ఫుల్లుగా తాగి మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన.. HCA కోచ్‌పై సస్పెన్షన్‌ వేటు

ఫుల్లుగా తాగి మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన.. HCA కోచ్‌పై సస్పెన్షన్‌ వేటు

వివాదాలకు కేరాప్‌ అడ్రస్‌గా నిలిచే హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్(హెచ్‌సీఏ) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఏకంగా మహిళల జట్టు హెడ్‌ కోచ్‌ తెరమీదకు వచ్చారు. ఫుల్లుగా తాగి మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తించినందుకుగానూ మహిళా క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ జైసింహను సస్పెండ్ చేస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఆదేశాలిచ్చారు. విచారణ పూర్తయ్యే వరకు క్రికెట్ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అయనను ఆదేశించారు.  

ఏం జరిగిందంటే..?

గత నెలలో హైదరాబాద్ మహిళల జట్టు మ్యాచ్ ఆడేందుకు విజయవాడ వెళ్లింది. అనంతరం మ్యాచ్ ముగిశాక వారు తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా, బస్సులో హైదరాబాద్ చేరుకున్నారు. కోచ్ జైసింహా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని.. అందువల్లే ఫ్లైట్ మిస్ అయినట్టు మహిళా క్రికెటర్లు ఆరోపించారు. అంతేకాకుండా, బస్సులో హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో మహిళా క్రికెటర్ల ముందే జైసింహా మద్యం సేవించినట్లు వారు  గత నెల 12న హెచ్‌సిఏ అధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో బస్సులోనే ఉన్న సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమ రావు ఆయనకే వత్తాసు పలికినట్లు వివరించారు. తాగొద్దని వారించనందుకు తిట్టినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ALSO READ : IND vs ENG 3rd Test: ఇరగదీసిన ఇంగ్లాండ్.. హోరాహోరీగా రాజ్ కోట్ టెస్ట్

ఇన్నాళ్లు ఈ విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడిన హెచ్‌సీఏ.. కోచ్ మద్యం సేవిస్తున్న వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వగానే చర్యలు చేపట్టింది. తక్షణమే హెడ్‌ కోచ్‌ జైసింహను తప్పిస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఆదేశాలిచ్చారు. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు హెచ్చరించారు. విచారణ పూర్తై కోచ్‌ తప్పుచేసినట్లు రుజువైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 

"హెడ్‌ కోచ్‌‌కు సంబంధించిన వీడియోలు వివిధ వాట్సాప్ గ్రూపులలో ప్రసారం చేయబడ్డాయి. టీవీ న్యూస్ ఛానెళ్లలో  కూడా చూపించబడ్డాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపిస్తాం.. దర్యాప్తు ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం.." అని హెచ్‌సీఏ అధ్యక్షుడు ఫిబ్రవరి 16న రాసిన లేఖలో పేర్కొన్నారు.