
హైదరాబాద్: ఎగువన కురుస్తోన్న వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద పొటెత్తింది. సోమవారం (సెప్టెంబర్ 29) రాత్రి సాగర్ ప్రాజెక్ట్‌కు ఉధృతంగా వరద నీరు రావడంతో26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్ట్‌కు 6,25,810 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. ప్రాజెక్ట్ ఇప్పటికే నిండుకుండలా ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే కిందకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం585.20 అడుగులుగా ఉంది.
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 295.010.టీఎంసీల నీరు నిల్వ ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ డ్యాంకు భారీగా వరద పొటెత్తడంతో దిగువ ప్రాంత ప్రజలకు ప్రాజెక్ట్ అధికారులు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు 6 లక్షల ఇన్ ఫ్లో వస్తుండగా వరద మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దిగువ కృష్ణ పరివాహక ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు, పశువుల కాపరులు, సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.