
సిద్దిపేట రూరల్, వెలుగు : తెలంగాణలో కాళేశ్వరం కారణంగా భూమికి బరువయ్యే అంతా పంట పండిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో 40వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్, సామూహిక గొర్రెల షెడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని ఎల్లుపల్లిలో జిల్లా మహిళా సమాఖ్య భవనం, మిట్టపల్లి గ్రామంలో 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతేడాది కేంద్రం వడ్లు కొనబోమంటే తాము ఢిల్లీకి వెళ్లి కొట్లాడామన్నారు. నేడు దేశంలో ఎక్కడా పండని విధంగా వడ్లు పండటంతో పక్క రాష్ట్రాల వాళ్లు, ఎఫ్ సీఐ వాళ్లు బియ్యం కొంటామని తమను బతిమాలుతున్నారన్నారు. అనంతరం స్వయం సహాయక మహిళా సంఘాలకు 108 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను, రూ.72 లక్షల విలువైన ట్రాక్టర్స్ ను, రూ.4.50 లక్షల విలువైన ట్రాలీలను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీపీవో దేవికాదేవి, సీపీ ఎన్ శ్వేత, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, డీఆర్ డీవో గోపాల్ రావు, ఎంపీపీ సవితా ప్రవీణ్ రెడ్డి, మిట్టపల్లి సర్పంచ్ లక్ష్మి, ఎల్లుపల్లి సర్పంచ్ జయశ్రీ రమేశ్, జిల్లా మహిళా సమైఖ్య అధ్యక్షురాలు స్వాతి, ఎన్ఆర్జీఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ బాల్ రంగం పాల్గొన్నారు.
మైనింగ్ ఆఫీసర్ల పై దాడి చేసిన వ్యక్తుల రిమాండ్
కంది, వెలుగు : అక్రమంగా ఇసుక, మట్టి తరలింపును అడ్డుకోవడానికి వెళ్లిన మైనింగ్ ఆఫీసర్ల పై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సంగారెడ్డి రూరల్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం.. కంది మండలం బ్యాతోలు గ్రామంలో ఈనెల 6న అక్రమంగా ఇసుక మట్టి తరలిస్తున్నారని సమాచారంతో మైనింగ్ ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి తన డ్రైవర్ బీరయ్యతో కలిసి రైడ్‌కు వెళ్లారు. ఫైన్ వేయడానికి మైనింగ్ ఆఫీసర్లు వచ్చారన్న విషయాన్ని గమనించిన రమావత్ మహేందర్, రామావతు రమేశ్ ఆఫీసర్లపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో బీరయ్య తలకు గాయాలయ్యాయి. మైనింగ్ ఆఫీసర్లు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గురువారం అరెస్టు చేశారు. జ్యూడిషల్ రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
‘మన బడి’ పనుల్లో వేగం పెంచాలి
సిద్దిపేట రూరల్, వెలుగు : దుబ్బాక నియోజకవర్గంలోని మన ఊరు మన బడి పథకం పనుల్లో వేగం పెంచాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ లో దుబ్బాక నియోజకవర్గంలోని మన ఊరు మన బడి పథకంపై సమీక్ష నిర్వహించారు. జిల్లా మొత్తంలో దుబ్బాక నియోజకవర్గంలోనే మన ఊరు మన బడి పథక పనులు సరిగ్గా లేవని అసహనం వ్యక్తం చేశారు. ఏండ్ల నుంచి పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి, స్కూళ్లలో అన్ని వసతులు కల్పించేందుకు ప్రవేశపెట్టిన గొప్ప పథకం మన ఊరు మన బడి అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకొని పక్కాగా పనులు చేయించాలని సూచించారు. తర్వాత మీటింగ్లోపు పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కారు ఢీకొని మహిళ మృతి
పటాన్చెరు, వెలుగు : కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారంలో గురువారం జరిగింది. పటాన్చెరు పోలీసుల తెలిపిన ప్రకారం.. రుద్రారం గ్రామానికి చెందిన కురుమ రాములమ్మ(48) తన ఇంటి ముందు ఉన్న అరుగుపై కూర్చుని భోజనం చేస్తున్నది. అదే సమయంలో పుర్ర పాండు గ్రామంలో నుంచి హైవే వైపు కారు వేగంగా నడుపుతూ వస్తున్నాడు. కారు అదుపుతప్పి రాములమ్మను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలు భర్త ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
బీజేపీ లీడర్ల సంబురాలు
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో గురువారం ఉమ్మడి మెదక్జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనపై దేశ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ జెండా ఎగరనుందని ధీమా వ్యక్తం చేశారు.
- వెలుగు, నెట్వర్క్
రిపోర్టర్ల క్షేత్రం నారాయణఖేడ్
నారాయణ ఖేడ్, వెలుగు : నారాయణఖేడ్ ప్రాంతం రిపోర్టర్లకు క్షేత్రమని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. గురువారం నారాయణఖేడ్ లో టీయూడబ్ల్యూజే హెచ్ కొత్త కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నారాయణఖేడ్ నియోజకవర్గం బార్డర్లో ఉన్నప్పటికీ వార్తల సమీకరణలో ఇక్కడున్న రిపోర్టర్లు ముందు వరుసలో ఉన్నారన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి టీయూడబ్ల్యూజే కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 20వేల అక్రిడిటేషన్ కార్డులు సాధించుకున్నామన్నారు. అనంతరం కొత్తగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే హెచ్ 143 కార్యవర్గ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
29న దేశవ్యాప్త ఆందోళనలు
కోహెడ(హుస్నాబాద్), వెలుగు: గవర్నర్ల వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఈనెల 29న దేశవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం హుస్నాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అక్కడక్కడ శాంపిల్ గా ఇస్తున్నారని, అర్హులైన అందరికీ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న అన్ని మండలాల తహసీల్దార్ ఆఫీస్‌ల ఎదుట నిరసన చేపడుతామన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన మేరకు రాష్ట్రంలో సర్వే నంబర్ల వారీగా సమగ్ర భూ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్న నిజ నిర్ధారణ ఫలితాలు రావడం లేదని, ప్రభుత్వాలు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. అంతకుముందు అక్కన్నపేటలో జరిగిన పార్టీ జనరల్ బాడీ మీటింగ్‌లో ఆయన పాల్గొని హుస్నాబాద్ లో పార్టీకి పూర్వ వైభవం తీసుకోస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్, మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్, జాగిరి సత్యనారాయణ, గడిపే మల్లేశ్, ఎడల వనేశ్, జనార్దన్, మొండయ్య, రాజు, కొమురయ్య ఉన్నారు.
బీజేవైఎం కోహీర్ మండల అధ్యక్షుడిగా రాములు
మునిపల్లి (కోహీర్), వెలుగు : సంగారెడ్డి జిల్లా కోహీర్ బీజేవైఎం మండల అధ్యక్షుడిగా పిచేర్యాగడి గ్రామానికి చెందిన దిడిగి రాములు, కోహీర్ పట్టణ అధ్యక్షుడిగా ప్రసాద్ నియమితులయ్యారు. వారికి గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు మనోహర్ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసెంబ్లీ మైనార్టీ మోర్చా కన్వీనర్ రహమత్ అలీ, మండల ప్రధాన కార్యదర్శిలు నర్సింలు, డెవిడ్, ఉపాధ్యక్షుడు మధుకర్, మండల కార్యదర్శి గోవింద్ సీనియర్ నాయకులు శివకుమార్ పాల్గొన్నారు.
మెరుగైన జీవనం కోసం వలసలు
రామచంద్రాపురం, వెలుగు : మెరుగైన జీవనం కోసం ప్రజలు వలస వెళ్తుంటారని, దాదాపు 4.5 కోట్ల మంది భారతీయులు దేశంలో సంచార జీవనం గడుపుతున్నారని ఖతార్ లోని జార్జిటౌన్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉదయ్ చంద్ర అన్నారు. గురువారం గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘విదేశీయులు, సంచార వలసదారులు భారతదేశంలో మానవ చలన శీలత యొక్క సామాజికశాస్త్రం’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర గ్రామాలకు, గ్రామాల నుంచి పట్టణాలకు, ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి ఇలా.. మూడు రకాల మానవ చలనశీలతలు ఉన్నట్టు ఆయన తెలిపారు. మెజార్టీ వలసదారులు భారతదేశం అంతటా సంపన్న పట్టణ ప్రాంతాలలో ఉపాధి పొందుతున్నారని, అందులో అత్యధిక శాతం మంది అనధికారిక ఆర్థిక వ్యవస్థలో, అనిశ్చిత పరిస్థితులలో, తక్కువ ఉద్యోగ భద్రతతో పనిచేస్తున్నట్టు ఆయన వివరించారు. మానవ చలనశీలత చారిత్రక నేపథ్యాలను ఆయన వివరిస్తూ కాలానుగుణంగా, వాతావరణ మార్పులను బట్టి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజలు వలస వెళ్తుంటారన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన సందేహాలను ఆయన నివృత్తి చేశారు.
కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మెదక్ (శివ్వంపేట), వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. శివ్వంపేట మండలం గోమారం శివారులోని ఫంక్షన్ హాల్ లో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు నల్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. శివ్వంపేట మండలంలోని పోతులబోగూడ, ఉసిరికపల్లి నుంచి చెండి, గోమారం, నవాబ్ పేట్ నుంచి అనంతారం చౌరస్తా వరకు రోడ్లను బాగు చేయాలని, మండలంలో అర్హులందరికీ దళిత బంధు అమలు చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించాలని రాజకీయ తీర్మానం చేశారు. అనంతరం గుజరాత్ లో బీజేపీ గెలుపొందిన సందర్భంగా పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయపల్లి గోపి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ వాల్దాస్ మల్లేశ్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేశ్ పాల్గొన్నారు.
రోడ్ల నిర్మాణానికి రూ.25 కోట్లు
కోహెడ (బెజ్జంకి), వెలుగు : బెజ్జంకి మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.25 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. త్వరలో మండల పరిధిలోని పలు గ్రామాల రోడ్లు కొత్త శోభను సంతరించుకోనున్నట్లు చెప్పారు. నిధుల మంజూరుకు కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ నిర్మల, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, లక్ష్మణ్, తిరుపతిరాజయ్య ఉన్నారు.
ఘనంగా మహాపడి పూజ
నర్సాపూర్, వెలుగు : శబరిమల అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలో హరివరాసనం శతజయంతి మహోత్సవం, మహా పడిపూజను గురువారం ఘనంగా నిర్వహించారు. శివాలయం నుంచి అయ్యప్ప మాల భక్తులు పాదయాత్రగా కొత్తగా నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయం వరకు విగ్రహ, ఆభరణాల ఊరేగింపును నిర్వహించారు. ఊరేగింపును ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ ప్రారంభించారు. అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షుడు అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో ఊరేగింపు వైభవంగా కొనసాగింది. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, గురు స్వాములు పాల్గొన్నారు.
నిందితులను అరెస్టు చేయాలని బీజేపీ నేతల దీక్ష
సిద్దిపేట/సిద్దిపేట రూరల్, వెలుగు : డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుడు రమేశ్ ఆత్మహత్యకు కారణమైన కౌన్సిలర్ ప్రవీణ్ ను అరెస్టు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అరెస్టు చేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ గురువారం సిద్దిపేట అంబేద్కర్ విగ్రహం వద్ద వారు నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి సిద్దిపేటలో అవమానం జరుగుతోందన్నారు. కౌన్సిలర్ ప్రవీణ్ పైన పోలీసులు 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినా ఇప్పటికీ అరెస్టు చేయకపోవడమేంటని ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. న్యాయం జరిగే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ యాదవ్, నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, గుండ్ల జనార్ధన్, తోడుపునూరి వెంకటేశం, కెమ్మసరం సంతోష్, రాజు, సత్యనారాయణ, యాది, పద్మ, లక్ష్మి, రమేశ్, యాదన్ రావు పాల్గొన్నారు.
మల్లె చెరువులో గుర్తు తెలియని డెడ్‌బాడీ లభ్యం
రామాయంపేట, వెలుగు : రామాయంపేట పట్టణ శివారులోని మల్లె చెరువులో గుర్తు తెలియని డెడ్‌బాడీ లభ్యమైంది. ఎస్సై రాజేశ్తెలిపిన ప్రకారం.. మల్లె చెరువులో డెడ్ బాడీ ఉందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 50 ఏండ్లు ఉంటుందని భావిస్తున్నారు. డెడ్‌బాడీని రామాయంపేట గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.