ఒంట్లో నలత అనిపించినా.. హెల్త్​ చెకప్

ఒంట్లో నలత అనిపించినా.. హెల్త్​ చెకప్
  • ఒమిక్రాన్​ దృష్ట్యా ఆరోగ్యంపై సిటీ జనాలు అలర్ట్​
  • కొద్ది రోజులుగా ఆస్పత్రుల్లో పెరిగిన ఓపీ కేసులు
  • ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా డాక్టర్ల దగ్గరికి..
  • మెడికేషన్ ఫాలో అయితున్న పేషెంట్లు 

హైదరాబాద్, వెలుగు: కరోనాపై జనాల్లో అవేర్​నెస్​తో పాటు సెల్ఫ్ కేర్ పెరిగిపోయింది.  ఆరోగ్యంపై అలెర్ట్​గా ఉంటూ  జలుబు, దగ్గు, నీరసం, లైట్ ఫీవర్ అనిపించినా వెంటనే మెడిసిన్​వేసుకోవడం,  లేదంటే హాస్పటల్​కు వెళ్తున్నారు. వింటర్ ​సీజన్ ​కావడంతో ఇన్ఫెక్షన్స్, ఫ్లూ, వైరస్ సింప్టమ్స్ ఒకేలా ఉంటుండగా టెన్షన్​కు గురై ముందు జాగ్రత్తగా చెకప్ లు కూడా చేయించుకుంటున్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ నేపథ్యంలో రెండు, మూడు వారాల నుంచి  ఫీవర్, ఫ్లూ కేసులు పెరిగాయని డాక్టర్లు చెబుతున్నారు. 

మైల్డ్ సింప్టమ్స్ కనిపించినా..

కొవిడ్​ షురువైన టైమ్​లో హాస్పిటల్స్ కి వెళ్లలేక, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక జనాలు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆన్​లైన్​ కన్సల్టేషన్, వీడియో కాల్స్ లో ట్రీట్​మెంట్​ ఫెసిలిటీలు అందుబాటులోకి వచ్చాయి. హాస్పిటల్ కు వెళ్లాలంటేనే భయంతో వణికిపోయారు. కరోనా రెండు వేవ్ లోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. చాలామంది సొంతంగా మెడికేషన్, డైట్​లు పాటించడం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ , ఒమిక్రాన్ వేరియంట్ వస్తుందనే కారణాలతో మైల్డ్ సింప్టమ్స్ కనిపించినా వెంటనే హాస్పిటల్స్ కు వెళ్లి చెకప్​ చేయించుకుంటున్నారు. గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్స్​లో ఓపీలకు పేషెంట్లు క్యూ కడుతున్నారు. రోజుకి 200 ఓపీలు వస్తే అందులో 50 శాతం ఫీవర్ పేషెంట్లే ఉంటున్నారని డాక్టర్లు పేర్కొంటున్నారు. 

సీజనల్ ప్రాబ్లమ్స్​తో బాధపడేవారే ఎక్కువ

జనాల్లో వైరస్ కు  సంబంధించి అవగాహన పెరిగిందని, ఎలాంటి హెల్త్​ ప్రాబ్లమ్స్​కనిపించినా వెంటనే సంప్రదిస్తున్నారని డాక్టర్లు అంటున్నారు. ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నిలోఫర్ ఆసుపత్రుల్లో రోజుకి వెయ్యి నుంచి రెండువేల మధ్య ఓపీ కేసులు వస్తుంటే, అధికశాతం జ్వరాలు, సీజనల్ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటి వాటితో వెళ్తున్నావారే ఉంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా రోజుకి 100 కుపైగా ఓపీకి వస్తే అందులో సగానికిపైగా జ్వరం వంటి సింప్టమ్స్ తోనే బాధపడే వారు ఉంటున్నారు.  

ఓపీలు పెరిగాయి

మునుపటితో పోలిస్తే జనాల్లో కొవిడ్​పై అవేర్​నెస్​పెరిగింది. ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా  ఓపీ కేసులు పెరుగుతుండగా రెండు, మూడు వారాలుగా గమనిస్తున్నాం. ఫీవర్ తో వస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు.  వెంటనే కరోనా టెస్ట్ లు కూడా చేయించుకుంటున్నారు.  సెకండ్ వేవ్ లో పడిన ఇబ్బందులతో ఇప్పుడు హెల్త్​పై అలర్ట్​గా ఉంటూ వెంటనే  కన్సల్ట్​అవుతుండగా పరిస్థితి, అంతకు ముందు కాంప్లికేషన్స్ పరిశీలించి మెడికేషన్ చేస్తున్నాం. 

– డాక్టర్​ నవోదయ, జనరల్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్​

“రెండు రోజుల కిందట సడెన్​గా కోల్డ్ ​అటాక్​అయింది. కొంచెం నీరసంగా కూడా అనిపించడంతో టెన్షన్ ​పడ్డా. లేట్​ చేయకుండా డాక్టర్​ వద్దకు వెళ్లి చెక్ ​చేయించుకున్నా. లైట్​ ఫీవర్​ అని చెప్పి డాక్టర్ మెడిసిన్​ రాసిస్తే వాడుతున్నా’’అని అమీర్​పేటలో ఉండే​ ప్రైవేటు ఎంప్లాయ్ హరీశ్ చెప్పిండు. 

“నాలుగు రోజులుగా లైట్ ఫీవర్, జలుబు ఉండగా టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గడం లేదు. బస్తీ దవాఖానకు వెళ్లి డాక్టర్​ని కలిసి హెల్త్​ ప్రాబ్లమ్ అని​చెప్పా. టాబ్లెట్స్ రాసివ్వగా ప్రస్తుతం వాటిని వాడుతున్నా. వింటర్ సీజన్​లో  జలుబు, జ్వరం కామన్ అనుకోకుండా డాక్టర్ వద్దకు వెళ్లి చెక్​చేయించుకున్నా’’ అని షేక్ పేట్ రాజీవ్​గాంధీ నగర్​కు చెందిన ప్రైవేటు ఎంప్లాయ్​ రాజు తెలిపిండు.