- ఆర్చరీలో స్వర్ణం గెలిచిన తొలి ఇండియన్‌గా రికార్డు
పారిస్ గడ్డపై ఇండియా పారా వీరులు పతకాల పంట పండిస్తున్నారు. ఆర్చరీలో హర్వీందర్ సింగ్ దేశానికి తొలి స్వర్ణం అందించి చరిత్ర సృష్టించగా.. షాట్‌పుట్‌లో సచిన్ సర్జేరావు ఖిలారి రజతంతో మెరిశాడు. అథ్లెటిక్స్ లో మంగళవారం అర్ధరాత్రి మరో నాలుగు పతకాలు లభించాయి. దాంతో పారాలింపిక్స్ చరిత్రలో ఇండియా మొదటిసారి 20 పతకాల మార్కును దాటింది. గత ఎడిషన్‌లో నెగ్గిన 19 మెడల్స్ రికార్డును బ్రేక్ చేసింది. ప్రస్తుతం 4 స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్యా సహా 22 పతకాలతో ఇండియా 16వ స్థానంలో ఉంది.
- అథ్లెటిక్స్‌లో మరో ఐదు మెడల్స్
- 22కి చేరిన పతకాల సంఖ్య
- పారాలింపిక్స్ చరిత్రలో ఇండియాకు అత్యధికం
పారిస్: మూడేండ్ల కిందట టోక్యోలో కాంస్యం గెలిచి ఆర్చరీలో ఇండియాకు తొలి పారాలింపిక్ పతకం అందించిన హర్వీందర్ సింగ్ పారిస్‌లో పసిడి పట్టేశాడు. మెన్స్ ఇండివిడ్యువల్ రికర్వ్ కేటగిరీలో బంగారు పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన దేశ తొలి ఆర్చర్‌గా చరిత్రకెక్కాడు.తొమ్మిదో సీడ్‌గా బరిలోకి దిగిన హర్వీందర్ తన గురితో ఒక్కో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. బుధవారం రాత్రి జరిగిన గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో హర్వీందర్ 6–0తో ఆరో సీడ్ పోలాండ్‌కు చెందిన లుకాస్ట్ సిస్జెక్‌ను చిత్తుగా ఓడించాడు.
ఏకపక్షంగా సాగిన ఈ పోరులో తొలి సెట్‌ను హర్వీందర్ (9,10, 9 స్కోర్లు) 28–24 స్కోరుతో సులువుగా నెగ్గి 2–0తో ఆధిక్యం సాధించాడు. రెండో సెట్‌లోనూ 28 పాయింట్లు రాబట్టిన (9, 9,10) ఇండియా ఆర్చర్ 4–0తో ముందంజ వేశాడు. అప్పటికే విజయం దాదాపు ఖాయం అవ్వగా.. 10, 10, 9 స్కోర్లతో మూడో సెట్‌ను కూడా గెలిచి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. అంతకుముందు సెమీఫైనల్లో 7–3తో ఇరాన్‌కు చెందిన మొహమ్మద్ రెజాను ఓడించిన హర్వీందర్ క్వార్టర్ ఫైనల్లో 6–2తో కొలంబియా ఆర్చర్ జులియో హెక్టార్‌ను చిత్తు చేశాడు. పారిస్ ఆర్చరీలో ఇండియాకు ఇది రెండో పతకం. కాంపౌండ్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో శీతల్ దేవి–రాకేశ్ కుమార్ కాంస్యం గెలిచారు.
గురి తప్పని మొనగాడు
హర్యానాలోని కైతాల్ జిల్లాలో రైతు కుటుంబంలో పుట్టిన హర్వీందర్ లక్ష్యాన్ని గురి చూసి కొట్టడంలో దిట్ట. ఊహ తెలియనప్పుడే తను కష్టాలకు ఎదురీదడం నేర్చుకున్నాడు. ఏడాదిన్నర వయసులో తను డెంగీ బారిన పడ్డాడు. ఈ వ్యాధి చికిత్సకు ఉపయోగించిన ఇంజెక్షన్ల సైడ్ ఎఫెక్ట్స్‌తో కాళ్లలో పటుత్వం కోల్పోయి దివ్యాంగుడిగా మారిపోయాడు. 2012 లండన్ పారాలింపిక్స్ పోటీల నుంచి ప్రేరణ పొంది తాను కూడా ఆటల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. అలా బాణం, విల్లు పట్టుకున్న హర్వీందర్ 2017 పారా ఆర్చరీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అరంగేట్రం చేశాడు.
ఆ టోర్నీలో ఏడో స్థానంలో నిలిచినా నిరాశ చెందలేదు. 2018 ఆసియా పారా గేమ్స్‌లో బంగారు పతకాన్ని గురి చూసి కొట్టాడు. ఆటలో ముందుకెళ్లడానికి హర్వీందర్ కుటుంబం అతనికి అనుక్షణం అండగా నిలిచింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రాక్టీస్ ఆగిపోకూడదని తండ్రి తమ పొలాన్నే ఆర్చరీ సెంటర్‌గా మార్చాడు. అందులో కఠోరంగా శ్రమించిన హర్వీందర్ మూడేళ్ల క్రితం టోక్యో గేమ్స్‌లో కాంస్యం -- సాధించి పారాలింపిక్స్‌లో ఇండియాకు తొలి పతకం అందించిన ఆర్చర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ఏకంగా స్వర్ణం సాధించాడు. ఓ వైపు పతకాల వేట కొనసాగిస్తూనే ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ కూడా చేస్తున్నాడు.
జావెలిన్‌లోనూ డబుల్ ధమాకా
చేతుల్లో వైకల్యం ఉన్న అథ్లెట్ల కోసం నిర్వహించిన ఎఫ్46 జావెలిన్ త్రోలోనూ ఇండియా డబుల్ ధమాకా మోగించింది. అజీత్ సింగ్ రజతం, సుందర్ సింగ్ గుర్జార్ కాంస్యం గెలిచారు. అజీత్ తన ఐదో ప్రయత్నంలో జావెలిన్‌ను 65.62 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్‌లో గతేడాది వరల్డ్ రికార్డు (68.60 మీటర్లు) నెలకొల్పిన గుర్జార్ ఈసారి దానికి చాలా దూరంలో నిలిచిపోయాడు. తన నాలుగో ప్రయత్నంలో 64.96 మీటర్ల దూరం విసిరి మూడో ప్లేస్‌తో మరోసారి కంచు పతకం గెలిచాడు. టోక్యో పారాలింపిక్స్‌లోనూ అతను కాంస్యమే నెగ్గాడు.
టీటీ, షూటింగ్‌లో నిరాశ
మెన్స్ 49 కేజీ పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో కుమార్ పరమ్‌జీత్ 150 కేజీల బరువు మాత్రమే ఎత్తి ఎనిమిదో స్థానం, విమెన్స్ 45 కేజీ పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో సనికా ఖాతున్ 86 కేజీలు ఎత్తి ఏడో స్థానంతో నిరాశపరిచారు. సైక్లింగ్‌లో జ్యోతి గదేరియా, అర్షద్ షేక్ చివరి స్థానాల్లో నిలిచారు. టీటీలో భవినా పటేల్ విమెన్స్ క్లాస్4 క్వార్టర్ ఫైనల్లోనే ఓడగా, షూటర్లు నీహల్ సింగ్, రుద్రాంక్ష్ ఖండేల్‌వాల్ మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ (ఎస్‌హెచ్1) క్వాలిఫికేషన్‌లోనే వెనుదిరిగారు.
సచిన్‌కు సిల్వర్
వరల్డ్ పారా అథ్లెటిక్స్ షాట్‌పుట్‌లో గోల్డ్ గెలిచిన సచిన్ సర్జేరావు ఖిలారి పారాలింపిక్స్‌లో సిల్వర్ తెచ్చాడు. మెన్స్ ఎఫ్46 ఈవెంట్‌లో ఆసియా రికార్డును బ్రేక్ చేస్తూ 16.32 మీటర్లతో రెండో స్థానం సాధించాడు. 34 ఏండ్ల ఖిలారి తన రెండో ప్రయత్నంలో ఈ మార్కును అందుకొని మేలో వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ నెగ్గే ప్రయత్నంలో 16.30 మీటర్లతో నెలకొల్పిన ఆసియా రికార్డును బ్రేక్ చేశాడు. టోక్యో గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ కెనడాకు చెందిన గ్రెగ్ స్టెవార్ట్ 16.38 మీటర్లతో గోల్డ్ నెగ్గగా, క్రొయేషియా త్రోయర్ లూకా బకోవిచ్ 16.27 మీటర్లతో కాంస్యం గెలిచాడు. చేతుల్లో వైకల్యం ఉన్న క్రీడాకారులు ఎఫ్46 కేటగిరీలో నిల్చొని గుండును విసురుతారు. కాగా, ఎఫ్46 విమెన్స్ షాట్‌పుట్ ఫైనల్లో అష్మితా రావత్ 9.25 మీటర్లతో 14వ స్థానంతో నిరాశ పరిచింది.
తంగవేలు తీన్‌మార్
మెన్స్ టి63 హైజంప్‌లో శరద్ కుమార్ రజతం, మరియప్పన్ తంగవేలు కాంస్యం సాధించారు. ఫైనల్లో 32 ఏండ్ల శరత్ 1.88 మీటర్లు క్లియర్ చేసి రెండో స్థానంలో నిలవగా.. 29 ఏండ్ల తంగవేలు 1.85 మీటర్లతో మూడో స్థానంతో పతకం గెలిచాడు. ఇండియాకే చెందిన శైలేష్ కుమార్ 1.85 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచి పతకం కోల్పోయాడు. టి63 విభాగంలో మోకాలు లేదా పైభాగంలో వైకల్యం ఉన్నవారు పోటీ పడతారు. కాగా, పారాలింపిక్స్‌లో తంగవేలుకు ఇది మూడో పతకం. రియో గేమ్స్‌లో అతను గోల్డ్ గెలిచాడు.