హృదయ భాష.. కవితకే సాధ్యం

హృదయ భాష.. కవితకే సాధ్యం

పదఝరులను పారించినంత మాత్రాన కవిత కాదని, ప్రతి మదినీ తాకగలిగే భావముండాలని ఈ రచయిత్రికి తెలుసు. ఏది రాయాలో ఏది రాయకూడదో స్పష్టంగా తెలుసు. ‘‘ఆర్ద్రత నిండిన కవనం ఎపుడూ మనసును తాకును / భావం చూపక పదములు పేర్చే కావ్యం రాయను’’ అని ప్రకటించుకున్నది. అక్షరావని సాగుచేస్తూ మురవాలని ఆమె తపన. భావాల పంటతో మనసులను గెలుస్తుంది. సాహితీ వనంలో పరిమళం పంచుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘స్వప్న మంజరి’ రచయిత్రి స్వప్నకృష్ణది హృదయ భాష.ఈ పుస్తకంలో భావకవిత్వం పుష్కలం. నాయికా నాయకుల ప్రేమబంధం పెనవేసుకుంటుంది. ప్రణయరాగం పల్లవిస్తుంది. 

‘‘ఆరాధన చూపులకు అక్షరాలు లేవు సఖా / కడు ప్రేమను నింపుకున్న కన్నులనే చూడవోయి” అంటుందామె. ‘‘చూపులతో లేఖ రాసి నా మనసే దోచావే... నీ నవ్వుల వెలుగులలో జాబిలినే మరపింతువు’’ అంటాడతడు. ‘‘చూపులతో గాలమేసి బంధించుట నీకు తెలుసు / మాటలతో మాయచేసి మురిపించుట నీకు తెలుసు / నా దాసుడనంటూనే దొంగాటలు ఆడుతావు / అలవోకగ కనులు కప్పి క్రీడించుట నీకు తెలుసు / పదముల నెన్నో తెస్తూ అభిషేకం చేస్తావే / అలిగిన నీ ప్రియ సఖియను బులిపించుట నీకు తెలుసు / తారకతో పోల్చుతావు మేనకనని పొగడుతావు / చతురతనే చూపుతు నన్నోడించుట నీకు తెలుసు” అంటూ ఆమె అతనిలో ఒదిగిపోతుంది. ఆమె మమతతోనే మదిని చేరే వలపుగీతం రాస్తుంది. కనులతోనే హృదిని మీటే ప్రణయ కావ్యం రాస్తుంది. సఖుని గెలిచే తలపుతోనే ప్రేమ చరణం రాస్తుంది.

ఈ కావ్యంలో ఒకచోట ఉన్నట్లుగా ‘‘అపార్థాలను తొలచివేస్తే మధురమవదా ప్రణయబంధం / నాకు నీవై నీకు నేనై నడుస్తుంటే మేలుకాదా” అని ప్రతి ఆలుమగలూ అనుకుంటే సంసారంలో సరిగమలు పలుకవా! ప్రణయ పరిమళాలు గుబాళించవా! స్వప్నకృష్ణ కవిత్వంలో వాల్జడ గుప్పెడన్ని మల్లెలకే మురుస్తుంది. పూబాలల స్నేహాన్ని కోరుతుంది. నల్లత్రాచు మెలికలతో పలు మనసులు దోచుతుంది. నడుమొంపున గొప్ప నాట్యమాడుతుంది. హొయలు చూపి పతి అలకను మాన్పుతుంది.ఈ కావ్యం ఓ వైపు భావకవితా సుమమాల. మరోవైపు అభ్యుదయ కవితాహేల. ‘‘అలుపెరుగని పనులతోటి యంత్రమైతి రోజంతా / కాలపు గడియారంలో ముల్లునైతి రోజంతా” అనే వాక్యాలలో సగటు ఇల్లాలి ఆవేదన ఉంది. 

“రాయబడని కావ్యాలకు చిరునామా మగువ మనసు’’ అనడంలో స్త్రీ దయనీయ స్థితి ఉంది. సమాజంలో జరుగుతున్న లైంగికదాడులను ప్రస్తావిస్తూ “ఆడతనమును నలిపివేసే కీచకులదే అసుర నైజం / కరుణ మరచిన రాక్షసులను చంపకుండుట ఏమి న్యాయం’’ అని ప్రశ్నిస్తుంది. ధనమే ప్రధానమనుకొని పరుగులిడేవారు “సంపదలకు కొదవలేదు సంతోషం దరిచేరదు / తృప్తెరుగని ప్రతిజీవిది బ్రతుకేనని అనగలమా?” అని స్వప్న వేసే ప్రశ్నకు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ‘‘అణువణువున అహము కమ్మి మనిషితనం మరచినారు/ మంచెరుగని వారంతా నరులేనని అనగలమా?’’ అనే ప్రశ్నకు తమను తాము సంస్కరించుకోవాలి. “మంచి వైపుకు నడక సాగగ మనిషి మారితె ఎంత హాయి / నేరతత్వం వదిలి పెడుతూ శరణు వేడితె ఎంత హాయి” అని మానవత్వం వైపు మళ్లిస్తుంది. ‘‘లోకశాంతికి పాదులేసే మానవత్వం గొప్ప మంత్రం’’ అని ఉపదేశిస్తుంది. మనిషి “మరణమే పొందాక అమరమై నిలవాలి” అని ఆకాంక్షిస్తుంది. 64 గజళ్లలో రెండు భిన్నంగా ఉంటాయి. ఒకటి మధుశాల గురించి. రెండవది మహేశ్వరుని గురించి, దేని ప్రత్యేకత దానిదే.

కాసనగొట్టు స్వప్న వ్యక్తిత్వం ప్రశంసనీయం. ‘‘కపటమెరుగని మంచి మనసుకు తూగు సిరులే దొరకవెపుడూ’’ అని భావిస్తుంది. ‘‘అనురాగ వనములో పువ్వునై పూయాలి / నను తలచు పెదవిపై నవ్వునై చేరాలి” అని కోరుకుంటుంది. ఉపాధ్యాయ వృత్తి చేపట్టింది. భావితరానికి జ్ఞాన ప్రదాతగా మారింది. కవయిత్రి అయ్యింది.తేలికైన వాక్యాలలో ఎంతటి భావాన్నైనా పలికించగల సామర్థ్యం ఈమెకుంది. పాఠకులు ఈ గజళ్లను పాడుకొని ఆనందిస్తారు. కొత్తగా కవనం రాయడానికి కలం పట్టేవాళ్లు ఈ పుస్తకాన్ని చదివి కవనంలో మెలకువలు నేర్చుకోవచ్చు. హృదయంతో కవిత్వం రాసిన స్వప్నకృష్ణకు హృదయపూర్వక అభినందన.

- ఎ. గజేందర్ రెడ్డి,9848894086