HDFC – వాల్‌మార్ట్‌: జాయింట్ క్రెడిట్‌కార్డ్‌

HDFC – వాల్‌మార్ట్‌: జాయింట్ క్రెడిట్‌కార్డ్‌

ఆవిష్కరించిన వాల్‌మార్ట్‌ కంట్రీహెడ్‌ క్రిష్‌ అయ్యర్‌

హైదరాబాద్‌‌, వెలుగు: హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంకు.. బీ2బీ క్యాష్‌‌ అండ్‌‌ క్యారీ స్టోర్‌‌ వాల్‌‌మార్ట్‌‌తో కలిసి కో–బ్రాండెడ్‌‌ క్రెడిట్‌‌కార్డ్‌‌ను విడుదల చేసింది. హైదరాబాద్‌‌ శివారులోని శివరాంపల్లి బెస్ట్‌‌ప్రైస్‌‌ స్టోర్‌‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో వాల్‌‌మార్ట్‌‌ ఇండియా ప్రెసిడెంట్‌‌, సీఈఓ క్రిష్ అయ్యర్‌‌, హెచ్‌‌డీఎఫ్‌‌సీ పేమెంట్స్‌‌ బిజినెస్ అండ్‌‌ మార్కెటింగ్ కంట్రీహెడ్‌‌ పరాగ్‌‌రావు దీనిని ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 26 బెస్ట్‌‌ప్రైస్‌‌ హోల్‌‌సేల్‌‌ స్టోర్లలోనూ సోమవారమే ఈ కార్డును విడుదల చేశారు. బెస్ట్‌‌ప్రైస్‌‌ స్టోర్‌‌ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఈ కార్డును రూపొందించారు.

బెస్ట్‌‌ప్రెస్‌‌ ఆన్‌‌లైన్‌‌, ఆఫ్‌‌లైన్‌‌ స్టోర్లలో దీనిని వాడుకోవచ్చు. ప్రతి కొనుగోలుపై కచ్చితంగా రికార్డులు, క్యాష్‌‌బ్యాక్‌‌లు ఇస్తారు. ఈ కార్డు రెండు వేరియంట్లలో లభిస్తుంది. బెస్ట్‌‌ప్రైస్‌‌ స్మార్ట్‌‌సేవ్‌‌ కార్డు  ఒకటోది కాగా, బెస్ట్‌‌ప్రైస్‌‌ సేవ్‌‌ మ్యాక్స్‌‌ కార్డు రెండోది. రెండు కార్డులతోనూ క్యాష్‌‌బ్యాక్‌‌లు, రివార్డులు, ఫ్యూయల్‌‌ సర్‌‌చార్జ్‌‌ రద్దు, కాంప్లిమెంటరీ బెస్ట్‌‌ప్రైజ్‌‌ వోచర్లు, రూ.50 లక్షల వరకు బీమా వంటి సదుపాయాలు పొందవచ్చు.    కస్టమర్‌‌ లావాదేవీల చరిత్ర, సిబిల్‌‌ స్కోరు, ఆర్థిక స్థితిగతులను బట్టి క్రెడిట్‌‌ లిమిట్​ను ఇస్తామని హెచ్‌‌డీఎఫ్‌‌సీ తెలిపింది.

కర్నూలులోనూ స్టోర్‌‌

ఈ సందర్భంగా క్రిష్‌‌ అయ్యర్‌‌ విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌‌లోని కర్నూలులో వచ్చేవారం కొత్త స్టోర్‌‌ను ప్రారంభిస్తామన్నారు. తదనంతరం తిరుపతిలోనూ స్టోర్‌‌ను నిర్మిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా తమకు 10 లక్షల మంది కస్టమర్లు ఉన్నారని, వీరందరికీ ఈ కో–బ్రాండెడ్‌‌ కార్డు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ‘‘కిరాణా, చిన్న వ్యాపార సంస్థల దగ్గర ఈ కార్డు ఉంటే వర్కింగ్‌‌ క్యాపిటల్‌‌ అవసరం లేదు. దీని ద్వారా 18–50 రోజుల వరకు క్రెడిట్‌‌ ఇస్తాం”అని వివరించారు.