సౌత్​ కొరియన్​ ఫేమస్​ కిమ్​చీ పచ్చడి

సౌత్​ కొరియన్​ ఫేమస్​ కిమ్​చీ పచ్చడి

ఏ రకం కూరగాయలు అయినా, ఆకుకూరలైనా.. ఆయా సీజన్​లలోనే  ఫ్రెష్​గా దొరుకుతాయి. అందుకే వాటిని ఏడాదంతా నిల్వ చేయడానికి పచ్చళ్లు పెడుతుంటారు. అయితే పచ్చళ్లు నోటికి రుచిగానే ఉన్నా.. రోజూ తింటే ఆరోగ్యం పాడవుతుందని తెలిసిందే. కానీ, సౌత్​ కొరియన్​ ఫేమస్​ కిమ్​చీ పచ్చడి మాత్రం ఎంత తింటే అంత ఆరోగ్యం అంటున్నారు హెల్త్​ ఎక్స్​పర్ట్స్​. చాలా స్టడీలు కూడా ఇదే మాట చెప్తున్నాయి. 

  •  కిమ్​చీలో విటమిన్​ ఎ, కె, సిలతో పాటు పది రకాల మినరల్స్​, 34 అమైనో యాసిడ్స్​ ఉంటాయి. ఇవన్నీ  ఎముకల్ని బలంగా చేస్తాయి. ఇందులోని ఫోలేట్​, బీటా–కెరొటిన్​, క్రోలిన్​ మెదడుతో పాటు శరీరంలోని వివిధ భాగాలకి సిగ్నల్స్​ పంపించే నాడీ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతాయి. మూడ్​ స్వింగ్స్​ని కంట్రోల్​ చేస్తాయి. 
  • ఈ పచ్చడిలో ప్రో బయోటిక్స్​ ఎక్కువ. పెరుగు మాదిరే గుడ్​ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది ఇందులో. దీనివల్ల జీర్ణం​ తేలిగ్గా అవుతుంది. మెటబాలిజం హెల్దీగా ఉంటుంది. 
  • ఇందులో ఉండే ప్రోబయోటిక్స్​ కొలెస్ట్రాల్​ని తగ్గిస్తాయి. ఇన్​ఫ్లమేషన్​ని​ దరిచేరనివ్వవు. వీటిల్లో ఉండే బీటా– కెరొటిన్​, యాంటీ ఆక్సిడెంట్స్​ గుండె పోటు, క్యాన్సర్​, డయాబెటిస్​తో పాటు ఇతర గుండె జబ్బుల నుంచి కాపాడతాయి. రక్తంలోని షుగర్​ లెవల్స్​ని అదుపులో ఉంచుతాయి. 
  • క్యాబేజీలోని యాంటీ  ఆక్సిడెంట్స్​, యాంటీ ఇన్​ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఇమ్యూనిటీ పెంచుతాయి. అంతేకాదు కొరియన్ల మెరిసే చర్మానికి ఈ పచ్చడి కూడా ఒక కారణం అని స్టడీల్లో తేలింది.

తయారీ..

  • క్యాబేజీని నాలుగు భాగాలుగా తరగాలి. నీళ్లలో ఆరు నుంచి తొమ్మిది టేబుల్​ స్పూన్లు ఉప్పు వేసి, కరిగించాలి. ఆ నీళ్లలో క్యాబేజీ ముక్కల్ని రెండు గంటలు ఉంచాలి. ఆ తరువాత క్యాబేజీని చల్లటి నీళ్లతో శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి.  
  • నచ్చిన కూరగాయలు​ అన్నింటినీ నీళ్లలో ఉడికించి.. ఆ నీళ్లని గిన్నెలోకి తీసి వెజిటబుల్​ స్టాక్​ తయారు చేయాలి. 
  • పాన్​లో అర కప్పు వెజిటబుల్ స్టాక్​, గ్లూటెనస్​ బియ్యప్పిండి వేసి ఉడికించాలి. అందులో ఒక టేబుల్ స్పూన్​ చక్కెర కూడా వేసి మరో మూడు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపాలి.
  • ఆ మిశ్రమం పూర్తిగా చల్లారాక , మిక్సీ జార్​లోకి తీయాలి. అందులో మిగిలిన వెజిటబుల్ స్టాక్​, మూడు టేబుల్​ స్పూన్ల ఉప్పు, ఒక టీ స్పూన్​ చక్కెర,  అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ తరుగు వేసి మిక్సీ పట్టి పేస్ట్​ చేయాలి. ఆ పేస్ట్​లో ఘాటైన కారం వేసి బాగా కలపాలి. 
  • క్యాబేజీ, క్యారెట్ , ముల్లంగి ముక్కలు,   ఉల్లి కాడలకి ఆ పేస్ట్​ పట్టించి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని గాలి చొరబడని డబ్బాలో పెట్టి, వారం పదిరోజుల తర్వాత తీస్తే కిమ్​చీ రెడీ. దీన్ని మూడు నెలలు తినొచ్చు. మొదటిసారి ఈ పచ్చడి ట్రై చేసేవాళ్లు పెద్ద మొత్తంలో కాకుండా కొంచెం తయారుచేయాలి. 

కిమ్​చీకి కావాల్సినవి

చైనీస్​ క్యాబేజీ- మూడు కేజీలు
గ్లూటెనస్​ బియ్యప్పిండి- రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు, చక్కెర- సరిపడా
కూరగాయలు ఉడికించిన నీళ్లు​- ఒక కప్పు
వెల్లుల్లి రెబ్బలు- తగినన్ని
అల్లం(పొట్టు తీసి)-  ఒక టీ స్పూన్​
ఉల్లిగడ్డ తరుగు- నాలుగు టీ స్పూన్​లు
ఎండుమిర్చి పొడి-  ఒక కప్పు
ముల్లంగి- ఒకటి, ఉల్లికాడ తరుగు- ఒక కప్పు
క్యారెట్​ ముక్కలు- అర కప్పు

నోట్: గ్లూటెనస్​ బియ్యప్పిండిని స్టిక్కీ రైస్​ ఫ్లోర్​ అని కూడా అంటారు. అన్ని సూపర్​ మార్కెట్స్​లో ఇది దొరుకుతుంది.