పోడు పట్టాలిప్పిస్తానని ..రూ.9.80 లక్షలు తీసుకున్నడు

పోడు పట్టాలిప్పిస్తానని ..రూ.9.80 లక్షలు తీసుకున్నడు
  • భారతీయ సర్వ సమాజ్​ సంఘ్​నేత సామ్యూల్ పై గొత్తికోయల ఫిర్యాదు
  • అక్రమ కేసు పెట్టారంటూ సంఘ్​ సభ్యుల ధర్నాP

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : పోడు పట్టాలు ఇప్పిస్తానని భారతీయ సర్వ సమాజ్​ సంఘ్​ సౌత్​ ఇండియా చైర్మన్​ మద్దిశెట్టి సామ్యూల్​ తమ నుంచి రూ.9.80 లక్షలు వసూలు చేశారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం మామిళ్లగూడేనికి చెందిన గుత్తికోయలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండేండ్ల కింద పోడు భూములకు పట్టాలిప్పిస్తానని ఆయన తమ నుంచి రూ.9.80 లక్షలు తీసుకుని ఇప్పటి వరకూ పట్టాలు ఇప్పించలేదని బాధితులు ఈనెల 17న  ముల్కలపల్లి పోలీస్  స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పట్టాల విషయమై పలుమార్లు అడిగితే తమను ఆయన బెదిరిస్తున్నారని ఆరోపించారు.

దీంతో పోలీసులు సామ్యూల్​పై కేసు నమోదు చేశారు. అయితే, సామ్యూల్ పై కావాలనే అక్రమ కేసు పెట్టారని భారతీయ సర్వ సమాజ్  సంఘ్  సభ్యులు ఎస్పీ ఆఫీసు ఎదుట మంగళవారం ధర్నా చేశారు. మహిళలు భారీ సంఖ్యలో బైఠాయించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం పాల్వంచ డీఎస్పీగా ఉన్న వెంకటేశ్వర్లు.. అధికార బీఆర్ఎస్​ పార్టీ నేతల ఒత్తిడితోనే సామ్యూల్​పై తప్పుడు కేసు పెట్టారని సంఘ్​ సభ్యులు ఆరోపించారు. గతంలో సత్తుపల్లి డీఎస్పీగా పనిచేసినప్పుడు కూడా సామ్యూల్​పై ఆయన కేసులు పెట్టించారన్నారు. ఆయనపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, పాల్వంచ డీఎస్పీ, ముల్కలపల్లి ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు. ఈ మేరకు ఎస్పీకి వినతిపత్రాన్ని ఇచ్చారు. ​