రూల్స్​కు విరుద్ధంగా నడుపుతున్న హాస్పిటల్స్ సీజ్

రూల్స్​కు విరుద్ధంగా నడుపుతున్న హాస్పిటల్స్ సీజ్

 

  •     ఒకేషనల్​ కోర్సు చేసినవారే నర్సులు           
  •     పంటి నొప్పి అని వస్తే  మూడ్రోజుల నుంచి సెలైన్​ ఎక్కిస్తున్రు
  •     మూడు రోజుల్లో 21 హాస్పిటళ్లు సీజ్
  •     83 దవాఖాన్లకు నోటీసులు
  •   ప్రైవేట్​ దవాఖాన్ల తనిఖీల్లో బయటపడుతున్న లోపాలు


రాష్ట్రంలోని ప్రైవేటు హాస్పిటళ్లపై మూడ్రోజులుగా హెల్త్ ఆఫీసర్లు దాడులు చేస్తున్నారు. హాస్పిటల్ రిజిస్ట్రేషన్, స్టాఫ్ రిజిస్ట్రేషన్, డాక్టర్ల రిజిస్ట్రేషన్‌, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం దవాఖానలో ఉన్న సౌలతులను పరిశీలిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా, నకిలీ డాక్టర్లతో, రూల్స్​కు విరుద్ధంగా నడుపుతున్న దవాఖాన్లను సీజ్ చేస్తున్నారు. మూడు రోజుల్లో 18 జిల్లాల్లోని 311 హాస్పిటళ్లను ఆఫీసర్లు తనిఖీ చేశారు. ఇందులో 83 హాస్పిటళ్లకు నోటీసులు జారీ చేశారు. ఏడు హాస్పిటళ్లకు ఫైన్లు వేశారు. రంగారెడ్డి జిల్లాలో 7, వికారాబాద్ జిల్లాలో 5, ములుగులో 3, సంగారెడ్డిలో 3, కొత్తగూడెంలో 2, జగిత్యాల్‌లో ఒక హాస్పిటల్‌ను సీజ్ చేశారు. వారం రోజుల్లో అన్ని హాస్పిటళ్లు, డయాగ్నస్టిక్ సెంటర్లను తనిఖీ చేయాలని నిర్ణయించారు.   
 
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా భువనగిరిలోని ఓ హాస్పిటల్​కు పన్ను నొప్పితో వచ్చిన పేషెంట్​ను అడ్మిట్​చేసుకుని మూడు రోజులనుంచి సెలైన్​ఎక్కిస్తున్నారు.  రూ. 9 వేల బిల్లు వేశారు. జ్ఞానదంతం వల్ల నొప్పి రావడంతో  హాస్పిటల్​కు వచ్చిన పేషెంట్​ను భయపెట్టి ట్రీట్​మెంట్​ప్రారంభించారు. ట్రీట్​మెంట్​ఇస్తున్నది కూడా డెంటల్​స్పెషలిస్ట్​ కాదు. 

భువనగిరిలోని ఒక  హాస్పిటల్​లో 20 మంది ఇన్​పేషెంట్లున్నారు. ఇక్కడ పనిచేస్తున్నట్టు పేర్కొన్న డాక్టర్లలో ఒక్కరూ కూడా లేరు. వీరికి ట్రీట్​మెంట్​ఇస్తున్నది ఒక ఆర్ఎంపీ. 
శనివారం యాదాద్రి జిల్లాలోని ప్రైవేట్​హాస్పిటళ్లలో వైద్యాధికారులు చేపట్టిన  తనిఖీల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  యాదాద్రి జిల్లాలో  110 హాస్పిటల్స్, 53 డయాగ్నోస్టిక్​సెంటర్లు ఉన్నాయి. జిల్లాలో ఆరు టీమ్​లను ఏర్పాటు చేయగా.. శనివారం 40 హాస్పిటల్స్​ను తనిఖీ చేశారు. వీటిలో దాదాపు 20 హాస్పిటల్స్ రూల్స్​కు విరుద్ధంగా నడుస్తున్నాయని తేలింది. స్పెషలిస్టులు, డాక్టర్లు  లేకుండా నడుస్తున్న రెండు దవాఖానలకు అధికారులు నోటీసులు ఇచ్చారు.  

మూడు ఆస్పత్రులు, ల్యాబ్​ సీజ్​

నాగర్ కర్నూల్ టౌన్: నాగర్​కర్నూలు జిల్లాలోని   ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో అడిషనల్ డీఎంహెచ్​ఓ వెంకటదాసు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి, డాక్టర్ రవికుమార్, డాక్టర్ నారాయణస్వామి, మున్సిపల్ కమిషనర్ యాదయ్య, ఎస్సై వీణ తనిఖీలు చేశారు.   నిర్వహణ సరిగా లేని  మూడు ప్రైవేట్ హాస్పిటల్, ఒక డయాగ్నోస్టిక్స్ సెంటర్ ను సీజ్​ చేశారు. న్యూ లైఫ్ హాస్పిటల్, సుస్మిత క్లినిక్, మమతా క్లినిక్, సాయికృష్ణ డయాగ్నోస్టిక్ సెంటర్లకు అనుమతి పత్రాలు లేవని, సరైన అర్హత లేనివారు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. న్యూ లైఫ్ ఆసుపత్రిలో మూడు ఫ్లోరల్లో ఇన్​పేషెంట్లు, 200 మంది అవుట్​ పేషెంట్లకు కనీసం ఎంబీబీఎస్​ కూడా చేయని మెడికల్​ప్రాక్టిషనర్​ ఒక్కడే సేవలు అందిస్తున్నాడు. తనిఖీల వివరాలను జిల్లా కలెక్టర్ కు అందిస్తామని  వైద్య బృందం తెలిపారు.

ప్రైవేట్‌ హాస్పిటల్​లో ప్రభుత్వ డాక్టర్

సూర్యాపేట/హుజూర్​నగర్: సూర్యాపేట జిల్లాలో వైద్యాధికారులు ఆకస్మికంగా చేసిన తనిఖీల్లో ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం చేస్తూ ప్రభుత్వ డాక్టర్ డీ‌ఎం‌హెచ్‌ఓకు అడ్డంగా దొరికిపోయాడు. విజయ్ కుమార్ నల్గొండ జిల్లా కేతేపల్లి పీ‌హెచ్‌సీలో డాక్టర్​. సూర్యాపేటలోని గణపతి హాస్పిటల్​లో  ప్రైవేట్ గా పని చేస్తున్నాడు. రూల్స్​కు విరుద్దంగా ప్రైవేట్​ఆస్పత్రిలో పనిచేస్తుండడంతో హాస్పిటల్ ను డీ‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్ కోటాచలం సీజ్ చేశారు.  ఈ‌ఎన్‌టీ ఆస్పత్రికి లైసెన్స్ తీసుకున్న మరో హాస్పిటల్​లో  స్పెషలిస్ట్​ అందుబాటులో ఉండకుండా కాంపౌండర్ ట్రీట్మెంట్ చేయడంపై డీ‌ఎం‌హెచ్‌ఓ సీరియస్ అయ్యారు.  సాయికీర్తన హాస్పిటల్ లో అనుమతి పొందిన డాక్టర్ కాకుండా అతని భార్య ఓపీ చూడడంతో  నోటీసులు అందించారు.  హుజూర్ నగర్ లో క్వాలిఫైడ్ డాక్టర్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్న ఆక్సిజన్ ఆసుపత్రిని సీజ్ చేశారు. అనుమతి తీసుకున్నప్పుడు పేర్కొన్న డాక్టర్లు కొంతకాలానికి మానేయడంతో  పేషెంట్స్ కు నర్సింగ్ స్టాఫ్ తో వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు.  

పలు జిల్లాల్లో తనిఖీలు

సిద్దిపేట రూరల్/భద్రాద్రికొత్తగూడెం/వరంగల్​ సిటీ: సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, చేర్యాల, దుబ్బాక పరిధిలోని 25 హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఆరు హాస్పిటల్స్ కు పెనాల్టీ విధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనుమతులు లేని మూడు డయాగ్నోస్టిక్ సెంటర్లు, రెండు ప్రైవేటు హాస్పిటల్స్ ను అధికారులు సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా కాకాజీ కాలనీలో 15 హాస్పిటల్స్​ను శనివారం తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు, ధరల పట్టిక, డాక్టర్ల వివరాలు ప్రదర్శించని హోప్ హాస్పిటల్, సుజాత హాస్పిటల్ కు నోటీసులు జారీ చేశారు. న్యూ లైఫ్ డెంటల్ హాస్పిటల్, సాయి చరణ్ డెంటల్ క్లినిక్, తెలంగాణ ఐ క్లినిక్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, అనుమతి లభించే వరకు సేవలు నిలిపివేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివ రావు ఆదేశించారు.