ఆగమాగం నిర్ణయాలు..  అడుగడుగునా ఆటంకాలు

ఆగమాగం నిర్ణయాలు..  అడుగడుగునా ఆటంకాలు
  • ఆగమాగం నిర్ణయాలు..  అడుగడుగునా ఆటంకాలు
  • ఆగుతున్న అభివృద్ధి..  ఆందోళన బాటలో ప్రజలు
  • మెదక్​ జిల్లాలో ఆర్ఆర్ఆర్, ల్యాండ్ పూలింగ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుంఠధామాల పరిస్థితి ఇదీ.. 
  • అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరుపై విమర్శలు

మెదక్ (శివ్వంపేట, కౌడిపల్లి), వెలుగు: ప్రభుత్వం మంజూరు చేసే అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆగమాగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో  అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి చేపట్టే పనుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారు ముందస్తుగా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఇటీవల ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను బట్టి తెలుస్తోంది. మెదక్ టౌన్, శివ్వంపేట, నర్సాపూర్, తూప్రాన్, కౌడిపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనుల విషయంలో అధికారుల, ప్రజా ప్రతినిధుల తీరును నిరసిస్తూ స్థానికులు ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో నిధులు మంజూరైనా పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. 

ఎక్కడెక్కడ.. ఏఏ పరిస్థితి? 

 నర్సాపూర్​ మండలం రెడ్డిపల్లిలో రీజినల్​ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి గతంలో మార్కింగ్​ చేసిన ప్రాంతం నుంచి కాకుండా అలైన్​మెంట్​మార్చి మరో వైపు నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. దీనిపై రైతులు, ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ మంత్రి బంధువుల భూములకు నష్టం కలుగకుండా అలైన్​ మెంట్​ మార్చారంటూ రెడ్డిపల్లి రైతులు పలుమార్లు ఆందోళన చేశారు. అలాగే శివ్వంపేట మండలం రత్నాపూర్, కొంతాన్ పల్లి, పాంబండ, పోతులగూడ, గుండ్లపల్లి, కొత్తపేట్, లింగోజిగూడ గ్రామాల్లో రీజినల్​ రింగ్ రోడ్డు సర్వే విషయంలో ఆయా గ్రామ రైతులు అభ్యంతరం వ్యక్తం ​ చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు సంబంధించిన వారి భూములు కాపాడేందుకు అలైన్​ మెంట్ మార్చి పేదల భూముల మీదుగా రోడ్డు పోయేలా చేశారని రైతులు అంటున్నారు. 

 మెదక్​ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం విషయంలో స్థల వివాదం నెలకొంది. స్థానిక గవర్నమెంట్ జూనియర్​ కాలేజీ ప్రాంగణంలో వెజ్, నాన్​ వెజ్​ మార్కెట్​నిర్మించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. స్కూల్, కాలేజీ ప్రాంగణంలో మార్కెట్​ ఏర్పాటు చేయడంపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతిపక్ష పార్టీలతోపాటు, స్టూడెంట్స్​ యూనియన్ల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. కొందరు హైకోర్టుకు వెళ్లడంతో అక్కడ మార్కెట్​ నిర్మాణం చేపట్టొద్దంటూ స్టే వచ్చింది. ఈ క్రమంలో మరోచోట మార్కెట్ నిర్మాణానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. 

తూప్రాన్​ మండలం ఇస్లాంపూర్​ లో రైతులను, గ్రామస్తులను సంప్రదించకుండానే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్​ పేరుతో పేదలకు అసైన్డ్​ చేసిన 316 ఎకరాల భూములను స్వాధీనం చేసుకొనేందుకు నోటిఫికేషన్​ జారీ చేసింది. దీనిపై రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భూసేకరణ చట్టం ప్రకారం ప్రతిపాదిత భూముల కొనుగోలు, అమ్మకాలు చేపట్టడానికి వీలులేదని నోటిఫికేషన్​ లో పేర్కొనడంతో రైతులు మండిపడుతున్నారు. ల్యాండ్ పూలింగ్​ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రైతులు కలెక్టరేట్​కు తరలివచ్చి వినతి పత్రం ఇచ్చారు. 

కౌడిపల్లి మండలం దేవులపల్లిలో వైకుంఠ ధామానికి కేటాయించిన భూమి విషయంలో వివాదం నెలకొంది. ఓ ఎస్సీ మహిళ మృతి చెందగా ఖననం చేసే విషయంలో గొడవ జరిగింది. అంతేగాక తమకు జీవనాధారంగా ఉన్న భూమిని తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఓ మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం గమనార్హం. ఇలా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పదంగానే మారుతున్నాయని, ఇప్పటికైనా సరైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.