నారాయణపూర్ రిజర్వాయర్​తో భారీ నష్టం

నారాయణపూర్ రిజర్వాయర్​తో భారీ నష్టం

గంగాధర, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నారాయణపూర్ రిజర్వాయర్​పరిధిలోని గ్రామస్తులు తీవ్రంగా నష్టపోయారు. వరద ధాటికి రోడ్లు కొట్టుకుపోగా, ఇళ్లు నేలమట్టమయ్యాయి. గంగాధరమండలంలోని నారాయణపూర్, ఎల్లమ్మ, గబ్బిలాల చెరువులను కలిపి నారాయణపూర్ రిజర్వాయర్ గా ఏర్పాటుచేశారు. ఈ చెరువులు నారాయణపూర్, చర్లపల్లి(ఎన్), మంగపేట, ఇస్తారిపల్లి, గంగాధర గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఈ రిజర్వాయర్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు కింద గంగాధర, మంగపేట గ్రామాలు, నారాయణపూర్, గబ్బిలాల చెరువులు నారాయణపూర్, చర్లపల్లి (ఎన్​), ఇస్తారిపల్లి గ్రామం పరిధిలో ఉంటాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో ఈ ఐదు గ్రామాల్లోకి వరదనీరు భారీగా చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.  

3 ప్యాకేజీల్లో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు

ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ రిజర్వాయర్​కు నీటిని తరలించి కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఇరిగేషన్ అధికారులు గతంలో ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకోసం నారాయణపూర్ చెరువు కట్టను 1.4 మీటర్ల ఎత్తుకు పెంచి 0.3 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం రూ.24.10 కోట్లు మంజూరు చేసింది. ఏళ్లు గడుస్తున్నా భూ నిర్వాసితులకు పరిహారం అందక పనులు ఇంకా ప్రారంభం కాలేదు.   

శాశ్వత పరిష్కారానికి వేడుకోలు

ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్ కు పంపింగ్ చేసి ఎడమ, కుడి కాలువల ద్వారా పొలాలకు నీటిని వదులుతారు. ఎల్లంపల్లి నుంచి నీటిని పంపింగ్ చేయడంతో పాటు ఈ రిజర్వాయర్​కు ఏటా వరదనీరు ఎక్కువగా రావడం, సామర్థ్యానికి మించి ప్రవహించడంతో ఐదు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇరిగేషన్ అధికారులు ఇటీవల కురిసిన వర్షాలకు నారాయణపూర్ చెరువుకు వరద ప్రవాహాన్ని ముందుగా అంచనా వేయలేకపోవడంతో వరద పోటెత్తి చెరువు ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో చెరువు కింద దిగువన ముంపునకు గురయ్యే నారాయణపూర్ ఎస్సీ కాలనీలోని పది కుటుంబాలను, ఇస్తారుపల్లిలోని 40 కుటుంబాలను కట్టుబట్టలతో గంగాధరలోని పునరావాస కేంద్రానికి తరలించారు.

పాత ఇళ్లు నేలమట్టం.. 

నారాయణపూర్ రిజర్వాయర్​కు ఎగువన ఉన్న కొడిమ్యాల, మల్యాల మండలాల నుంచి వరద ప్రవాహం తగ్గకపోవడంతో గ్రామం ఎక్కడ మునిగిపోతుందోననే భయంతో ఇరిగేషన్ అధికారులే నారాయణపూర్ చెరువుకు గండికొట్టారు. వరద ఉధృతికి గంగాధర శివారులోని లక్ష్మీదేవిపల్లి, నాగిరెడ్డిపూర్ రోడ్డు వరదలో కొట్టుకుపోయింది. ఇస్తారిపల్లిలోని రెండు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరో 15 ఇళ్లల్లోకి వరద చేరి గృహోపకరణాలు పాడయ్యాయి. కరెంట్ పోల్స్ నేలకూలాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వరద కారణంగా గ్రామాల్లో రహదారులు కొట్టుకుపోయాయి. పశువులు, కోళ్లు చనిపోయాయి. ఇస్తారిపల్లి వద్ద నిర్మించిన వంతెన వరదకు కొట్టుకుపోవడంతో గంగాధరలోని పది ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. నారాయణపూర్ రిజర్వాయర్ తో ముంపునకు గురవుతున్న నాలుగు  గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించాలని పదేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పునరావాస కేంద్రాలకు తరలించకుండా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

పరిహారం అందించకుండా..

నారాయణపూర్, చర్లపల్లి(ఎన్​), మంగపేట గ్రామాల్లో 240 ఎకరాలు, నారాయణపూర్​లో 25 ఇళ్లు, మంగపేటలో 11 ఇళ్లు, చర్లపల్లిలో కొన్ని ఇళ్లు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఇళ్ల యజమానులకు ఇప్పటివరకు పరిహారం అందలేదు. మంగపేటలో 87.16 ఎకరాల సాగుభూమి, 40 వ్యవసాయ బావులు, 11 ఇళ్లకు నాలుగేళ్ల క్రితం అవార్డు ఎంక్వైరీ జరిగి నిర్వాసితులు సంతకాలు చేసినా ఇంతవరకు పరిహారం అందలేదు.   

పరిహారం అందించాలి

నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని మంగపేట, చర్లపల్లి (ఎన్​), నారాయణపూర్, ఇస్తారిపల్లిని ప్రభుత్వం ముంపు గ్రామాలుగా ప్రకటించి పరిహారం అందించాలి. రిజర్వాయర్ నారాయణపూర్ గ్రామానికి తలాపున ఉంటుంది. ఏటా వర్షాకాలంలో ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందోనని గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం.

- ఎండీ. నజీర్​హుస్సేన్, సర్పంచ్, నారాయణపూర్