వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు

వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు

ఎండాకాలం వచ్చిందంటే.. వేడి తాపానికి ఉపశమనం కలుగజేసే తాటి ముంజలు నగరంలో అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ముంజల అమ్మకాలు జోరందుకున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు ముంజలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముంజలు తింటే ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగలున్నాయని, ఎండల తాపం నుంచి ఉపశమనం కలుగుతుందని ముంజలు అమ్మేవారు, కొనేవారు చెబుతున్నారు. కేవలం వేసవిలో మాత్రమే ఇవి విరివిగా లభిస్తాయి. గ్రామాల్లో తాటిచెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ముంజలు విరివిగా దొరుకుతుంటాయి. సిటిల్లో మాత్రం భారీ రేటు పెట్టి కొనుగోలు చేయాల్సిందే.

తాటి ముంజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తాటి ముంజలు శరీరంలో వేడిని తగ్గించి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అంతే కాకుండా తాటి ముంజలు తినడం వల్ల మలబద్ధకం సమస్యలు తొలగిపోయి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తాటి గింజలు క్యాన్సర్ కణాలను కూడా నివారిస్తాయి. ముంజల్లో ఐరన్‌, క్యాల్షియం వీటిల్లో పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌-ఎ, బి, సిలతో పాటు జింక్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌లు కూడా అధికంగా ఉంటాయి. వేసవిలో రోజూ తాటి ముంజలు తింటే వడదెబ్బ తగలనీయకుండా బయటపడవచ్చు. గర్భిణీ మహిళలకు జీర్ణక్రియను ముంజలు మెరుగుపరుస్తాయి. ఎసిడిటీ సమస్యలను దూరం చేస్తాయి.