నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం..26 గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం..26 గేట్లు ఎత్తివేత

నల్లగొండ:నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం(ఆగస్టు 20) ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుండటంతో 26 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టుకు 4లక్షల  11వేల 237 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. మొత్తం గేట్లు ఎత్తి 4లక్షల 6వేల 218 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

నాగార్జున ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 584 అడుగులకు చేరింది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 294.5500 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. 

ప్రాజెక్టు ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిరంతరం కొనసాగుతోంది. దిగువకు విడుదలైన వరద నీటితో విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నారు. ప్రాజెక్ట్ దిగువనఉన్న నదీప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరదప్రవాహం కారణంగా నదీ తీర ప్రాంతాల్లోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.