ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చేది నా జనం.. దొర జనం కాదు: మంత్రి దామోదర

ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చేది నా జనం.. దొర జనం కాదు: మంత్రి దామోదర

హైదరాబాద్, పద్మారావునగర్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చేది దొరలు కాదని, పేద ప్రజలే వస్తారని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తాను కూడా పాత గాంధీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పుట్టానని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే పేషెంట్ల బాగోగులు చూసుకోవడం తమ బాధ్యత అని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 

మంగళవారం గాంధీ, కింగ్ కోఠి హాస్పిటళ్లలో మంత్రి ఆకస్మిక పర్యటన చేశారు. గాంధీలో అన్ని వార్డులు కలియతిరిగి, పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైద్యసేవలు, భోజన నాణ్యత, డాక్టర్లు, స్టాఫ్ ప్రవర్తన తదితర అంశాలపై మంత్రి ఆరా తీశారు. అటెండర్లు కూర్చోవడానికి కారిడార్లలో కుర్చీలు ఏర్పాటు చేయాలని, వారిని బెడ్లపై, కింద కూర్చొపెట్టొద్దని హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌కు సూచించారు. 

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత మూడేండ్లతో పోలిస్తే ఈ ఏడాది డెంగీ కేసులు, వైరల్ ఫీవర్లు తక్కువగా ఉన్నాయని, ఇందుకు సంబంధించిన లెక్కలు కూడా ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. ప్రతిపక్ష నేతలు అబద్ధాలు ప్రచారం చేసి, ప్రజల్ని భయాందోళనకు గురిచేయొద్దని సూచించారు. గాంధీలో ఉన్న ఐవీఎఫ్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఎంబ్రియాలజిస్ట్‌‌‌‌‌‌‌‌ను నియమించి, వారం రోజుల్లో ఐవీఎఫ్ సేవలు ప్రారంభిస్తామన్నారు. గాంధీతోపాటు, ఇతర దవాఖాన్లలోనూ ఫర్టిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. 

డెంగీ కేసులు గతేడాది కంటే తక్కువే

జ్వరాలపై ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారం చేసి, జనాలను ఆందోళనకు గురి చేస్తున్నారని మంత్రి దామోదర విమర్శిం చారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో ఏటా 8 వేలకుపైనే డెంగీ కేసులు నమోదయ్యా యని, ఓ ఏడాది ఏకంగా 13 వేలకు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 6 వేల కుపైగా కేసులే నమోదయ్యాయని చెప్పారు. తనిఖీల అనంతరం కోఠిలోని మెడికల్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్ అండ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లో (టీజీఎంఎస్‌‌‌‌‌‌‌‌ఐడీసీ) ఆఫీసులతో మెడిసిన్, ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్ కొనుగోళ్లు,  ఇతర పనులపై మంత్రి రివ్యూ చేశారు.