- కడప జిల్లాలో వివాహితుడి దారుణం
- నాలుగేండ్లుగా ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు
- 80 శాతం గాయాలతో చావుబతుకుల మధ్య బాలిక
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని కడప జిల్లా బద్వేలులో శనివారం దారుణం జరిగింది. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్న ఓ వివాహితుడు.. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాధితురాలికి 80 శాతం కాలిన గాయాలయ్యాయి. ఆమెను కడప రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిందితుడు విఘ్నేశ్.. ప్రేమ పేరుతో బాలికను నాలుగేండ్లుగా వేధిస్తున్నాడు. అతనికి పెండ్లయినా వేధింపులు ఆపలేదు. శనివారం బాలిక ఎప్పట్లాగే కాలేజీకి వెళ్లింది. విఘ్నేశ్ ఆమెకు ఫోన్ చేసి కలుద్దామని చెప్పాడు. తనను కలవకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో బాలిక కాలేజీ నుంచి ఆటోలో అతను చెప్పి న చోటికి వెళ్లింది. బద్వేలు పాలిటెక్నిక్ కాలేజీ వద్ద విఘ్నేశ్ కూడా ఆటో ఎక్కారు. ఇద్దరూ బద్వేలు దాటి ఆటో దిగారు.
విఘ్నేశ్.. బాలికను ముళ్లపొదల్లోకి తీసుకెళ్లాడు. ఏమైందో ఏమో ఆమెపై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. బాలిక అరవడంతో సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న కూలీలు వచ్చి మంటలు ఆర్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు.
బాధితురాలి వాంగ్మూలాన్ని జిల్లా జడ్జి తీసుకున్నారు. 80 శాతం కాలిన గాయాలతో ఆమె చావుబతుకుల మధ్య పోరాడుతోంది. నిందితుడు విఘ్నేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బలవంతంగా పురుగులమందు తాగించాడు.. బాలిక మృతి
కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది చేసిన పనికి ఓ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరులో శనివారం ఈ ఘటన జరిగింది. నగరూరుకు చెందిన వీరేశ్ ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి వెంటపడుతున్నాడు. తనకు ఇష్టం లేదని చెబుతున్నా ఆ అమ్మాయిని వీరేశ్ వేధిస్తున్నాడు.
శనివారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకుని ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. తనను ప్రేమించాలంటూ బలవంతం చేశాడు. తర్వాత అత్యాచారయత్నం చేయగా..బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో బలవంతంగా ఆమె నోట్లో పురుగుల మందు పోసి వీరేశ్ పరారయ్యాడు. కుటుంబ సభ్యులు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది.