
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతలు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పి. నవీన్ రావుకు అప్పగిస్తూ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.హెచ్‌సీఏ ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషన్‌లో లేవనెత్తిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకు ఎలాంటి సెలెక్షన్ కమిటీలను ఎంపిక చేయరాదని హెచ్‌సీఏను ఆదేశించారు.
బాధ్యతలు స్వీకరించిన అంబుడ్స్‌మన్
హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ సురేష్ కుమార్ కైత్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎథిక్స్ ఆఫీసర్‌గా జస్టిస్ కేసీ భాను ప్రతి సోమవారం, గురువారం ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వరకు హెచ్‌సీఏ కార్యాలయంలో సభ్యులకు, విచారణలకు అందుబాటులో ఉంటారని హెచ్‌సీఏ తెలిపింది.