హ్యాట్రిక్​ ఎమ్మెల్యేలు .. గ్రేటర్​ సిటీలో 8 మంది విజేతలు

హ్యాట్రిక్​ ఎమ్మెల్యేలు .. గ్రేటర్​ సిటీలో 8 మంది విజేతలు

హైదరాబాద్,వెలుగు : ఎమ్మెల్యేగా హ్యాట్రిక్  కొట్టాలంటే రాజకీయాల్లో అంత సులువు కాదు. గ్రేటర్​ హైదరాబాద్​లో ఈసారి హ్యాట్రిక్​ కొట్టిన ఎమ్మెల్యేల వివరాలు చూస్తే.. మంత్రి తలసాని శ్రీనివాస్ ​యాదవ్​  2014కు ముందు కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన 2014, 2018 ఎన్నికలతో పాటు తాజాగా మూడోసారి కూడా గెలుపొందారు.

2014లో సనత్​ నగర్​లో టీడీపీ నుంచి గెలుపొంది బీఆర్ఎస్​లో చేరారు. అనంతరం 2018లో బీఆర్ఎస్​అభ్యర్థిగా విజయం సాధించారు. తాజాగా మరోసారి 41,827 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సికింద్రాబాద్ ​నుంచి పద్మారావు కూడా వరుస విజయాలను అందుకోగా.. 2014 , 2018లో బీఆర్ఎస్​ నుంచి గెలిచారు. తాజాగా 45,625  ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  2014లో కుత్బుల్లాపూర్​లో టీడీపీ నుంచి గెలిచిన వివేకానందగౌడ్​ అనంతరం బీఆర్ఎస్​లోకి వెళ్లారు. 2018 ఎన్నికల్లోనూ, తాజాగా 85,400 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  

కూకట్​పల్లి నుంచి మాధవరం కృష్ణారావు 2014లో టీడీపీ నుంచి గెలిచి బీఆర్​ఎస్​లో చేరారు. అనంతరం 2018లోనూ, తాజా ఎన్నికల్లోనూ ఆయన 70,387 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శేరిలింగంపల్లి నుంచి అరికెపూడి గాంధీ కూడా 2014లో టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్​లో చేరి 2018లో మళ్లీ గెలిచారు. తాజాగా మూడోసారి 45,600 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

రాజేంద్రనగర్​నుంచి 2009, 2014లో టీడీపీ నుంచి గెలిచిన ప్రకాశ్​గౌడ్​ బీఆర్ఎస్ లో చేరి 2018 ఎన్నికల్లోనూ, తాజాగా 31,083 ఓట్ల ఆధిక్యత సాధించారు. జూబ్లీహిల్స్​ఎమ్మెల్యేగా 2014లో టీడీపీ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్​ ఆ తర్వాత బీఆర్ఎస్​లో చేరి 2018లో విజయం సాధించారు. తాజాగా  6,175 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ నుంచి 2014లోనూ, ఆ తర్వాత 2018 ఎన్నికల్లో గోషామహల్​నుంచి రాజాసింగ్​ విజయం సాధించగా.. తాజాగా మరోసారి 21,457 ఓట్ల మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్​ కొట్టారు.

కార్వాన్ ఎంఐంఎం కంచుకోట

మెహిదీపట్నం: కార్వాన్ సెగ్మెంట్ నుంచి ఎంఐఎం అభ్యర్థి కౌసర్ మొయినుద్దీన్  హ్యాట్రిక్ సాధించారు. కార్వాన్ ఎంఐఎం కంచుకోట అని మరోసారి నిరూపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అమర్ సింగ్​పై 41 వేల 986 ఓట్ల మెజార్టీతో  కౌసర్ గెలిచారు.

లష్కర్ చరిత్రలో హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే ఆయనే..

సికింద్రాబాద్: సికింద్రాబాద్ సెగ్మెంట్​లో బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ 45,625 ఓట్ల మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. లష్కర్ చరిత్రలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టిన మొదటి ఎమ్మెల్యేగా పద్మారావు గౌడ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయన విజయానికి కారణం మాస్​లీడర్​గా జనాల్లో ఉన్న అభిమానమని చెప్పొచ్చు. అన్ని వర్గాల్లో ఆదరణ, జనాలకు నిత్యం అందుబాటులో ఉండటం పద్మారావు గౌడ్ హ్యాట్రిక్ విజయానికి పునాది వేశాయి. దీంతో పాటు బలమైన ప్రత్యర్థి లేకపోవడం కూడా ఆయన గెలుపునకు మరో కారణమని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.