అజారుద్దీన్ హయాంలో.. హెచ్​సీఏలో నిధుల గోల్​మాల్

అజారుద్దీన్ హయాంలో.. హెచ్​సీఏలో నిధుల గోల్​మాల్
  • బాల్స్, కుర్చీలు, జిమ్, ఫైర్ సేఫ్టీ ఎక్విప్​మెంట్ కొనుగోళ్లలో ఫ్రాడ్
  • ఉప్పల్ పోలీస్ స్టేషన్​లో హెచ్​సీఏ సీఈవో కంప్లైంట్
  • అజారుద్దీన్, విజయానంద్‌, సురేందర్ అగర్వాల్​పై కేసు

హైదరాబాద్‌‌/సికింద్రాబాద్, వెలుగు : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్​సీఏ) మాజీ అధ్యక్షుడు మొహమ్మద్‌‌ అజారుద్దీన్​పై కేసు నమోదైంది. ఉప్పల్ స్టేడియంలో జిమ్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్​మెంట్లు, క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్ కొనుగోళ్లలో నిధుల గోల్​మాల్ జరిగిందని ఆరోపిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీఈవో సునీల్.. ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2020–23 మధ్య టెండర్ల కేటాయింపుల్లో కోట్లలో అవినీతి జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌‌లో తేలింది. ఈ క్రమంలో పర్చేజింగ్ ప్యానెల్​లో ఉన్న అజారుద్దీన్, విజయానంద్​, సురేందర్ అగర్వాల్ తదితరుల​పై ఉప్పల్ పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. మార్కెట్​లో 392 రూపాయలు విలువ చేసే రెడ్​బాల్ ను 1,400 రూపాయలకు, 420 రూపాయలు విలువ చేసే వైట్​టెస్ట్ బాల్​ను 1,510 రూపాయలు పెట్టి కొన్నట్లు నిర్ధారణ అయింది. బాల్స్ కొనుగోళ్లలో మొత్తం రూ.57.07లక్షల అవినీతి జరిగినట్లు స్పష్టమైంది. అదేవిధంగా, రూ.177కే వచ్చే బకెట్ చైర్స్​కు ఏకంగా రూ.2,568 పెట్టారు. ఇందులో మొత్తం రూ.43.11 లక్షల అవినీతి జరిగినట్లు తేలింది. అదేవిధంగా, జిమ్ ఎక్విప్​మెంట్ కొనుగోళ్లలో రూ.1.50 కోట్లు, ఫైర్ సేఫ్టీ ఎక్విప్​మెంట్ పర్చేజింగ్​లో రూ.1.34 కోట్ల అవినీతి జరిగినట్లు ఆడిట్​లో తేలింది.

నాలుగు వేర్వేరు ఫిర్యాదులు

హెచ్​సీఏకి అజారుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్న మూడేండ్ల కాలంలో నిధుల దుర్వినియోగంపై అనేక ఆరోపణలు వచ్చాయి. దాంతో అసోసియేషన్​ను గాడిలో పెట్టేందుకు సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వర రావు సింగిల్ మెంబర్ కమిటీ ఫోరెన్సిక్ ఆడిట్​ చేయించగా, నిధుల గోల్​మాల్ వ్యవహారం బయటపడింది. కమిటీ ఆదేశాల మేరకు హెచ్​సీఏ సీఈవో ఉప్పల్ పోలీస్ స్టేషన్​లో నాలుగు వేర్వేరు ఫిర్యాదులు చేశారు. అజారుద్దీన్, విజయానంద్, సురేందర్​తో పాటు మరికొందరిపై ఐపీసీ సెక్షన్ 406, 409, 420, 465, 467, 471, 20బీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు.

ఫైర్‌‌ సేఫ్టీ ఎక్విప్​మెంట్​లకు ఎక్కువ ధర

ఉప్పల్‌‌ స్టేడియంలో ఫైర్‌‌ సేఫ్టీ పరికరాల ఏర్పాటుకు అజారుద్దీన్ నిబంధనలు పాటించకుండా, జస్టిస్‌‌ ఎన్‌‌.ఏ కక్రూ నేతృత్వంలోని అప్పటి సూపర్‌‌ వైజరీ కమిటీ అనుమతి లేకుండా రూ.1.88 కోట్లకు ‘ఫైర్‌‌విన్‌‌ సేఫ్టీ ఇంజినీర్స్’ అనే కంపెనీకి టెండర్‌‌ కేటాయించారు. అడ్వాన్స్‌‌గా 70 శాతం అమౌంట్ చెల్లించారు. ఆ సంస్థ ఇప్పటికీ ఎక్విప్​మెంట్ ఇవ్వలేదని తేలింది. ఫోరెన్సిక్‌‌ ఆడిట్‌‌లో థర్డ్‌‌ పార్టీకి ఇవే పరికరాలను సమకూర్చేందుకు ‘ఫైర్‌‌విన్ సేఫ్టీ కంపెనీ’ రూ.54.31 లక్షలు మాత్రమే కోట్ చేసింది. ఈ లెక్కన హెచ్‌‌సీఏ ఖజానాకు రూ.1.34 కోట్ల మేర నష్టం వచ్చిందని కమిటీ తమ ఫిర్యాదులో పేర్కొన్నది.

2020లో మూసేసిన కంపెనీకి 2021లో టెండర్‌‌

జిమ్‌‌ పరికరాల కొనుగోళ్లలో రూ.1.50 కోట్ల గోల్​మాల్ జరిగినట్టు తేలింది. పరికరాల సప్లై, ఇన్‌‌స్టాలేషన్‌‌ కోసం బాడీ డ్రెంచ్‌‌ ఇండియా ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీకి అప్పటి ట్రెజరర్‌‌ సురేందర్‌‌ అగర్వాల్‌‌ 2021, ఆగస్టు 6న రూ.1.02 కోట్ల అడ్వాన్స్‌‌ పేమెంట్‌‌ చేశారు. మిగిలిన రూ.95.67 లక్షల చెక్‌‌పై అజారుద్దీన్ సుప్రీంకోర్టు సింగిల్‌‌ మెంబర్‌‌ కమిటీ అపాయింట్‌‌ అయిన రోజు (2023 ఫిబ్రవరి 2) సంతకం చేయగా, తర్వాత విజయానంద్‌‌ అప్రూవ్‌‌ చేశారు. సంవత్సరం అయ్యాక బాడీ డ్రెంచ్‌‌ కంపెనీ నాసిరకం జిమ్‌‌ సామగ్రి తెచ్చింది. ఈ పరికరాల కోసం బాడీ డ్రెంచ్‌‌ మొత్తం రూ.1.74 కోట్లకు టెండర్‌‌ వేసింది. కానీ, ఫోరెన్సిక్‌‌ ఆడిట్‌‌లో మరో కంపెనీ రూ.17.17 లక్షలకే సామన్లను సమకూరుస్తామని కొటేషన్‌‌ ఇచ్చింది. ఈ లెక్కన హెచ్‌‌సీఏకు మరో రూ.1.50 కోట్ల నష్టం వచ్చింది. కాగా, బాడీ డ్రెంచ్‌‌ కంపెనీ మన రాష్ట్రంలోనే లేదని, 2020లోనే అది మూతపడినట్టు ఫోరెన్సిక్‌‌ ఆడిట్‌‌లో తేలింది.

రూ.392 బాల్‌కు రూ.1,400

2020–21లో 2 వేల రెడ్ టెస్ట్‌‌ బాల్స్‌‌, 750 వైట్‌‌ టెస్ట్ బాల్స్‌‌, 2021–22లో మరో 2వేల రెడ్ టెస్ట్ బాల్స్​కు ‘సారా స్పోర్ట్స్’ అనే కంపెనీకి టెండర్‌‌ ఇచ్చింది. ఫస్ట్ టెండర్​లో ఒక్కో రెడ్‌‌ టెస్ట్ బాల్​కు రూ.1,400, వైట్ టెస్ట్ బాల్​కు రూ.1,510 చొప్పున రూ.39.32 లక్షలు చెల్లించింది. ఆర్డర్‌‌ చేసిన మొత్తం బంతులను సారా స్పోర్ట్స్‌‌ సప్లై చేయకున్నా.. రెండో సారి ఒక్కో రెడ్ టెస్ట్​ బాల్​కు రూ.1,540 చొప్పున రూ.30.80 లక్షలు ముందే కట్టేసింది. ఫోరెన్సిక్‌‌ ఆడిట్‌‌లో మరో పేరున్న సంస్థ రూ.392కే రెడ్‌‌ బాల్‌‌ను, రూ.420కే వైట్‌‌ బాల్ సప్లై చేస్తామని తెలిపింది. ఈ లెక్కన బాల్స్ కొనుగోళ్లలో హెచ్‌‌సీఏకు రూ.57.07 లక్షల మొత్తం నష్టం వచ్చినట్టు కమిటీ గుర్తించింది.

రూ.177 కుర్చీకి రూ.2,568

బకెట్ చైర్ల కొనుగోళ్లలో జరిగిన గోల్​మాల్​తో హెచ్‌‌సీఏ ఖజానాకు రూ.43.11 లక్షల మేర నష్టం వచ్చినట్టు తేలింది. 2021లో 1,100 కుర్చీలు, 2022లో మరో 400 కుర్చీల కోసం ఎక్స్‌‌లెంట్‌‌ ఎంటర్‌‌ప్రైజెస్‌‌ అనే కంపెనీకి వర్క్‌‌ ఆర్డర్‌‌ ఇచ్చారు. ఒక్కో కుర్చీకి రూ.2,568 చొప్పున రెండు విడతల్లో రూ.31.85 లక్షలు, రూ.12.20 లక్షల చొప్పున వంద శాతం అడ్వాన్స్ ను సెక్రటరీ విజయానంద్‌‌ చెల్లించారు. అయితే, ఈ ఏడాది సుప్రీం కోర్టు కమిటీ ఒక్కో సేమ్ చైర్ కు రూ.177 చొప్పున 700 కుర్చీలను కొనుగోలు చేసింది.