పుజారా తన బలహీనతలను అధిగమించాలె

పుజారా తన బలహీనతలను అధిగమించాలె

భారీ అంచనాలతో ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత్‌కు ఓటమి పలకరించింది. న్యూజిలాండ్‌ను మట్టికరిపించి టెస్ట్ చాంపియన్‌షిప్ గదను గెలుస్తారని అభిమానులు పెట్టుకున్న ఆశలను భారత స్టార్లు ఆవిరిచేశారు. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో టీమిండియా ఓడిపోయింది. ఫ్యాన్సేగాక పలువురు సీనియర్ క్రికెటర్లు కూడా భారత ఆటగాళ్ల ప్రదర్శనపై పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ఎంతో అనుభవం కలిగిన విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు బ్యాటింగ్‌లో విఫలం కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ కూడా భారత బ్యాటింగ్‌పై కామెంట్లు చేశాడు. పుజారా తన స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడం టీమిండియా కొంప ముంచిందని స్టెయిన్ అన్నాడు.  

‘పుజారా మంచి కట్ షాట్స్, బ్యాక్‌ఫుట్ డ్రైవ్స్ ఆడగలడు. కానీ వేగంగా ఉండే పిచ్‌ల మీదే అతడు ఆ షాట్స్ కొడతాడు. కవర్స్ వైపు పుజారా కొట్టే షాట్లు సూపర్ అనే చెప్పాలి. కానీ ఇప్పుడా షాట్లను అతడు కొట్టట్లేదు. పుజారా లాంటి టాప్ బ్యాట్స్‌మన్ ఫస్ట్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ కావడం నిరాశపర్చింది. పుజారా తన బ్యాటింగ్‌ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే అతడ్ని ఔట్ చేసే విధానాలను బౌలర్లు అన్వేషించే పనిలో ఉంటారు. బ్యాక్ ఫుట్‌పై ఆడకుండా ఫ్రంట్ ఫుడ్ షాట్లు ఆడుతూ ఉంటే బౌలర్ల వలలో పడటం ఖాయం. మంచి బంతులను బౌండరీలకు తరలించడం నేర్చుకోవాలి. అదే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు, టెస్ట్ క్రికెట్‌కు ఉన్న తేడా అని అర్థం చేసుకోవాలి’ అని స్టెయిన్ సూచించాడు.