ద్రవిడ్ వల్లే టీమిండియా బలంగా మారింది

ద్రవిడ్ వల్లే టీమిండియా బలంగా మారింది

సిడ్నీ: టీమ్ ఇండియా అన్ని ఫార్మాట్ లలోనూ దూసుకెళ్తోంది. ఓడిపోయే మ్యాచ్ లను గెలుస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. కంగారూలను వారి సొంత గడ్డపై ఓడించడం, పటిష్ట ఇంగ్లండ్ ను మట్టికరిపించడాన్ని చూశాం. దీన్ని బట్టి ప్రస్తుత క్రికెట్ లో మన టీమ్ హవాను అర్థం చేసుకోవచ్చు. సీనియర్ ప్లేయర్లకు జతగా యువకులు అద్భుతంగా రానిస్తుండటంతోనే ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా డొమెస్టిక్ లెవల్ నుంచి యువ క్రీడాకారులు తమ ప్రతిభతో సీనియర్ జట్టు తలుపులు తడుతున్నరు. అవకాశం దొరికినప్పుడు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఈ క్రెడిట్ ను లెజెండ్ రాహుల్ ద్రవిడ్ కు ఇవ్వాల్సిందే. ఇండియా ఏ, అండర్ 19 జట్లకు హెడ్ కోచ్ గా ఉన్న ద్రవిడ్.. చాలా మంది యువ తారలను వెలుగులోకి తెచ్చాడు. అందుకే అతడిపై ఆస్ట్రేలియా దిగ్గజం గ్రెగ్ చాపెల్ ప్రశంసల వర్షం కురపించాడు. 

మెరికల్లాంటి యువకులను గుర్తించడం, వారిర్ టాలెంట్ ను సాన పెట్టడం ద్వారా ద్రవిడ్ టీమ్ ను మరింత బలోపేతం చేశాడని గ్రెగ్ మెచ్చుకున్నాడు. 'ద్రవిడ్ అచ్చం మాలాగే చేస్తున్నాడు. ప్రతిభ ఉన్న కుర్రాళ్లను గుర్తించి సాన పెడుతున్నాడు. ఆస్ట్రేలియా డొమెస్టిక్ సిస్టమ్ లో ఏమైతే చేస్తున్నామో దాన్నే ద్రవిడ్ ఇక్కడ అమలు చేస్తున్నాడు. ఇది శుభ పరిణామం. ఇలా చేయడంలో గత కొన్నేళ్లలో మేం విఫలమయ్యాం. కానీ భారత్, ఇంగ్లండ్ విజయవంతం అయ్యాయి. అందుకే ఆ రెండు టీమ్స్ మా కంటే బలంగా ఉన్నాయి' అని చాపెల్ పేర్కొన్నాడు.