
కడప జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై హైదరాబాద్ నుండి తిరుమల వెళుతున్న ఓ కారు అతివేగంతో వారిపైకి దూసుకెళ్లింది. జిల్లాలోని రాజంపేట మండలం బోయనపల్లె దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ మనోహర్ అక్కడికక్కడే మృతి చెందగా, కానిస్టేబుల్ రమేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కడప జిల్లా చెన్నూరుకు చెందిన వ్యక్తి అని ఎస్సై మహేష్ నాయుడు తెలిపారు. నిద్ర మత్తులో కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢీకొట్టిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.