హత్రాస్ ఘటన షాక్ కు గురి చేసింది: సుప్రీంకోర్టు

హత్రాస్ ఘటన షాక్ కు గురి చేసింది: సుప్రీంకోర్టు

మరీ ఇంత దారుణమా!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్​రేప్ ఇన్సిడెంట్​పై సుప్రీంకోర్టు సీరి యస్​ కామెంట్స్ చేసింది. ఇది దారుణమైన ఘటన అని, షాక్​కు గురి చేసిందని చెప్పింది. హత్రాస్ కేసు  అసాధారణమైనదని పేర్కొంది. హత్రాస్ ఘటనపై సీబీఐ లేదా సిట్​తో దర్యాప్తు చేయించాలని కోరుతూ సోషల్ యాక్టివిస్టు సత్యమా దుబే, మరికొందరు ఫైల్ చేసిన పిల్స్ పై సుప్రీం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో దర్యాప్తు సజావుగా జరిగేలా చూస్తామని సీజే జస్టిస్ ఎస్​ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, వి.రామసుబ్రమణియన్​లతో కూడిన బెంచ్ తెలిపింది. బాధితురాలి ఫ్యామిలీ, సాక్షుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఈ నెల 8లోగా అఫిడవిట్ ఫైల్ చేయాలని ఆదేశించింది. పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు.. ‘‘అలహాబాద్ హైకోర్టు ఈ కేసును విచారిస్తోంది. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అభ్యంతరం ఉంటే మమ్మల్ని సంప్రదించొచ్చు” అని తెలిపింది.

సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం.. 

కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రికమెండ్​ చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. సీబీఐ దర్యాప్తు చేస్తేనే వదంతులకు ఫుల్​స్టాప్ పడుతుందని చెప్పారు. సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయొచ్చని వివరించారు.

సిట్ కు అప్పగించాలి..

కేసును సీబీఐకి అప్పగించాలనే దానిపై బాధితురాలి ఫ్యామిలీ సంతృప్తికరంగా లేరని కొందరు పిటిషనర్ల తరఫున వాదించిన ఇందిరా జైసింగ్ అన్నారు. సుప్రీం పర్యవేక్షణలో సిట్ తోనే కేసును దర్యాప్తు చేయించాలని కోరారు. దీనిపై స్పందించిన సుప్రీం.. ‘‘ఈ కేసుతో మీకు సంబంధం లేదు. కానీ ఈ కేసుకున్న ఇంపార్టెన్స్ కారణంగా మీ వాదనలు వింటున్నాం. ఈ కేసులో మీ స్థానం ఏంటి అనే దానిపై మేం ఆలోచిస్తున్నాం” అని తెలిపింది. మరోవైపు, హత్రాస్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించడంపై సర్కార్ సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. గొడవలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్టు రావడంతోనే, హడావుడిగా అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని చెప్పింది.