హైదరాబాద్​కు హ్యాట్రిక్‌‌ ఓటమి

హైదరాబాద్​కు హ్యాట్రిక్‌‌ ఓటమి
  • సన్‌ మళ్లీ డౌన్‌
  • 151 టార్గెట్‌ ఛేజ్‌ చేయలేకపోయిన రైజర్స్​ 
  • 13 రన్స్‌ తేడాతో ముంబై విక్టరీ 
  • బెయిర్‌స్టో పోరాటం వృథా

    బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌పై బౌలర్లు ముంబై ఇండియన్స్‌‌‌‌ను 150 రన్స్‌‌‌‌కే కట్టడి చేశారు..!  చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో ఓపెనర్‌‌‌‌ జానీ బెయిర్‌‌‌‌స్టో (22 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43) దంచికొట్టి మెరుపు ఆరంభం ఇచ్చాడు..!  జానీతో పాటు వార్నర్‌‌‌‌ (36) కూడా జోరు మీదుండగా.. పవర్‌‌‌‌ ప్లేలోనే 57 రన్స్‌‌‌‌ వచ్చాయి..!  సీజన్‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌ విక్టరీ కొట్టేందుకు సన్​ రైజర్స్​కు ఇంతకంటే మంచి తరుణం ఏముంటుంది..! కానీ, బెయిర్‌‌‌‌స్టో ఔటవగానే  హైదరాబాద్‌‌‌‌ పతనం మొదలైంది..! వార్నర్‌‌‌‌, పాండే, విరాట్‌‌‌‌ సింగ్‌‌‌‌, అభిషేక్‌‌‌‌.. పెవిలియన్‌‌‌‌కు క్యూ కట్టడంతో సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌  హ్యాట్రిక్‌‌‌‌ ఓటమి మూటగట్టుకుంది..!  మరోవైపు అత్యద్భుత బౌలింగ్‌‌‌‌, ఫీల్డింగ్‌‌‌‌తో  ముంబై వరుసగా రెండో మ్యాచ్‌‌‌‌లోనూ చిన్న టార్గెట్‌‌‌‌ను కాపాడుకుంది..!  మెరుపు బ్యాటింగ్‌‌‌‌తో టీమ్‌‌‌‌ను ఆదుకున్న కీరన్‌‌‌‌ పొలార్డ్‌‌‌‌ (22 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌, 3 సిక్సర్లతో 35 నాటౌట్‌‌‌‌), బౌలింగ్‌‌‌‌లో  స్పిన్నర్‌‌‌‌ రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌ (3/19),  పేసర్‌‌‌‌ ట్రెంట్‌‌‌‌ బౌల్ట్‌‌‌‌ (3/28)తో పాటు మెరుపు ఫీల్డింగ్‌‌‌‌తో రెండు కీలక రనౌట్లు చేసిన హార్దిక్‌‌‌‌  హీరోలుగా నిలిచారు..!

చెన్నై: ఐపీఎల్‌‌‌‌14వ సీజన్‌‌లో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ చెత్తాట కొనసాగుతోంది. ఇక్కడి చెపాక్​ స్టేడియంలో  శనివారం జరిగిన మ్యాచ్‌‌లో ముంబై ఇండియన్స్‌‌ 13 రన్స్‌‌ తేడాతో హైదరాబాద్‌‌ను ఓడించింది.  ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన ముంబై 20 ఓవర్లలో  5 వికెట్లకు 150 రన్స్‌‌ చేసింది.  క్వింటన్‌‌ డికాక్‌‌ (39 బాల్స్‌‌లో 5 ఫోర్లతో 40), రోహిత్‌‌ శర్మ (25 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) రాణించారు. చివర్లో కీరన్‌‌ పొలార్డ్‌‌  ధనాధన్‌‌ షాట్లతో అలరించాడు.  విజయ్‌‌ శంకర్‌‌ (2/19), ముజీబ్‌‌ (2/29) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌‌లో  రాహుల్‌‌ చహర్‌‌, ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ దెబ్బకు  రైజర్స్‌‌ 19.4 ఓవర్లలో 137 రన్స్‌‌కే ఆలౌటై పరాజయం పాలైంది. బెయిర్‌‌స్టో, వార్నర్‌‌కు తోడు విజయ్‌‌ శంకర్‌‌ (28) పోరాడినా ఫలితం లేకపోయింది. పొలార్డ్‌‌కు మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద  మ్యాచ్‌‌ అవార్డు దక్కింది.

డికాక్‌‌, రోహిత్‌‌, పొలార్డ్‌‌ పోరాటం..
టాస్‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌ ఎంచుకున్న ముంబై మంచి ఆరంభమే దక్కించుకున్నా.. దాన్ని సద్వినియోగం చేసుకోలేక నార్మల్​ స్కోరుకే పరిమితమైంది.   పవర్‌‌ప్లేలో మాత్రం ఓపెనర్లు  డికాక్‌‌, రోహిత్‌‌ మంచి షాట్లతో అలరించారు.  భువనేశ్వర్‌‌ వేసిన ఫస్ట్‌‌ ఓవర్లోనే  డికాక్‌‌ రెండు ఫోర్లు కొట్టగా..  ఖలీల్‌‌ బౌలింగ్‌‌లో బౌండ్రీతో రోహిత్‌‌ కూడా జోరు పెంచాడు. మూడో ఓవర్లో ముజీబ్‌‌ బౌలింగ్‌‌కు రాగా.. హిట్‌‌మ్యాన్‌‌ 4,6తో  వెల్‌‌కమ్‌‌ చెప్పాడు. ఆపై, భువీ ఓవర్లో డీప్‌‌ మిడ్‌‌ వికెట్‌‌ మీదుగా ఇంకో సిక్సర్‌‌తో టాప్‌‌ గేర్‌‌లోకి వచ్చేశాడు. హిట్‌‌మ్యాన్‌‌ జోరు మీద ఉండడంతో డికాక్‌‌ స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేసే బాధ్యత తీసుకోగా.. పవర్‌‌ప్లేలో ముంబై 53 రన్స్‌‌ రాబట్టింది.  అయితే, ఫీల్డ్‌‌ రిస్ట్రిక్షన్స్‌‌ మారిన తర్వాత ముంబై స్పీడుకు  బ్రేకులు పడ్డాయి. ఛేంజ్‌‌ బౌలర్‌‌గా వచ్చిన విజయ్‌‌ శంకర్‌‌.. వరుస ఓవర్లలో రోహిత్‌‌, సూర్యకుమార్‌‌ (10)ను ఔట్‌‌ చేసి ఆ టీమ్‌‌కు డబుల్‌‌ షాక్‌‌ ఇచ్చాడు. దాంతో, 9 ఓవర్లకు ముంబై 72/2తో నిలిచింది. తర్వాత స్పిన్నర్లు రషీద్‌‌, ముజీబ్‌‌తో పాటు శంకర్‌‌, ఖలీల్‌‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో డికాక్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌ (21 బాల్స్‌‌లో 12) చాలా ఇబ్బంది పడ్డారు. 10 నుంచి 16 ఓవర్ల మధ్య ఒక్క బౌండ్రీ మాత్రమే వచ్చిందంటే రైజర్స్‌‌ బౌలర్లు ఎంత గొప్పగా బౌలింగ్‌‌ చేశారో అర్థం చేసుకోవచ్చు.  ముజీబ్‌‌ బౌలింగ్‌‌లో డికాక్‌‌ ఔటవగా..  పొలార్డ్‌‌ కూడా స్టార్టింగ్‌‌లో నెమ్మదిగా బ్యాటింగ్‌‌ చేయడంతో 16 ఓవర్లకు ముంబై 107/3తో నిలిచింది. ముజీబ్‌‌ వేసిన తర్వాతి ఓవర్లో పొలార్డ్‌‌ 105 మీటర్ల భారీ సిక్స్‌‌తో ఇన్నింగ్స్‌‌కు మళ్లీ ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, అదే ఓవర్లో ఇషాన్‌‌.. కీపర్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వగా హార్దిక్‌‌ (7)  కూడా  నిరాశ పరిచాడు. అయితే,  చివరి మూడు ఓవర్లలో  పొలార్డ్‌‌  పోరాటంతో ముంబై 150 మార్కు దాటింది. భువీ వేసిన లాస్ట్‌‌ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో ఇన్నింగ్స్‌‌కు ఫినిషింగ్‌‌ ఇచ్చాడు.

బెయిర్‌‌స్టో మెరుపుల్‌‌.. మిడిల్‌‌ ఢమాల్‌‌
చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఓపెనర్‌‌ బెయిర్‌‌స్టో మెరుపు ఆరంభం ఇచ్చినా.. అతను ఔటైన తర్వాత సన్‌‌రైజర్స్‌‌ డీలా పడింది. మిడిల్‌‌ ఓవర్లలో స్పిన్నర్‌‌ రాహుల్‌‌ చహర్‌‌, స్లాగ్‌‌ ఓవర్లలో ట్రెంట్‌‌ బౌల్ట్‌‌, జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా (1/14) అద్భుత బౌలింగ్‌‌తో ముంబైని గెలిపించారు. స్టార్టింగ్‌‌లో మాత్రం బెయిర్‌‌స్టో అదరగొట్టాడు.  మూడో ఓవర్‌‌ నుంచి అతని మోత మొదలైంది. ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ బౌలింగ్‌‌లో ఖతర్నాక్‌‌ షాట్లతో వరుసగా 4, 4, 6, 4 బాదిన అతను తర్వాత మిల్నే ఓవర్లో 4, 6,6తో రెచ్చిపోయాడు. దీంతో, రోహిత్‌‌ ఐదో ఓవర్లోనే స్పిన్నర్‌‌ క్రునాల్‌‌ (1/30)ను బౌలింగ్‌‌కు దింపగా.. లాంగాన్‌‌ మీదుగా మరీ భారీ సిక్స్‌‌ కొట్టాడు. అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన వార్నర్‌‌ కూడా ఫోర్‌‌తో బౌండ్రీల ఖాతా తెరిచాడు.  ఈ ఇద్దరి జోరుకు పవర్‌‌ప్లేలో 57 రన్స్‌‌ వచ్చాయి. తర్వాత మిల్నే (0/33)బౌలింగ్‌‌లో వార్నర్‌‌ డీప్‌‌ మిడ్‌‌ వికెట్‌‌ మీదుగా భారీ సిక్స్‌‌ రాబట్టాడు. సిచ్యువేషన్‌‌ చూస్తే ఓపెనర్లే టార్గెట్‌‌ను కంప్లీట్‌‌ చేస్తారేమో అనిపించింది. అయితే, క్రునాల్‌‌ వేసిన ఎనిమిదో ఓవర్లో క్రీజులోపలికి వెళ్లి స్లాగ్‌‌ స్వీప్‌‌ ఆడే ప్రయత్నంలో బెయిర్‌‌స్టో హిట్‌‌ వికెట్‌‌గా వెనుదిరగడంతో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 67 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయింది. ఆ వెంటనే రాహుల్‌‌ చహర్‌‌ బౌలింగ్‌‌లో మనీశ్‌‌ పాండే (2) ఔటవడంతో  రైజర్స్‌‌పై ఒత్తిడి పెరిగింది. చహర్‌‌ బౌలింగ్‌‌లోనే  సిక్స్‌‌ కొట్టి ప్రెజర్‌‌ తగ్గించే ప్రయత్నం చేసిన వార్నర్‌‌.. 12వ ఓవర్లో హార్దిక్‌‌ కొట్టిన మెరుపు త్రోకు రనౌటవడంతో ముంబై రేసులోకి వచ్చింది.  కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేసిన రాహుల్‌‌ చహర్‌‌ 15వ ఓవర్లో విరాట్‌‌ సింగ్‌‌ (11), అభిషేక్‌‌ (2) వికెట్లు తీయడంతో 104/5తో  రైజర్స్‌‌ కష్టాల్లో పడింది. ఈ టైమ్​లో  క్రునాల్‌‌ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో 16 రన్స్‌‌ రాబట్టిన విజయ్‌‌ శంకర్‌‌ జట్టును మళ్లీ రేసులోకి తెచ్చాడు. కానీ, బౌల్ట్​వేసిన 18వ ఓవర్లో హార్దిక్​ మరో మెరుపు ఫీల్డింగ్​తో సమద్‌‌ (7)రనౌటవగా..  రషీద్‌‌ ఖాన్‌‌ (0) డకౌటయ్యాడు.  లాస్ట్‌‌ 12 బాల్స్‌‌లో  21 రన్స్‌‌ అవసరం కాగా..  శంకర్‌‌ క్రీజులో ఉండడంతో రైజర్స్‌‌ ఆశలు కోల్పోలేదు. కానీ, శంకర్‌‌ను బుమ్రా వెనక్కు పంపగా.. లాస్ట్‌‌ ఓవర్లో భువనేశ్వర్‌‌ (1), ఖలీల్‌‌ (1)ను బౌల్డ్‌‌ చేసిన బౌల్ట్‌‌.. హైదరాబాద్‌‌ను ఆలౌట్‌‌ చేశాడు. 

కెప్టెన్‌ రోహిత్‌ @4000
రోహిత్‌ శర్మ మరో మైలురాయి దాటాడు. టీ20ల్లో కెప్టెన్‌గా 4000 రన్స్‌ పూర్తి చేసుకున్నాడు. అలాగే, ఐపీఎల్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఇండియన్‌గా ధోనీ రికార్డు బ్రేక్‌ చేశాడు. రోహిత్‌ ఖాతాలో 217 సిక్సర్లు ఉన్నాయి. ధోనీ 216 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్‌గా క్రిస్‌ గేల్‌ 351 సిక్సర్లతో టాప్‌     ప్లేస్‌లో ఉన్నాడు. 


స్కోర్‌‌బోర్డ్‌‌
ముంబై: డికాక్‌‌‌‌ (సి) సబ్‌‌/సుచిత్‌‌ (బి) ముజీబ్‌‌ 40, రోహిత్ (సి) విరాట్‌‌ సింగ్‌‌ (బి) శంకర్‌‌ 32, సూర్య (సి అండ్‌‌ బి) శంకర్‌‌ 10, ఇషాన్‌‌ (సి) బెయిర్‌‌స్టో (బి) ముజీబ్‌‌ 12, పొలార్డ్‌‌ (నాటౌట్‌‌) 35, హార్దిక్‌‌ (సి) విరాట్‌‌ సింగ్‌‌ (బి) ఖలీల్‌‌ 7, క్రునాల్‌‌ (నాటౌట్‌‌) 3; ఎక్స్​ట్రాలు:  11; మొత్తం: 20 ఓవర్లలో 150/5;  వికెట్ల పతనం: 1–55, 2–71, 3–98, 4–114, 5–131;  బౌలింగ్‌‌: భువనేశ్వర్‌‌  4–0–45–0, ఖలీల్‌‌ 4–0–24–1, ముజీబ్‌‌ 4–0–29–2, అభిషేక్‌‌ 1–0–5–0, విజయ్‌‌ 3–0–19–2, రషీద్‌‌ 4–0–22–0.
హైదరాబాద్‌‌: వార్నర్‌‌ (రనౌట్‌‌/హార్దిక్‌‌) 38, బెయిర్‌‌స్టో -(హిట్‌‌ వికెట్‌‌/బి) క్రునాల్‌‌ 23, మనీశ్‌‌ (సి) పొలార్డ్‌‌ (బి) రాహుల్‌‌ 2, విరాట్‌‌ సింగ్‌‌ (సి) సూర్యకుమార్‌‌ (బి) రాహుల్‌‌ 11, శంకర్‌‌ (సి) సూర్యకుమార్‌‌ (బి) బుమ్రా28, అభిషేక్‌‌ (సి) మిల్నే (బి) రాహుల్‌‌ 2, సమద్‌‌  (రనౌట్‌‌/హార్దిక్‌‌) 7, రషీద్‌‌ (ఎల్బీ) బౌల్ట్‌‌ 0, భువనేశ్వర్‌‌ (బి) బౌల్ట్‌‌ 1, ముజీబ్‌‌ (నాటౌట్‌‌) 1, ఖలీల్‌‌ (బి) బౌల్ట్‌‌ 1;  ఎక్స్‌‌ట్రాలు: 5; మొత్తం: 19.4 ఓవర్లలో 137 ఆలౌట్‌‌; వికెట్ల పతనం: 1–67, 2–71, 3–90, 4–102, 5–104, 6–129, 7–130, 8–134, 9–135, 10–137;  బౌలింగ్‌‌: బౌల్ట్‌‌  3.4–0–28–3,  బుమ్రా 4–0–14–1, మిల్నే 3–0–33–0, క్రునాల్‌‌ 3–0–30–1, రాహుల్‌‌ 4–0–19–3, పొలార్డ్‌‌ 2–0–10–0.