
సూర్యాపేట, వెలుగు: జిల్లాలో బుదవారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సూర్యాపేటలో 84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా చర్యలు చేపట్టింది. బుధవారం ఒక్కరోజే సుమారు 200 లారీల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. పిడుగుపాటుకు సీతారాంపురంలో 10 గొర్రెలు మృతి చెందాయి. కోదాడ మండలం నల్లబండగూడెంలో లక్ష్మయ్యకు చెందిన 39 గొర్రెలు, మేకలు చనిపోయాయి.
నల్గొండ అర్బన్ : అప్పాజిపేట పరిధి బంటుగూడెంలో పిడుగుపడి మహిళా రైతు జాల భిక్షవమ్మ(46) మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
దేవరకొండ( పీఏపల్లి) : పీఏపల్లి మండలం పెద్దగట్టు గ్రామంలో పిడుగు పడి రైతు మెగావత్ శంకర్ కు చెందిన రెండు దూడలు మృతి చెందాయి. రూ.50 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు.
హుజూర్ నగర్ : పిడుగుపడి, హుజూనగర్లోని పలువురి ఇండ్లలో విద్యుత్ పరికరాలు కాలిపోయాయి. పట్టణ శివారులోని గోవిందపురంలో ఇండ్ల గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గంటపాటు ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
చిట్యాల : మండలంలోని పలు గ్రామాల్లో, మున్సిపాలిటీలోని 12వ వార్డులో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. గంటల తరబడి విద్యుత్సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడ్డారు. విద్యుత్ శాఖ అధికారులు చెట్లను తొలగించి, విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
యాదాద్రి జిల్లాలో ..
యాదాద్రి, వెలుగు: యాదగిరిగుట్టలో అత్యధికంగా 40.5 మిల్లీ మీటర్లు, బీబీనగర్మండలం వెంకిర్యాలలో అత్యల్పంగా 3.3 మిల్లీ మీటర్ల వాన కురిసింది. కొనుగోలు సెంటర్లలోని వడ్లు తడవకుండా రైతులు టార్పాలిన్లు కప్పారు.