గుప్పెడంత గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..

గుప్పెడంత గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..

ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ముఫ్పై నలభైయ్యేళ్లకే గుండె జబ్బులు వస్తున్నాయి.   దక్షిణాసియా దేశాలకి చెందిన ప్రజలకి జన్యుపరమైన లోపాల వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువని  లండన్​ లోని ఒక హార్ట్​ ఎటాక్​ సెంటర్​ పరిశోధనల్లో తేలింది. మన దేశంలో చాలామంది చిన్న వయసులోనే  హార్ట్​ ఎటాక్, స్ట్రోక్, అథిరోస్క్లెరోసిస్​ (రక్తనాళాల్లోఫ్యాట్​ చేరడం) వంటి గుండె జబ్బులతో చనిపోతున్నారు. ఈ సమస్యలు చిన్నవయసులోనే రావడానికి కొన్ని కారణాలున్నాయి. 

ఇవీ కారణాలు

గుండె జబ్బులకి కారణం లైఫ్​ స్టయిల్,  పనివేళల్లో మార్పులు, స్ట్రెస్​.  జంక్​ ఫుడ్, ఫాస్ట్​ఫుడ్, ప్రాసెస్డ్​ ఫుడ్ వంటివి  ఎక్కువ తినడం వల్ల  బరువుతో పాటు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. స్ట్రెస్​ వల్ల బిపి ఎక్కువ అవుతుంది.  బిపి, కొలెస్ట్రాల్, లావు కారణంగా గుండె మీద ఒత్తిడి పడుతుంది.  దాంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, గుండె కండరాలు దెబ్బతినడం వల్ల  హార్ట్​ఎటాక్, స్ట్రోక్​ వంటివి వస్తాయి. రోజూ కొంచెంసేపైనా వ్యాయామం చేయకపోవడం, ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల కూడా గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. 

రివర్సిబుల్​ 

గుండె జబ్బులు చాలావరకు రివర్సిబుల్​. అంటే...  డైట్​ రూల్స్​ కచ్చితంగా పాటించడం, రోజూ ఎక్సర్​సైజ్​ చేయడం ద్వారా ఈ సమస్యల్ని తగ్గించుకోవచ్చు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా (బ్లాక్స్) చూసుకోవచ్చు. హార్ట్​ పేషెంట్స్​లో ఏర్పడిన బ్లాక్స్​ తగ్గిపోయినట్లు  అమెరికా రీసెర్చర్ల  స్టడీల్లో తేలింది కూడా.  గుండె జబ్బుల బారిన పడితే, జీవితాంతం మెడిసిన్స్​ వాడాలని చెబుతారు డాక్టర్లు. అయితే, ఎవరైతే డైట్​రూల్స్​ పాటించరో, ఎవరైతే ఎక్సర్​సైజ్​ చేయరో వాళ్లకి  మెడిసిన్స్​ వాడడం తప్ప వేరే దారి లేదు.   

కరోనా పేషెంట్స్​లో....

కరోనా వచ్చిన వాళ్లలో చాలామందికి గుండె సంబంధిత సమస్యలు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. కరోనా వల్ల భయంతో చాలామంది ఆలస్యంగా హాస్పిటల్​కి వెళ్తున్నారు.  ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది ఏర్పడిన తర్వాతగానీ  డాక్టర్​ని కలవడం లేదు. అలాగే, కరోనా సోకిన వాళ్లలో  రక్తం తొందరగా గడ్డకట్టడం కూడా హార్ట్​ఎటాక్​, ఇతర గుండె సంబంధిత సమస్యలకి దారి తీస్తుంది.  

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  •   గంటల తరబడి కూర్చొని పనిచేయడం గుండెని ప్రమాదం లోకి నెడుతుంది. కాబట్టి  ఆఫీసు బ్రేక్​ టైంలో కొంత దూరం నడవాలి.  
  •   స్ట్రెస్​ తగ్గించుకోవాలి. రిలాక్స్​ అయ్యేందుకు ఏదైనా హాబీ పెట్టుకోవాలి. 
  •   స్మోకింగ్​, ఆల్కహాల్​ మానెయ్యాలి
  •   బరువు పెరగకుండా చూసుకోవాలి. ప్రొటీన్​, హెల్దీఫ్యాట్స్​ ఉన్న ఫుడ్​కి ప్రయారిటీ ఇవ్వాలి. 
  •   కార్డియో ఎక్సర్​సైజ్​లు చేయాలి.  జాగింగ్, వాకింగ్​.. ఇవి రెండూ బెస్ట్​ కార్డియో ఎక్సర్​సైజ్​లు.   
  •   రోజుకి ఒక్కపూట అయినా తాజా కూరగాయలు, పండ్లు తినాలి. బాదం, వాల్​నట్స్​, చిరుధాన్యాలు వంటివి డైట్​లో ఉండాలి. షుగర్​, ఉప్పు ఉన్న ఫుడ్ బాగా తగ్గించాలి. ఇలా చేస్తే హార్ట్​ఎటాక్​, హార్ట్​స్ట్రోక్​, అథిరోస్క్లెరోసిస్​​ వంటి జబ్బులు రాకుండా జాగ్రత్తపడొచ్చు.  

ఏం చేయాలంటే

నడుస్తున్నప్పుడు ఛాతిలో నొప్పి అనిపించినా, తిన్న తర్వాత కడుపులో మంటగా ఉన్నా, అసిడిటీ సమస్య ఉన్నా నిర్లక్ష్యం చేయొద్దు.  ముఫ్పైఐదేళ్లు దాటాక బిపి, షుగర్ టెస్టులు చేయించుకోవాలి. ఇసిజి (ఎలక్ట్రోకార్డియో గ్రామ్) తీయించుకుని  కార్డియాలజిస్ట్​ని కలవాలి.  ఒకవేళ అంతా నార్మల్​గా ఉంటే  రెండు మూడేళ్ల తర్వాత మళ్లీ  బిపి, షుగర్​ చెక్​ చేసుకుంటే మరీ మంచిది.   

 గుండెని ఆరోగ్యంగా ఉంచే తిండి

గుండె హెల్దీగా ఉండాలంటే జంక్​ఫుడ్​, చిప్స్​, స్ట్రీట్​ఫుడ్​ వంటివి బాగా తగ్గించాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచే మనసు పెట్టి తినడం (మైండ్​ఫుల్​ ఈటింగ్​) అలవాటు చేయాలి. పప్పులు, పొట్టుతో ఉన్న గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఉన్న బ్యాలెన్స్​డ్ డైట్​ఫాలో అవ్వాలి.  కూరగాయల్లో దొరికే​ ప్రొటీన్స్​ గుండెకి ఎంతో మంచివి. రక్త సరఫరాలో ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఫైబర్​ ఎక్కువగా లభించే  ఓట్స్, యాపిల్, దానిమ్మ, రాజ్మా, చోళె శెనగలు​ తినాలి. ఇవి తింటే ఎల్​డిఎల్ (లో– డెన్సిటీ లిపోప్రొటీన్)​ అనే చెడు కొలెస్ట్రాల్​ పెరగదు. బీపీ రాకుండా జాగ్రత్త పడొచ్చు. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్సి–, విటమిన్​– ఇ, ఒమెగా–3– ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్​తో గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది. వంటల్లో ఆయిల్ తక్కువ వేయాలి. అది కూడా లైట్​ వెయిట్​, తక్కువ ప్రాసెస్డ్​ చేసిన  వంట నూనె ​మాత్రమే వాడాలి. సన్​ఫ్లవర్​, మస్టర్డ్, కనోలా, రైస్​బ్రాన్​ వంటి ఆయిల్స్​లో గుండెని హెల్దీగా ఉంచే పోషకాలు ఉంటాయి. అందుకని ఇటువంటి నూనెలు వాడటం బెటర్​.  

నాన్​–వెజ్​ తగ్గించాలి

రెడ్ మీట్​ బదులు గుడ్లు, చేపలు (సాల్మన్​, ట్యునా), పీతలు ఎక్కువ తినాలి.  బాదం, వాల్​నట్స్, గుమ్మడి గింజలు, అవిసె గింజలు వంటివి కూడా హార్ట్​ని హెల్దీగా ఉంచుతాయి. బ్రెడ్​, రోటీతో జామ్ ​ తినే అలవాటు ఉంటే దానికి బదులు పీనట్​ బటర్​, మొలకెత్తిన గింజలు తినాలి. నీళ్లు సరిపోను తాగాలి. పండ్ల రసం లేదా మజ్జిగ.. తాగినా ఓకే. షుగర్​ కంట్రోల్​లో ఉంచుకోవాలి. రాత్రిపూట కొంచమే  తినాలి. డిన్నర్​ చేసిన రెండు గంటల తరువాత నిద్రపోవాలి. 

డాక్టర్ ఎ.ఆర్.కృష్ణ ప్రసాద్

కార్డియోథొరాసిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్