ప్రాణాలు పణంగా పెట్టి 24 గంటలు డ్యూటీ చేస్తున్న హెల్త్ స్టాఫ్‌

ప్రాణాలు పణంగా పెట్టి 24 గంటలు డ్యూటీ చేస్తున్న హెల్త్ స్టాఫ్‌
  • ప్రాణాలు పణంగా పెట్టి కరోనాపై పోరాటం
  • 24 గంటలు డ్యూటీ చేస్తున్న హెల్త్ స్టాఫ్‌
  • రోజూ వేల మందికి టెస్టులు, ట్రీట్​మెంట్లు, వ్యాక్సిన్లు
  • పీపీఈ కిట్లతోనే ఏడెనిమిది గంటల పని
  • కరోనాతో 100 మందికి పైగా హెల్త్ స్టాఫ్ ​మృతి
  • కుటుంబ సభ్యులను కోల్పోయినోళ్లూ ఎందరో 
  • ఇప్పటికైనా జనం జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు 

హైదరాబాద్, వెలుగు: కరోనా పేషెంట్ల పట్ల హెల్త్‌ కేర్ వర్కర్లు దేవుళ్లుగా మారారు. కనిపించని మహమ్మారితో పోరాడుతూ ప్రజలను కాపాడేందుకు నిరంతరం పని చేస్తున్నారు. ఊపిరి కూడా సలపని స్థితిలో పీపీఈ కిట్లతోనే ఏడెనిమిది గంటలు సేవలు చేస్తున్నారు. సబ్‌ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి గాంధీ వంటి పెద్ద దవాఖాన్ల వరకూ రౌండ్‌ ది క్లాక్ పని చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో స్టాఫ్ కొరతతో ఒక్కో డాక్టర్, నర్స్‌ రోజూ పది గంటలు కూడా పని చేయాల్సి వస్తోంది. డాక్టర్లు ఇంటికి పోయినా, రోగులు వారి కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నయి. ఇలా రాత్రి, పగలు కరోనా పేషెంట్ల సేవల్లోనే ఉంటున్నరు. కొంత మంది డాక్టర్లు, హెల్త్ స్టాఫ్‌‌ కనీసం ఇంటికి కూడా పోకుండా పని చేస్తున్నరు. ఈ క్రమంలో వైరస్ బారిన పడి మరణించినవారు కూడా ఉన్నారు. ఇప్పటికే మన రాష్ర్టంలో 100 మందికిపైగా హెల్త్ స్టాఫ్‌‌ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. వేల మంది వైరస్ బారిన పడి, ఇబ్బందులుపడ్డారు. దవాఖానలో అంటిన వైరస్ కుటుంబ సభ్యులకు సోకి.. ఇంట్లోని పేరెంట్స్‌‌, ఇతరులు మరణించిన ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ, కరోనాపై పోరాటాన్ని హెల్త్ స్టాఫ్ నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు.

రోజంతా పేషెంట్ల మధ్యనే  
నెల రోజుల క్రితం వరకూ కరోనా టెస్టులు చేయించుకోవడానికి జనాలు రాలేదు. దీంతో హెల్‌‌ స్టాఫ్‌‌ ఊర్లకు పోయి మరీ టెస్టులు చేశారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఉదయం ఏడెనిమిది గంటల నుంచి పీహెచ్‌‌సీలు, సీహెచ్‌‌సీలు, పెద్దాస్పత్రుల వద్ద జనాలు టెస్టుల కోసం క్యూ కడుతున్నారు. ఒక్కో పేషెంట్‌‌కు ఐదు నిమిషాల చొప్పున వంద మందికి టెస్ట్ చేయాల్నంటే పొద్దు మూకుతోంది. టెస్ట్‌‌ శాంపిల్ తీసుకునే టెక్నీషియన్లు, నర్సులు పీపీఈ కిట్లలో ఉక్కపోతతో తడిసి ముద్దవుతున్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్‌‌, మరోవైపు టెస్టింగ్‌‌తో కింది స్థాయిలో పనిచేసే హెల్త్ స్టాఫ్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. 

వేల మంది హెల్త్ స్టాఫ్​పై ఎఫెక్ట్ 
కరోనా పేషెంట్లకు సేవలు అందిస్తూ ఇప్పటికే కొన్ని వేల మంది హెల్త్ స్టాఫ్ వైరస్ బారిన పడ్డారు. నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ సూపరింటెడెంట్, డాక్టర్ ప్రతిమ రెండుసార్లు కరోనా బారిన పడ్డారు. తాను సేవలు అందించిన హాస్పిటల్‌‌లోనే చికిత్స పొందుతున్నారు. ఆరేండ్ల పాపను కూడా చూసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి వాళ్లు వందల మంది ఉన్నారు. గాంధీ హాస్పిటల్‌‌ సూపరింటెండెంట్‌‌ రాజారావు ఏడాదిన్నరగా సెలవు పెట్టకుండా పని చేస్తున్నారు. హెల్త్ సిస్టంను మానిటర్ చేస్తున్న డీఎంఈ రమేశ్‌‌రెడ్డి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు లాంటి వాళ్లు కూడా ఎఫెక్ట్ అయ్యారు. శ్రీనివాసరావు తండ్రి కరోనాతో మృతి చెందారు. రమేశ్‌‌రెడ్డి రెండు సార్లు కరోనా బారిన పడ్డారు. బుధవారమే నిమ్స్ నుంచి డిశ్చార్జ్‌‌ అయ్యారు. 

పరిస్థితులు అస్సలు బాలేవు 
రాష్ట్రంలో 60 వేల మంది హెల్త్ ప్టాఫ్ ఏడాది నుంచి రెస్ట్ లేకుండా పని చేస్తున్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల దగ్గరి నుంచి నర్సులు, డాక్టర్ల వరకూ ఎంతో మంది కుటుంబ సభ్యులను కోల్పోయారు. నేను మా నాన్నను కోల్పోయా. హార్ట్​లో స్టెంట్ వేయించుకున్నా. దయచేసి బాధ్యతగా ఉండండి. పరిస్థితులు అస్సలు బాలేవు. హాస్పిటళ్లలో పరిస్థితి చూసైనా మారండి. జాగ్రత్తలు తీసుకుంటూ మిమ్మల్ని మీరే కాపాడుకోండి.  

– డాక్టర్ శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ 

ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు  
గాంధీలో ఇప్పటికే కొన్ని వేల మంది కరోనా రోగులకు ట్రీట్‌‌మెంట్ అందించాం. బెడ్ మీద నుంచి లేవలేని పేషెంట్లను కూడా బాగుచేశాం. అందరూ కష్టపడటం వల్లే ఇంత మందిని బతికించగలుగుతున్నాం. ప్రజలు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్ వరకూ వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు.  
‑ డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్‌‌, గాంధీ హాస్పిటల్‌‌ 

రోజూ 500 ఫోన్లు మాట్లాడుతున్నా 
రోజూ500 ఫోన్లు అటెంప్ట్ చేస్తున్న. దవాఖానాలో   ఇయ్యాల ఉన్న పేషెంట్ రేపు ఉండట్లే. యంగ్ పేషెంట్లు కూడా చనిపోతున్నారు. దయచేసి ఇంకో నెలరోజులు బయటకు రావొద్దు. హెల్త్ స్టాఫ్ ​చేతులెత్తేయాల్సిన పరిస్థితి వస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు.   
‑ డాక్టర్ ప్రభాకర్, నోడల్ ఆఫీసర్, గాంధీ ఆస్పత్రి