీ ఏమైంది?

రాష్ట్రంలో 42 లక్షల మంది పింఛన్​దారులు ఉన్నారని, వారందరికి నెలకు రూ.4 వేలు ఎప్పుడిస్తారో చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ‘‘నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్, ప్రియాంక గాంధీ, రేవంత్ ఎన్నికల సభలో ప్రకటించారు. మేము అలాంటి హామీ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి అంటున్నడు.  రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా ఇప్పటికీ ఇవ్వలేదు. కేసీఆర్ కిట్ బంద్ చేసిన్రు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైంది?’’అని నిలదీశారు. వడ్లకు రూ.500 బోనస్ ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు. వెంటనే 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, కోతల్లేకుండా కరెంట్ సప్లై చేయాలని డిమాండ్ చేశారు. ఫేక్, లీక్ వార్తలు ఎక్కువ రోజులు సాగవన్నారు. 2001 నుంచి మెదక్ పార్లమెంట్ స్థానంలో గెలుస్తున్నామని తెలిపారు. మెదక్ గడ్డ.. బీఆర్ఎస్ పార్టీకి అడ్డా అని తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్​గా 11 ఏండ్లు ప్రజా సేవ చేశానని ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి అన్నారు. ప్రజలందరూ కలిసి తనను ఆశీర్వదించాలని కోరారు. ‘‘పటాన్​చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ వాసిని. ఏ కష్టం వచ్చినా పిలవగానే వస్తా. అండగా నిలుస్తా. ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు సేవ చేస్తున్న’’అని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.