హెల్త్ సెక్టార్​ను జాతీయం చేయాలె

హెల్త్ సెక్టార్​ను జాతీయం చేయాలె


మనదేశంలో వైద్య, ఆరోగ్య రంగం ఉమ్మడి జాబితాలో కాకుండా రాష్ట్రాల పరిధిలో ఉన్నది. అయితే వైద్య రంగం చిన్నచిన్న విభాగాలుగా ఉండటం అతి పెద్ద లోపంగా చెప్పవచ్చు. ఆదాయ వనరులు, వైద్య బీమా నిధులు వ్యూహాత్మకంగా ఖర్చు చేయడంలో మన ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, బీమా వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు వైద్యం కోసం సొంత డబ్బులు ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారు. దేశంలో ముక్కలుగా ఉన్న వైద్య రంగాన్ని ఏకం చేసి ఒకే విభాగంలోకి తేవాలి. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందాలంటే హెల్త్​ సెక్టార్​ను జాతీయం చేయాలి.

చక్కటి ఆరోగ్య వ్యవస్థలు కలిగిన దేశాలు మూడు సార్వత్రిక ప్రజారోగ్య విధానాలను అమలు చేస్తున్నాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వైద్య సంరక్షణ బాధ్యత అక్కడి ప్రభుత్వాలే భుజాన వేసుకుంటున్నాయి. చైనా, జపాన్ వంటి దేశాలు ప్రైవేట్​ బీమా సంస్థల మీద ఆధారపడుతుండగా.. అమెరికా వంటి దేశాలు మిక్స్​డ్​ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలన్నీ తమ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందిస్తుండగా మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య, ఆరోగ్య రంగానికి అతి తక్కువ నిధులు కేటాయిస్తూ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో 90 శాతం మందికి హెల్త్​ ఇన్స్యూరెన్స్​ ఉంటే.. మనదేశంలో 139 కోట్ల మందిలో 27 కోట్ల మందికే హెల్త్​ ఇన్స్యూరెన్స్​ ఉన్నది. స్వాతంత్ర్యం తర్వాత దేశప్రజల ఆరోగ్యానికి సంబంధించి మూడు జాతీయ విధాన పత్రాలు వెలుగు చూశాయి. 1983, 2002, 2017లో వీటిని ప్రకటించారు. ఫలితంగా అత్యుత్తమ వైద్య సంస్థలైన ఎయిమ్స్​ వంటివి ఏర్పాటయ్యాయి.

జీడీపీలో 1.13 శాతమే కేటాయింపు

అభివృద్ధి చెందిన దేశాలు వైద్య, ఆరోగ్య రంగానికి తమ జీడీపీలో సగటున 7.5 శాతం నిధులు కేటాయిస్తున్నాయి. అమెరికా 17 శాతం, ఆఫ్ఘనిస్థాన్ 10.2, బ్రిటన్ 9.7, నేపాల్ 6.2, చైనా 5 శాతం నిధులు తమ జీడీపీలో కేటాయిస్తుండగా మన దేశం మాత్రం జీడీపీలో 1.13 శాతం నిధులే కేటాయిస్తోంది. 2017లో రూపొందించిన జాతీయ వైద్య విధానం ప్రకారం, 2025 నాటికి హెల్త్​కు కేటాయింపులు 2.5 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ 2021–-22 కేంద్ర బడ్జెట్​లో వైద్య, ఆరోగ్య శాఖ రూ.1,21,889 కోట్లు కేటాయించాలని కోరగా రూ.71,268 కోట్లు మాత్రమే కేటాయించారు. రాబోయే ఐదేండ్లలో దేశంలో ప్రాధాన్య వైద్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,38,305 కోట్లు అవసరం ఉండగా ఆ దిశగా కేంద్రం నిధులు కేటాయించడం లేదు. మన దేశ ప్రజల ఆరోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న తలసరి వ్యయం ఏటా రూ.1,657 మాత్రమే. ఈ మొత్తాన్ని రూ.4,000 వరకు పెంచితే దేశ ప్రజలకు ఒక మాదిరిగానైనా వైద్యం అందుబాటులోకి వస్తుంది. 

వసతుల లేమి, సిబ్బంది కొరత

దేశంలో అందుబాటులో ఉన్న ఆస్పత్రుల్లో 42% మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నవి. ఇక దేశంలో 20 శాతం ప్రాథమిక, 30 శాతం సామాజిక ఆరోగ్య కేంద్రాల కొరత ఉన్నది. దేశవ్యాప్తంగా ప్రతి 10 వేల జనాభాకు 3.5 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే 68 శాతం ప్రజలకు కనీస ఔషధాలు అందుబాటులో లేవు. వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్​వో) నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టర్, ముగ్గురు నర్సులు అందుబాటులో ఉండాలి. కానీ మనదేశంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు 0.68 డాక్టర్లు, 1.7 మంది నర్సులే అందుబాటులో ఉన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం దేశంలో 9.26 లక్షల మంది అల్లోపతి(ఎంబీబీఎస్) డాక్టర్లు, 7.88 లక్షల మంది హోమియోపతి, ఆయుర్వేద, యునాని డాక్టర్లు ఉన్నారు. దేశంలోని 555 మెడికల్​ కాలేజీల నుంచి ఏటా 83 వేల మంది మెడిసిన్​ చదివి బయటకు వస్తున్నారు. అయినా దేశంలో 6 లక్షల మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, 20 లక్షల మంది నర్సుల కొరత ఉన్నది. అందుబాటులో ఉన్న డాక్టర్లలో కూడా 80 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రుల్లోనే పనిచేస్తున్నారు. 555 మెడికల్​ కాలేజీల్లో ఒక్కటి కూడా గ్లోబల్​ ర్యాంకింగ్ లో 100లోపు స్థానం సంపాదించ లేదంటే మన వైద్య విద్య ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్కువ వేతనాలు

ప్రైవేట్​ ఆస్పత్రుల్లో ఒక ఎంబీబీఎస్​ డాక్టర్ నెలకు రూ.5 లక్షల నుంచి 6 లక్షలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.8 లక్షల వరకూ సంపాదిస్తుండగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకు జూనియర్ డాక్టర్‌‌కు రూ.22 వేలు, పీజీ డాక్టర్​కు రూ.45 వేలు, ప్రొఫెసర్, స్పెషలిస్టు డాక్టర్‌‌కు రూ.70 వేలు, నర్సుకు రూ.15 వేలు, ఏఎన్ఎంకు రూ.12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. తక్కువ వేతనాలు చెల్లిస్తుండటంతో వైద్య సిబ్బంది ఎవరూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయడానికి ఇష్టపడటం లేదు. కరోనాకు ముందు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో కలిపి 20 వేల మంది ఎంబీబీఎస్​ డాక్టర్లు, లక్ష మంది నర్సుల కొరత ఉంది. కరోనా తర్వాత ఈ సంఖ్య రెట్టింపు అయింది. వాస్తవ పరిస్థితి ఇలావుంటే కరోనా చికిత్సలకు 50 వేల వైద్య సిబ్బందిని తాత్కాలికంగా 3 నెలల కాలానికి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం పూర్తిగా బాధ్యతారాహిత్యమే. కరోనా ఉధృతంగా ఉండి, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో హెల్త్​ మినిస్టర్​ను తొలగించటం, వేరే వారిని నియమించకపోవడం దారుణం. సెక్రటేరియెట్​కే రాని, మంత్రులనే కలవని ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖను తన దగ్గరే ఉంచుకోవడం క్షమించరాని నేరం. ఇది ప్రజల జీవితాలతో ఆటలాడటం కిందే లెక్క.

ప్రజలు చేస్తున్న ఖర్చే ఎక్కువ

“హెల్త్​ సిస్టం ఫర్ ఎ న్యూ ఇండియా: బిల్డింగ్ బాక్స్” పేరుతో నీతిఆయోగ్ రిలీజ్​ చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో ప్రజల వైద్యానికి ఏటా రూ.6 లక్షల కోట్లకుపైగా ఖర్చవుతుండగా, వాటిలో ప్రజలు భరించేదే 63 శాతం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు 37 శాతమే. ఇందులో కేంద్రం వాటా 25 శాతం కాగా, రాష్ట్రాల వాటా 75 శాతంగా ఉన్నది. ప్రపంచంలో వైద్య, ఆరోగ్య రంగానికి ప్రజలు చేస్తున్న ఖర్చు సగటున 18 శాతం ఉండగా, మనదేశంలో అది 63 శాతం ఉండటం బాధాకరం. అమెరికాలో 87.2%,  బ్రిటన్​ 78.6, స్వీడన్​ 85, ఫ్రాన్స్​ 73.4, జర్మనీ 77.7, జపాన్​ 84, ఆస్ట్రేలియా 74, చైనా 56.4 శాతం ప్రభుత్వాలే ఖర్చు చేస్తున్నాయి. మనదేశంలో వైద్యం కోసం ప్రజలు చేస్తున్న ఖర్చులో 70 శాతం కార్పొరేట్ ఆస్పత్రులకు, 30 శాతం మందులకు ఖర్చు చేస్తున్నారు. ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చులో మనదేశం 145వ స్థానంలో ఉన్నది. ఈ విషయంలో శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ మనకంటే ముందున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిపడా నిధులు కేటాయించకపోవడంతో దీర్ఘకాలిక వ్యాధులొస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం లభించక, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​ చేయించుకోలేక ఏటా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన ప్రజలు 2005-15 మధ్య కార్పొరేట్ ఆస్పత్రులకు ఫీజుల రూపంలో రూ.16 లక్షల కోట్లు చెల్లించగా, 2020-30 మధ్య రూ.415 లక్షల కోట్ల వరకూ చెల్లించే అవకాశం ఉందనేది ఆరోగ్య నిపుణుల అంచనా.

హెల్త్​ను నిర్లక్ష్యం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

జాతీయ వైద్య విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ బడ్జెట్​లో వైద్య, ఆరోగ్య రంగానికి 8 శాతం నిధులు కేటాయించాలి. మేఘాలయ 9 శాతం, ఢిల్లీ 13.7 శాతం, పుదుచ్చేరి 8.6 శాతం మినహా మరే రాష్ట్రం ఆ విధంగా నిధులు కేటాయించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం 4.4 శాతమే కేటాయిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 10 ప్రభుత్వ, 17 ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ అనుబంధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, 6 జిల్లాస్థాయి ఆస్పత్రులు, 37 ఏరియా ఆస్పత్రులు, 99 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్​సీలు, బస్తీ దవాఖానాలు కలిపి 5,961 హెల్త్ ఫెసిలిటీస్​ పనిచేస్తున్నవి. ఇవికాక ఈఎస్ఐ ఆస్పత్రి, ఆర్టీసీ, ఆర్మీ, సీజీహెచ్ఎస్,​ రైల్వే ఆస్పత్రులు ఉన్నవి. కాగ్ నివేదిక ప్రకారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 43 శాతం సిబ్బంది కొరత ఉన్నది. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో 25–-75 శాతం వైద్య నిపుణుల కొరత ఉన్నది. కరోనాకు ముందే రాష్ట్రంలో వైద్య విభాగంలో 9,900 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి. సాధారణ పరిస్థితుల్లో వైద్యానికి తెలంగాణలో ఏటా రూ.14,000 కోట్లు ఖర్చవుతుండగా వాటిలో ప్రభుత్వం ఖర్చు రూ.6,500 కోట్లు కాగా.. ప్రజలు చేస్తున్న ఖర్చు రూ.7,500 కోట్లు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక బెడ్​కు ఏటా రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చవుతుండగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక పడకకు ఏటా8 లక్షలే ఖర్చు చేస్తున్నారు.

- కిన్నెర సిద్ధార్థ,
జాతీయ అధ్యక్షుడు,
ద్రవిడనాడు