
- తగ్గిన ప్రొవిజన్లు..మెరుగుపడిన అసెట్ క్వాలిటీ
న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ.18,641.3 కోట్ల నికర లాభాన్ని (స్టాండ్‌ఎలోన్) సాధించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.16,821 కోట్లతో పోలిస్తే 10.8శాతం ఎక్కువ. మార్కెట్ అంచనాలైన రూ.17,252 కోట్లను అధిగమించింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.31,551.5 కోట్లుగా ఉంది. ఇది రూ.31,298 కోట్ల అంచనాలను మించిపోయింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) 3.27శాతంగా రికార్డయ్యింది.
బ్యాంక్ గ్రాస్ ఎన్‌పీఏలు (జీఎన్‌పీఏలు) రూ.34,289.5 కోట్లకు తగ్గాయి. జీఎన్‌పీఏ రేషియో క్యూ2లో 1.24శాతంగా ఉంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్ (క్యూ1)లో ఇది 1.40శాతంగా ఉంది. నికర ఎన్‌పీఏలు రూ.11,447.3 కోట్లుగా ఉండగా, రేషియో 0.42శాతంగా నమోదైంది. క్యూ2లో బ్యాంక్ ప్రొవిజన్లు భాగా తగ్గి రూ.3,500.5 కోట్లుగా నమోదయ్యాయి. క్యూ1లో నమోదైన రూ.14,441.6 కోట్లతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి.
అయితే, గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,700.5 కోట్లతో పోలిస్తే ఎక్కువ. వడ్డీయేతర ఆదాయం ఏడాది లెక్కన 25 శాతం పెరిగి రూ.14,350 కోట్లకు చేరుకుంది. కానీ క్యూ1తో పోలిస్తే మాత్రం 34శాతం తగ్గింది. క్యూ1లో హెచ్‌డీబీ ఫైనాన్షియల్స్ వాటా విక్రయంతో రూ.9,128 కోట్ల వన్-టైమ్ లాభం నమోదైంది.