కేసీఆర్ కిట్టు బందయ్యింది... తిట్లు మొదలైనయ్: హరీష్ రావు

 కేసీఆర్ కిట్టు బందయ్యింది... తిట్లు మొదలైనయ్: హరీష్ రావు

సంగారెడ్డి: వందరోజుల్లో హమీలు నెరవేరుస్తామని చెప్పినా.. ఇప్పటికీ ఎలాంటి హమీలు నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.  ఇప్పటికే పేద మహిళలకు ఫించన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి.. 42లక్షల మందికి బాకీపడ్డారన్నారు.  కౌలు రైతులకు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు.  కాంగ్రెస్ వంద రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. బుధవారం పటాన్ చెరు నియోజకవర్గం రుద్రారం  గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో  ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి.. బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు హరీష్ రావు. 

 అనంతరం ఆయన మాట్లాడుతూ..   గణేశ్ గడ్డ బీఆర్ఎస్ కు కలిసి వచ్చిన  గడ్డ అన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు గులాబీ జెండా మెదక్ పార్లమెంట్ లో ఎగురుతుందని చెప్పారు. త్వరలోనే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్  గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  రైతుల దగ్గరకు కేసీఆర్ పోయి పరామర్శిస్తే తట్టుకోలేక.. రేవంత్ రెడ్డి నోటి కొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలని అధికారంలోకి వచ్చి ప్రజలను మాయచేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి లోకల్ కాదంటూ దుష్ర్పచారం చేస్తున్నారని.. ఆయన తెల్లాపూర్ లోనే ఉంటున్నారని హరీష్ రావు చెప్పారు.