వెలుగు ఓపెన్ పేజీ: కోరలు చాస్తున్న విద్వేషం

వెలుగు ఓపెన్ పేజీ: కోరలు చాస్తున్న విద్వేషం

ఉత్తరాఖండ్​లో  అంజెల్​  చక్మా  అనే  24 ఏండ్ల  త్రిపుర  విద్యార్థి  ఇటీవల మూకదాడికి బలయ్యాడు. ఎంబీఏ  ఫైనలియర్  స్టూడెంట్ అయిన అంజెల్ తన సోదరుడు  మైఖేల్​తో  కలిసి  డిసెంబర్​ 9న  డెహ్రూడూన్​లో  రోడ్డు పక్కన ఓ దుకాణం వద్ద  ఉన్నప్పుడు..  ఆరుగురు  దుండగులు ఆయనను  ‘చైనీయుడు, చింకీ,  మొమో’ అంటూ  గేలిచేశారు.  దీనిని అంజెల్  ప్రతిఘటించడంతో  అతడి మీద  కత్తితో  విచక్షణా రహితంగా  దాడి చేశారు. 17 రోజులపాటు  మృత్యువుతో  పోరాడిన ఆ యువకుడు డిసెంబర్​ 26న  చనిపోయాడు.  చక్మా తండ్రి తరుణ్​ ప్రసాద్..  శత్రువుల  నుంచి ఈ దేశ సరిహద్దులను కాచే  బీఎస్ఎఫ్  జవాన్.  ఆ సైనికుడి  కొడుకును   ఇప్పుడొక  జాత్యంహకార  గుంపు   పొట్టన పెట్టుకున్నది.   అంజెల్  మరణం  ఈశాన్య రాష్ట్రాల్లో  కొత్త చర్చకు  తెరలేపింది. ‘మావి చైనా మొహాలా? ’అంటూ వాళ్లు అడిగే  ప్రశ్నకు  జవాబు చెప్పేదెవరు?

డిసెంబర్​17న కేరళలోని  పాలక్కాడ్​ జిల్లా  వాలయార్​లో  కూడా ఇలాగే  చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌కు  చెందిన  దళిత  మైగ్రెంట్  కార్మికుడు 31 ఏండ్ల  రామ్‌‌‌‌‌‌‌‌నారాయణ్ బాఘేల్​పై  మూక దాడి  జరిగింది.  ‘నువ్వు బంగ్లాదేశీవా.. సరిహద్దులు దాటి వచ్చావా?’  అంటూ  దాడి  చేస్తున్న  అమానవీయ  దృశ్యాలు  బయటకొచ్చాయి.  బాఘేల్​ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మరణించాడు.  పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం నివేదిక ప్రకారం అతని శరీరంలో ఏ ఒక్క భాగం కూడా గాయపడకుండా లేదు.  కేవలం బాఘేల్​ మాట్లాడే భాష,  ఆయన  రూపాన్నిబట్టి  అతను  బంగ్లాదేశ్​వాసిగా  పొరబడి దాడి చేసినట్లు పోలీస్​ విచారణలో తేలింది.కలవరపెడుతున్న జాత్యహంకార  దాడులు 
బంగ్లాదేశ్​లో  హిందువులను  నరికి,  రోడ్లపై  తగలబెడుతున్న  దురాగతాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో భారత్​లో జరిగిన  ఈ  జాత్యహంకార  దాడులు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి.  మనదేశంలో  అసహనం ఎంతలా పెరిగిపోతోందో   చెప్పేందుకు ఈ రెండు ఘటనలు నిదర్శనంగా నిలిచాయి.  ఈ  రెండుచోట్లా  విదేశీయుల పేరిట మనల్ని మనమే చంపుకున్నాం!  ఒకవేళ  మనదేశంలోకి నిజంగానే  చైనా జాతీయుడో,  బంగ్లా దేశీయుడో వస్తే చంపేయవచ్చునా?  ఇదీ అసలు ప్రశ్న!   మరి  జాత్యహంకారం  వెర్రితలలు వేసే  అమెరికాలో  బతుకుతున్న 50 లక్షల మంది,  గల్ఫ్ దేశాల్లో  బతుకీడుస్తున్న  కోటి మంది  భారతీయుల  సంగతేంటి?  అక్కడా హత్యలు మొదలైతే మనం మౌనంగా ఉండగలమా?  ఆంగ్లేయుల  జాత్యంహకారానికి వ్యతిరేకంగా  శతాబ్దాలపాటు  పోరాడి  సాధించుకున్న ఈ  స్వతంత్ర  భారతంలో ఇలాంటి  జాత్యహంకార  హత్యలు  నిజంగా ఆశ్చర్యకరమే.  ఇది ఏరకమైన మార్పు?   ఎవరి అండతో  దేశవ్యాప్తంగా  ఇలాంటి  కుల,  మత,  జాత్యహంకార దాడులు జరుగుతున్నాయి?  దీని వెనుక ఉన్న ఆర్థిక,  సామాజిక, రాజకీయ  కారణాలపై  చర్చ జరగాల్సిన అవసరం ఉంది. 

తీవ్ర జాతీయవాదం వైపు..

దేశ ఆర్థికవృద్ధిలో  జాతీయవాదానిది  కీలక పాత్ర.   కానీ,  దీనిని  కుల, మతాలకతీతమైన  సమైక్య భావనపై  నిర్మించాలి.  అలాకాకుండా  కేవలం ఒకవర్గానికే  పరిమితం చేసి,  ప్రజల్లో ఐక్యతను  దెబ్బతీస్తే  అప్పుడు  అంత: కలహాలు  తప్ప అభివృద్ధి  సాధ్యం కాదు.  కానీ,  2014లో  బీజేపీ అధికారంలోకి  వచ్చాక  దేశంలో  హిందూ  జాతీయవాదం బలపడింది.  ఇది క్రమంగా  హిందూ  మెజారిటీవాదంగా మారి,  సామాజిక  విభజనకు  దారి తీస్తోంది. ప్రధానంగా  ఉన్నత వర్గాలను  మైనారిటీలు,  అణగారిన వర్గాలపైకి  ఉసిగొల్పుతోంది.   కేంద్ర ప్రభుత్వం తెచ్చిన  పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ),  యూనిఫాం సివిల్​ కోడ్​, స్పెషల్ ఇంటెన్సివ్  రివిజన్(ఎస్ఐఆర్​), కొన్ని రాష్ట్రాల్లో లవ్  జిహాద్​లాంటి  చట్టాలు  ఇందుకు  ఊతమిచ్చాయి.  ఈ  తీవ్ర  జాతీయవాదం  కారణంగా  ముస్లిం  మైనారిటీల్లో  రాడికలైజేషన్  పెరిగినట్లు,   దక్షిణ, ఈశాన్య  రాష్ట్రాలు,  సిక్కు సమాజాల్లో  ప్రాంతీయవాదం  బలపడినట్లు ఆధారాలున్నాయి.  

విద్వేషం నింపుతున్నరు.. 

‘మా  మతమే గొప్ప’,  ‘మా కులమే గొప్ప’,  ‘మా దేవుడు,  మా సంస్కృతి,  మా ఆచార వ్యవహారాలే  అత్యున్నతం’  అనుకునే  సంకుచిత  మనస్తత్వం  
రోజురోజుకూ  పెరుగుతున్నది. భారతీయుల్లో  ఇలాంటి   సంకుచిత  ధోరణులకు  ముమ్మాటికీ  కొన్ని రాజకీయ పార్టీలే  కారణమవుతున్నాయి.  తమ అస్తిత్వం,   ఓట్ల  రాజకీయం  కోసం  వివిధ వర్గాల  నడుమ  పొలిటికల్​ పార్టీలు  చిచ్చుపెడ్తున్నాయని  హ్యుమన్​ రైట్స్​ వాచ్,   సిటిజన్స్​ ఫర్​ జస్టిస్​  అండ్​  పీస్ 
(సీజేపీ)​, సెంటర్​ ఫర్​ స్టడీ ఆఫ్​ సొసైటీ అండ్​ సెక్యులరిజం (సీఎస్​ఎస్​ఎస్​) తదితర నివేదికలు  వెల్లడిస్తున్నాయి.    ద్వేషపూరిత  ప్రసంగాలు భారత రాజకీయాల్లో 2014  నుంచి 2025 మధ్య  ఎక్కువయ్యాయి.  2023లో  ఇలాంటి  668 హేట్ ​స్పీచెస్​ గుర్తించగా,  2024లో  1,165  హేట్​ స్పీచెస్​  రికార్డయ్యాయి. 

ఆఖరికి  తినే తిండిని  తక్కువ చేసి..

ఎదుటివారి కట్టు,  బొట్టు,  వేష, భాషలను,  ఆఖరికి  తినే తిండిని  తక్కువ చేసి  మాట్లాడడం,  గో మాంసం,  మేక మాంసం తినేవారంటూ గేలి  చేయడం,  మతాంతర  వివాహాలన్నింటినీ  లవ్​జీహాద్​ కింద  జమకట్టడం,  చైనా, బంగ్లా  తదితర   దేశాలపై  ద్వేషం  పెంచేలా  మాట్లాడడం,  అక్కడి  ప్రజలంతా  మన శత్రువులే  అన్నట్లు  రెచ్చగొట్టడం..  నేతలకు,  వారి   భజనపరులకు   అలవాటైపోయింది.   ఒకప్పుడు  ఎమ్మెల్యే,   ఎంపీ స్థాయి నేతల వరకే ఇలాంటి హేట్​ స్పీచ్​లు  పరిమితమయ్యేవి.   2 024  ఎన్నికల్లో  భాగంగా  రాజస్థాన్ లో  పీఎం మోదీ  మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్  అధికారంలోకి వస్తే  మీ  మంగళసూత్రాలు  లాక్కొని  ఎక్కువ  పిల్లలు కనేవాళ్లకు,  చొరబాటుదారులకు ఇస్తుంది’ అనడం ఇందుకు పరాకాష్ట!  ఇలాంటి  రెచ్చగొట్టే  ప్రసంగాల వల్ల  దేశంలో  అసహనం పెరిగిపోతోందని,  తద్వారా  కుల,  మత,  జాతిపరమైన ఉద్రిక్తతలు  తలెత్తుతున్నాయని  హ్యూమన్  రైట్స్ వాచ్  తదితర అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 

కమ్యూనిజం, సెక్యులరిజం ఇక్కడ నిషేధం.. 

ప్రస్తుతం మనదేశంలో  కమ్యూనిజం,  సెక్యులరిజం లాంటి పదాలు  నిషేధిత  జాబితాలో  ఉన్నాయి. ఇప్పుడు  బీజేపీ, ఆర్ఎస్ఎస్,  వీహెచ్​పీ  సహా  కొన్ని హిందూ అతివాద సంస్థల దృష్టిలో ‘సెక్యులరిజం’ అనేది టెర్రరిజానికి పర్యాయపదంలా మారిపోయింది.  గత  పదేండ్లుగా  మావోయిస్టు  సానుభూతిపరులతోపాటు  మానవహక్కుల నేతలు, సామాజికవేత్తలు, సెక్యులరిస్టులు,  హేతువాదులపైకి  మతఛాందసవాదులను ఉసిగొల్పుతోంది.  గౌరీ లంకేష్,  కల్బుర్గి లాంటి వారి  హత్యల  పరంపరను  మనం ఈ కోణంలోనే  చూడాలి.  మేధావుల  అణచివేతకు ఉపాలాంటి చట్టాలను  కేంద్రప్రభుత్వం  అడ్డంగా వాడుకుంటోంది. 

ఆర్​ఎస్​ఎస్​ ఆలోచన..ఆర్ఎస్ఎస్​ చీఫ్​ మోహన్​ భాగవత్​..  ఈ దేశం ముమ్మాటికీ  హిందూ రాజ్యంగా ఉంటుందని  ఇప్పటికే  పలుమార్లు  ప్రకటించారు.  కానీ, ​ దానికి  ఎలాంటి  రాజ్యాంగం  ఉంటుందో  ఆయన క్లారిటీ  ఇవ్వలేదు.  కానీ అది తప్పకుండా   చాతుర్వర్ణ  వ్యవస్థను  పునరుద్ధరించే  మనువాద రాజ్యాంగమే అవుతుంది.  ఎందుకంటే  ప్రస్తుతం దేశంలో అమలవుతున్న  సెక్యులర్​ రాజ్యాంగంపై  కేంద్రంలోని  బీజేపీ,  దాని అనుబంధ సంఘాలకు విశ్వాసం లేదు.  భారత్ కూడా పాకిస్థాన్,  బంగ్లాదేశ్​ మాదిరి  ఓ మతరాజ్యంగా  ఉండాలనేది  వీరి ఆలోచనగా  కనిపిస్తోంది. ​ఇటీవల ఈ తిరోగమన  నాయకులే  ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ నుంచి గాంధీ పేరును తొలగించారు. తద్వారా తమది  గాడ్సే  విధానమని  చెప్పకనే  చెప్పదలుచుకున్నారు. ఇలాంటివారు తమ ప్రజలకు శాంతి, సహనం, అహింస గురించి ఎలా బోధించగలరు?.

దళితులపై  ప్రతి 18 నిమిషాలకో దాడి.. 

2014 తర్వాత  దేశంలో  కుల, మత,  జాతి వివక్ష దాడులు, మరణాలు  అనూహ్యంగా  పెరిగాయని  ‘నేషనల్  క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  (ఎన్ సీఆర్​బీ)’,  ‘ హ్యూమన్  రైట్స్ వాచ్’, ‘అమ్నెస్టీ  ఇంటర్నేషనల్’  రిపోర్టులు  చెప్తున్నాయి.   ఎన్​సీఆర్​బీ  అధికారిక  లెక్కల ప్రకారం  చూసినా 2014 నుంచి  2022  మధ్య  దేశంలో  దళితుల (ఎస్సీల)పై  4.09  లక్షల  కేసులు  నమోదయ్యాయి.  ఇందులో  62 వేల కేసులు  మహిళలు,  బాలికలపై  దాడులు,   లైంగిక హింసకు  సంబంధించినవే ఉన్నాయి.  ఎస్సీ బాలికలు, మహిళలపై 2014లో  2,233  లైంగిక దాడులు  నమోదైతే, 2022లో  4,241కి పెరిగాయి.   ఈ దేశంలో సగటున  ప్రతి 18 నిమిషాలకు ఒక  దళితుడు/దళితురాలిపై  దాడి జరుగుతోంది. వారానికి 13 దళిత హత్యలు,  రోజుకు 27 అత్యాచారాలు.. ఇలా  ఏటా  సుమారు  50 వేలకుపైగా  కేసులు నమోదవుతున్నాయి. 2025  మొదటి ఆరు నెలల్లో అగ్ర కులాలవాళ్ల చేతిలో 113 మంది నిమ్న జాతీయులు  లైంగిక దాడులకు గురయ్యారు.  అటు  2014-2021  మధ్య  మతపరమైన  గొడవల్లో  190 మంది కన్నుమూశారు.  ఇందులో  గోవులను తరలిస్తున్నారని,  గో మాంసం తింటున్నారని హతమార్చినవే  సగానికిపైగా ఉన్నాయి.  ఎన్​సీఆర్​బీ  డాటా  ప్రకారం .. 2014-2017  మధ్య  మత హింస  28%  పెరిగింది.  జాత్యహంకార దాడుల్లో  మణిపూర్​ హింస  మన దేశానికి  మాయని  మచ్చలా  మిగిలింది.   మైతీ,  కుకీ తెగల  మధ్య  2023  నుంచి కొనసాగుతున్న మతహింస కారణంగా ఇప్పటికే 250 మందికి పైగా  చనిపోగా,  మరో  60వేల మంది బాధితులు కట్టుబట్టలతో  వలసవెళ్లిన  పరిస్థితి! 

 

- చిల్ల మల్లేశం, సీనియర్​ జర్నలిస్ట్​