మెరుపు వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయిన 200 మంది...

మెరుపు వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయిన 200 మంది...

హిమాచల్ ప్రదేశ్‌లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 26న మండి జిల్లాలోని బాగిపుల్​లో వరదలు పోటెత్తాయి. బగిపుల్​ ప్రాంతంలోని ప్రషార్​ సరస్సులో వచ్చిన వరదల్లో 200 మంది పర్యాటకులు, స్థానికులు చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

రహదారి కనెక్టివిటీ కూడా తెగిపోయిందని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అడ్డు వచ్చిన  ఇళ్లు, కార్లు కొట్టుకుపోయాయి. హనోగి మాత దేవాలయం సమీపంలోని జాతీయ రహదారిపై కూడా వరదలు విజృంభించాయి. 

హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు

అవుట్ సమీపంలోని ఖోటి నాలాలో ఆకస్మిక వరదల కారణంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. తెగిపోయిన రోడ్లకు ప్రత్యామ్నయ మార్గాలు కూడా బ్లాక్ అయ్యాయి. మండి-జోగిందర్ నగర్ హైవేని కూడా మూసి వేశారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ఈ రహదారులపై ప్రయాణించకూడదని పోలీసులు సూచిస్తున్నారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో 5 రోజుల పాటు వానలు..

రాబోయే ఐదు రోజుల్లో తూర్పు మధ్య వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తర్​ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో జూన్​26 న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.